తిరుమలకు మూడో ఘాట్ రోడ్డు?
తిరుమలకు ఇప్పటికే ఉన్న రెండు ఘాట్ రోడ్లకు తోడు మరో ఘాట్ రోడ్డు నిర్మించాలని టీటీడీ తలపెట్టింది. దీనిపై సాధ్యాసాథ్యాలను నిర్ణయించాల్సిందిగా ఇంజనీరింగ్ విభాగాన్ని ఆదేశించింది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు అతలాకుతలమైన ఆంధ్ర, తమిళనాడు ప్రాంతాల్లో వైద్య సేవలకు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రత్యేక బృందాలను పంపనున్నట్లు ప్రకటించింది. సోమవారం జరిగిన పాలక మండలి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
కాగా.. పాలక మండలి సమావేశంలో అనేక అభివృద్ధి పనులపై నిర్ణయాలు తీసుకున్నారు. ఒంటిమిట్ట కోదండ రామస్వామి ఆలయాన్ని రూ100 కోట్లతో అభివృద్ధి చేయాలని పాలక మండలి నిర్ణయించింది. తొలి విడతగా..రూ.20కోట్లు మంజూరు చేయనున్నారు.
మరో వైపు కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశ పెట్టిన గోల్డ్ స్కీమ్ లో శ్రీవారి నగలు ఉంచాలని నిర్ణయించారు. వడ్డీ ఎక్కువగా వచ్చే పక్షంలో ఈ పథకం ఉపయోగించుకోవాలని పాలక మండలి భావిస్తోంది. కోటీ ఆరు లక్షల రూపాయలు వెచ్చించి శ్రీవారి పట్టువస్త్రాలను కొనుగోలు చేయాలనే నిర్ణయానికి వచ్చారు.
ఏకాదశి గందరగోళం..
కాగా.. వైకుంఠ ఏకాదశికి భారీ ఏర్పాట్లు చేయాలని టీటీడీ నిర్ణయించింది. అయితే దీనికి సంబంధించి పాలకమండలి సమావేశంలో పాలక మండలి, అధికారుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఏకాదశి పాసుల వ్యవహారం ఇరు వర్గాల మధ్య బేదాభిప్రాయాలకు కారణమని తెలుస్తోంది. ఏకాదశికి కోరినన్ని పాసులు ఇవ్వాలని పాలక మండలి సభ్యులు డిమాండ్ చేశారు. కాగా.. దీనిపై అధికారాలు స్పందించలేదు. దీంతో పాసుల విషయంలో కాస్త గందరగోళం నెలకొంది.