– రాజశేఖరబాబు చిత్తూరు ఎస్పీగా బదిలీ
– గతంలో జిల్లాలో డీఎస్పీగా పనిచేసిన అశోక్‌కుమార్
(సాక్షిప్రతినిధి, అనంతపురం) : అనంతపురం నూతన ఎస్పీగా జీవీజీ అశోక్‌కుమార్‌ను నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత ఎస్పీ రాజశేఖర్‌బాబును చిత్తూరు ఎస్పీగా బదిలీ చేశారు. గ్రూపు–1కు చెందిన అశోక్‌కుమార్ గతంలో అనంతపురం డీఎస్పీగా పనిచేశారు. మూడేళ్లు పాటు ఇక్కడ పనిచేశారు. ఆ తర్వాత ఏఎస్పీగా పదోన్నతిపై గుంటూరు జిల్లా గురజాల ఓస్డీగా వెళ్లారు. ఆపై హైదరాబాద్ ఇంటెలిజెన్స్‌కు బదిలీ అయ్యారు. 2004 తర్వాత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పీఎస్‌ఓ (పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్)గా పనిచేశారు. హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ డీసీపీగా పనిచేసి అక్కడి నుంచి తిరుపతి విజిలెన్స్ ఎస్పీగా బదిలీ అయ్యారు.
ఇక్కడ కూడా సమర్థ అధికారిగా పేరు తెచ్చుకున్నారు. ఆపై కడప ఎస్పీగా పనిచేశారు. తర్వాత విజయవాడ డీసీపీగా వెళ్లారు. తాజాగా అనంతపురం ఎస్పీగా నియమితులయ్యారు. అశోక్‌కుమార్ విధినిర్వహణలో నిక్కచ్చిగా వ్యవహరించే అధికారిగా పేరుంది. అనంతపురంలో డీఎస్పీగా సుదీర్ఘకాలం పనిచేసిన అనుభవం, కడప ఎస్పీగా పనిచేయడంతో రాయలసీమలోని శాంతిభద్రతలపై స్పష్టమైన అవగాహన ఉంది.
పక్షపాత పాలన
ఎస్పీ రాజశేఖరబాబు 2014 జూలై 22న బాధ్యతలు స్వీకరించారు. దాదాపు మూడేళ్లపాటు పనిచేసిన ఈయన మొదట్లో నిక్కచ్చిగానే వ్యవహరించారు. ఆపై పట్టుసడలించారు. దీంతో పోలీసుశాఖలో క్రమశిక్షణ గాడితప్పింది. ఎవరికివారు ఇష్టారాజ్యంగా విధులు నిర్వర్తించారు. దీంతోపాటు అధికారపార్టీ, ప్రతిపక్షపార్టీలపై పక్షపాత ధోరణితో వ్యవహరించారని, అధికారపార్టీకే మద్దతుగా నిలిచారనే విమర్శలు రాజశేఖరబాబుపై ఉన్నాయి. దీనికి తోడు ఓ ‘మిడిల్‌బాస్’ తప్పిదాలు చేస్తున్నారని, నిత్యం పంచాయితీలు, సెటిల్‌మెంట్లు చేస్తున్నారని తెలిసినా, లిఖిత పూర్వకంగా పలువురు ఫిర్యాదు చేసినా అదుపు చేయకుండా వెనుకేసుకొచ్చారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. రాజశేఖరబాబు ప్రవేశపెట్టిన ‘ఒకదొంగ– ఒక పోలీసు’ పూర్తి వైఫల్యం చెందింది. పోలీసు సంక్షేమం కోసం రాజశేఖరబాబు కృషి చేశారు.
‘అనంత’ ఎస్పీగా అశోక్‌కుమార్
Published Tue, Jun 20 2017 11:44 PM | Last Updated on Tue, Sep 5 2017 2:04 PM
Advertisement