ఇది దళితుల వ్యతిరేక ప్రభుత్వం
ఇది దళితుల వ్యతిరేక ప్రభుత్వం
Published Mon, Dec 5 2016 9:58 PM | Last Updated on Sat, Sep 15 2018 2:43 PM
* దళితుల భూములు లాక్కొని అగ్రవర్ణాలకు కట్టబెడుతోంది..
* ఏఎన్‌పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ జి.చార్వాక ధ్వజం
గుంటూరు ఎడ్యుకేషన్: దళితుల అభివృద్ధే ధ్యేయంగా పని చేస్తున్నామని చెబుతున్న ప్రభుత్వం దళితులకు చెందిన భూములను లాక్కుని అగ్రవర్ణాలకు కట్టబెడుతోందని అంటరానితన నిర్మూలన పోరాట సమితి (ఏఎన్‌పీఎస్) వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ జి.చార్వాక ఆరోపించారు. దళిత వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్న ప్రభుత్వ తీరుకు నిరసనగా సోమవారం జెడ్పీ ప్రాంగణంలో దళితులతో కలిసి ఆందోళన నిర్వహించారు. ఈసందర్భంగా చార్వాక మాట్లాడుతూ ప్రత్తిపాడు నియోజకవర్గంలో ప్రభుత్వం దళితులకు ఇచ్చిన భూములను అధికారుల అండదండలతో అగ్రకులాలలకు అప్పగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్తిపాడు, గుంటూరు, పెదనందిపాడు, వట్టిచెరుకూరు మండలాల్లో 1975లో అప్పటి కలెక్టర్ కత్తి చంద్రయ్య భూమిలేని దళితుల కుటుంబాలకు భూమిని మంజూరు చేయగా, కొర్నెపాడులో చెరువు భూములను అదే గ్రామానికి చెందిన దళితులకు మంజూరు చేశారన్నారు. నడింపాలెంలో దళితులకు ఇచ్చిన భూములను అగ్రకులాలకు దారాదత్తం చేస్తూ రెవెన్యూ అధికారులు పెద్దఎత్తున అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. దళితుడు కాండ్రు భాస్కరరావుకు ప్రభుత్వం మంజూరు చేసిన పట్టా భూమిని సైతం అదే ప్రాంతంలోని అగ్రకుల రాజకీయ నాయకులు కబ్జా చేసి నకిలీ డాక్యుమెంట్లు పుట్టించారని అన్నారు. దళతులకు న్యాయం చేయాలని జేసీ కృతికా శుక్లాను కోరారు. స్పందించిన జేసీ ఏఎన్‌పీఎస్ ఇచ్చిన ఫిర్యాదును సుమోటాగా స్వీకరించి కేసు నమోదు చేసి విచారణ జరిపి, దళితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఆందోళనలో సమితి జిల్లా అధ్యక్షుడు టి.ప్రసాదరావు, నరసరావుపేట డివిజన్ కన్వీనర్ చెల్లి కిషోర్, జిల్లా మహిళా అధ్యక్షురాలు తోటకూర సువర్ణకుమారి, కె.జయరాజు, ఇర్మియా, శ్యామ్‌బాబు, తిక్కరెడ్డిపాలెం బాబు పాల్గొన్నారు.
Advertisement
Advertisement