నా భార్యను, కోడలిని బండబూతులు తిట్టారు
► అన్నదానం చేసిన కుటుంబాన్ని తీవ్రంగా అవమానించారు
► నా చేతులు నరికేసినట్లు అయింది
► ఒంట్లో రక్తం లేదు.. పౌరుషం లేదు.. అంతా సెలైన్ నీళ్లే
► వాళ్లకు భగవంతుడు శాస్తి చేసేవరకు మా ఇంట్లో పండగలు చేసుకోం
► ఆస్పత్రిలో నన్ను అంతర్జాతీయ ఉగ్రవాదిలా చూశారు
► టీవీ, సెల్ఫోన్, పేపర్ కూడా అందుబాటులో ఉంచలేదు
► కిర్లంపూడిలో దీక్ష విరమించిన ముద్రగడ పద్మనాభం, ఆయన భార్య పద్మావతి
► బంధువులను అవమానించారంటూ కన్నీటి పర్యంతమైన పద్మనాభం
కిర్లంపూడి
ఎంతోమందికి అన్నదానం చేసిన తన కుటుంబానికి తీరని అవమానం జరిగిందని కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం ఆవేదన వ్యక్తం చేశారు. నిరాహార దీక్ష ప్రారంభించిన మొదటి రోజే.. మూడు గంటలలోపే పోలీసులు తలుపులు పగలగొట్టుకుని లోపలకు వచ్చారని, తనను మర్యాదగానే తీసుకెళ్లినా, తన భార్యను రెండు రెక్కలు పట్టుకుని బూతులు తిడుతూ తీసుకెళ్లి.. ఎత్తి బస్సులో పారేశారని కన్నీటిపర్యంతమయ్యారు. తన కోడలిని, బావమరిది భార్యను, తన కొడుకును కూడా బండబూతులు తిడుతూ.. కొట్టుకుంటూ తీసుకెళ్లారని ఆయన చెప్పారు. కొడితే దిక్కెవడురా అంటూ నానా తిట్లూ తిట‍్టారన్నారు. 14 రోజుల పాటు చేసిన నిరవధిక నిరాహార దీక్షను ఆయన తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలోని తన స్వగ్రామంలో విరమించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. మన పరిపాలన ఇలా ఉందని, ముఖ్యమంత్రి పాలనలో ఇది కూడా ఒక భాగంగానే భావిస్తున్నానని చెప్పారు. ఆయన ఇంకా ఏమన్నారంటే....
- మాట్లాడేందుకు కూడా ఓపికలేదు.. ఉద్యమ విషయం అందరికీ తెలుసు
- ఆ సందర్భంలో కేసుల విషయంలో లోతైన దర్యాప్తు చేస్తే తప్ప అరెస్టుల పర్వం ప్రారంభించమని ఇచ్చిన వాగ్దానాన్ని పక్కన పెట్టారు
- మేమూ ముద్దాయిలమే అరెస్టు చేసుకోమని 7వ తేదీన పోలీసు స్టేషన్కు వెళ్లాం
- 9వ తేదీన టీవీలో 69 కేసులు నామీద పెట్టారని చెప్పడం విన్నాను
- అదనపు ఎస్పీ నన్ను అరెస్టు చేయడానికి వచ్చామన్నారు..
- సమన్లు ఇవ్వండి, ఎఫ్ఐఆర్ కాపీలు ఇప్పించమంటే ఏవీ లేవని అవమానించడానికే వచ్చినట్లుగా ప్రవర్తించారు
- మీరంతా చూస్తారన్న ఉద్దేశంతో మీడియాను బయటకు పంపి, తలుపులు పగలగొట్టి లోపలకు ప్రవేశించారు
- సాధారణంగా దీక్ష ప్రారంభించిన నాలుగు, ఐదు, ఆరో రోజు పరిస్థితి తీవ్రంగా ఉంటే అలా చేయడం పద్ధతి గానీ మొదటిరోజే, అది కూడా మూడు గంటలకే తలుపులు పగలగొట్టారంటే కక్ష సాధించడానికే అన్నట్లు ఉంది
- కానిస్టేబుల్ మొదలు డీజీపీ వరకు ఎంతోమంది ఆఫీసర్లకు నా చేత్తో కాఫీ ఇచ్చాను, టిఫిన్, భోజనాలు పెట్టాను
- వాళ్ల ఎంగిలి ఆకులు కూడా తీసిన రోజులు ఉన్నాయి
- ఐఏఎస్ ఆఫీసర్లు కూడా చాలామంది మా ఇంట్లో భోజనాలు చేశారు
- పోలీసు స్టేషన్లో ఫంక్షన్ ఉందంటే వాళ్లకు కావల్సినవన్నీ సమకూర్చేవాళ్లం
- స్టేషన్ కు పెద్దసారు వచ్చారంటే మేమే చేయాల్సి వచ్చేది
- అలా అన్నదానం చేసిన ఈ ఊరి ప్రజానీకానికి, కొద్దోగొప్పో అన్నం పెట్టిన నాకు చేతులు నరికేశారు
- అన్నదానం చాలా తప్పు అని చెప్పినట్లయింది
- అన్నం పెట్టిన మనిషిని కొట్టడం, తిట‍్టడం ఇక్కడ చేయరు
- అలాంటి కుటుంబాన్ని బూతులు తిట్టించుకునే దౌర్భాగ్యం నాకు కలిగింది
- అయినా పోలీసు వాళ్ల పట్ల నాకు ఎలాంటి కోపం లేదు
- ఎవరిమీదా చర్యలు కోరుకోవట్లేదు
- ఎవరినీ సస్పెండ్ చేయాలని, బదిలీ చేయాలని గానీ, చెవిలో పువ్వులు పెట్టే విచారణలు గానీ వద్దని చెప్పాను
- నా పాట్లు నేను పడతాను
- ఏ రాజకీయ నాయకుడి కుటుంబానికీ ఇలాంటి అవమానం జరిగి ఉండకపోవచ్చు
- మా తండ్రి ఎమ్మెల్యేగా పనిచేశారు. నేను ఎమ్మెల్యేగా, ఎంపీగా, మంత్రిగా పనిచేశా
- అయినా ఇలా అవమానించడం... చెప్పడానికి మాటలు రావడంలేదు
- ఈ అవమానానికి భగవంతుడు తగిన శాస్తి చేస్తాడని ఆశతో ఎదురుచూస్తున్నాను
- అప్పటివరకు మా ఇంట్లో ఏ పండగ చేసుకోం
- ఇప్పుడు నా శరీరంలో రక్తం లేదు, పౌరుషం, పట్టుదల లేవు.. సెలైన్ నీళ్లు మాత్రమే ఉన్నాయి
- ఎవరైనా దారిలో వెళ్తూ చెప్పుతో కొట్టినా నోరు విప్పలేని పరిస్థితిలో ఉన్నాను
- ఎవరినీ ఏమీ చేయలేని అల్పుడిని, అనాధను అని భావిస్తున్నాను
- పోరాడే శక్తి కోల్పోయాను.. కొంచెం ఊపిరి ఉంది. దాన్ని జాతికోసం, నన్ను నమ్ముకున్న ఇతరుల కోసం ఉపయోగిస్తాను
- ఇంత అవమానం జరిగినా.. మరింత పోరాడాలని ఉంది
- కాపు రిజర్వేషన్ల ఉద్యమాన్ని వదలకూడదని కోరుతున్నా
- ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలే అడుగుతున్నాను తప్ప కొత్తదేమీ అడగలేదు
- ఇచ్చిన హామీ అమలుచేయాలంటే సీఎంకు కోపం వస్తోంది.. ఎందుకో తెలియడంలేదు
- నన్ను అంతర్జాతీయ ఉగ్రవాదిలా చూశారు
- సెల్ ఫోను, టీవీ కూడా అందుబాటులో లేకుండా చూశారు.
- సెంట్రల్ జైల్లో ఉన్న మనిషికి పేపర్ అయినా ఇస్తారు. నాకు అది కూడా ఇవ్వలేదు
- నన్ను కూడా బూటుకాలుతో తన్నినా బాధపడను.. రిజర్వేషన్లు ఇవ్వండి చాలు
- నావల్ల నా సోదరులు, బంధువులు, అభిమానులు ఎంతోమంది అవమానపడ్డారు.. అందరికీ తలవంచి క్షమాపణలు చెబుతున్నాను
- రాష్ట్రవ్యాప్తంగా ఎంతోమంది పెద్దపెద్ద నాయకులు సంఘీభావం ప్రకటించారని చెబితే విన్నాను
-
వారందరికీ పేరుపేరునా పాదాభివందనాలు