రంగారెడ్డి జిల్లా మూడు ముక్కలు!
♦ వికారాబాద్ కేంద్రంగా జిల్లా తథ్యం
♦ తూర్పు, ఉత్తరాది మండలాల తో కొత్త జిల్లాలు
♦ కొత్త కలెక్టరేట్లపై కలె క్టర్, జేసీలతో ప్రభుత్వం చర్చలు
♦ రెండు లక్షల చదరపు అడుగులు అవసరమని నివేదిక
♦ జూన్ 2 నాటికి తేలనున్న జిల్లా భవితవ్యం
కొత్త జిల్లాల స్వరూపం.. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా(అంచనా)
వికారాబాద్/రంగారెడ్డి(పశ్చిమ): వికారాబాద్, పరిగి, చేవెళ్ల, తాండూరు
తూర్పు: రాజేంద్రనగర్, ఉప్పల్, ఎల్‌బీ నగర్, మహేశ్వరం, ఇబ్రహీంపట్నం
ఉత్తరం: కుత్బుల్లాపూర్, మేడ్చల్, కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి, మల్కాజిగిరి
మరో నెల రోజుల్లో జిల్లా మూడు ముక్కలు కానుంది. ప్రస్తుత జిల్లా పరిధినే మూడు జిల్లాలుగా విడగొట్టనున్నారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజున కొత్త జిల్లాలను ప్రకటిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించిన నేపథ్యంలో నయా జిల్లాల ముఖచిత్రం దాదాపుగా ఖరారైనట్లు కనిపిస్తోంది. వికారాబాద్ కేంద్రంగా ప్రత్యేక జిల్లా ఆవిర్భావంపై ఇప్పటికే స్పష్టతనిచ్చిన సర్కారు.. మరో రెండు జిల్లాలను కూడా ఏర్పాటుచేసే దిశగా కసరత్తును కొలిక్కి తెచ్చినట్లు అధికారవర్గాల ద్వారా తెలిసింది.
సాక్షి, రంగారెడ్డిజిల్లా ప్రతినిధి: జిల్లా నైసర్గిక స్వరూపం, జనాభా, ఆదాయ వనరులు తదితర సమాచారాన్ని ఇదివరకే సేకరించిన సర్కారు.. తాజాగా కలెక్టరేట్, పోలీసు, ఇతర ప్రభుత్వ కార్యాలయాలకు అవసరమైన భవనాల స్థల విస్తీర్ణం, మౌలిక వసతులపై చర్చించేందుకు శుక్రవారం సచివాలయంలో సీఎం కార్యదర్శులు శాంతికుమారి, స్మితాసబర్వాల్.. జిల్లా జాయింట్ కలె క్టర్లు రజత్‌కుమార్ సైనీ, కాట ఆమ్రపాలితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఆ తర్వాత సీఎం కేసీఆర్ నిర్వహించిన సమావేశానికి కలెక్టర్ రఘునందన్‌రావు హాజరయ్యారు.
ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ కాంప్లెక్స్‌కు ఎన్ని చదరపు మీటర్ల స్థలం అవసరమవుతుందనే అంశంపై విస్తృతంగా చర్చించారు. పునర్వ్యస్థీకరణలో భాగంగా జిల్లాను ఎన్ని ముక్కలుగా విభజిస్తున్నారనే అంశ ంపై గోప్యతను ప్రదర్శిస్తున్న ప్రభుత్వం.. కార్యాలయాల నిర్వహణకు అవసరమైన స్థల విస్తీర్ణంపై మాత్రం సమాచారాన్ని తీసుకుంది. ప్రస్తుతం లక్డీకాపూల్‌లో కొనసాగుతున్న కలెక్టరేట్ ప్రాంగణంలోని స్ఫూర్తి (73,236 చ.అ), స్నేహా భవన్ (46430 చ.అ)లో ఆఫీసులు కొలువుదీరాయని, 48 విభాగాలు నగరంలో వివిధ చోట్ల పనిచేస్తున్నాయని ప్రభుత్వానికి నివేదించింది. ఈ లెక్కన కొత్త కలెక్టరేట్‌లో అన్ని కార్యాలయాలను ఒకే చోటకు చేరిస్తే 2-2.50 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం, 25 ఎకరాల భూమి అవసరమవుతుందని జిల్లా యంత్రాంగం తేల్చింది.
వికారాబాద్ ఖాయం!
భౌగోళిక స్వరూపం, రవాణా సౌకర్యం ఆధారంగా నయా జిల్లాలకు తుది రూపు ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో వికారాబాద్ కేంద్రంగా రంగారెడ్డి జిల్లా (పశ్చిమ) కొనసాగ నుందని తెలుస్తోంది. దీని పరిధిలో వికారాబాద్, చేవెళ్ల, తాండూరు, పరిగి నియోజకవర్గాలు ఉండనున్నాయి. ఇకఇబ్రహీంపట్నం కేంద్రంగా మహేశ్వరం, ఇబ్రహీంపట్నం, ఎల్‌బీనగర్, ఉప్పల్, రాజేంద్రనగర్ తూర్పు భాగమంతా ఒక జిల్లాగా ఏర్పడనుంది.
అలాగే ఉత్తరాన ఉన్న మేడ్చల్, కుత్బుల్లాపూర్, శేరిలింగంపల్లి, మల్కాజిగిరి, కూకట్‌పల్లి సెగ్మెంట్లతో మరో జిల్లా ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి జిల్లా యంత్రాంగం ప్రతిపాదించినట్లు తెలిసింది. ఈ మేరకు పాలనాపరమైన సౌలభ్యం, భౌగోళిక స్వరూపాన్ని పరిగణనలోకి తీసుకున్న సర్కారు ఉత్తర ప్రాంతాన్ని ఒక జిల్లాగా, తూర్పు వైపు మండలాలతో మరో జిల్లాగా మార్చే అంశాన్ని చురుగ్గా పరిశీలిస్తున్నట్లు సమాచారం. గ్రామీణ మండలాల (పశ్చిమ ప్రాంతం)తో వికారాబాద్ (రంగారెడ్డిజిల్లా)ను జిల్లాగా ఏర్పాటు చేయాలనే నిర్ణయానికి వచ్చినట్లు విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది.
సర్వత్రా ఉత్కంఠ!
జిల్లాల విభజనపై స్పష్టమైన సమాచారం రాకపోవడంతో ప్రజాప్రతినిధులు గందరగోళ ంలో పడ్డారు. అధికారుల నివేదికలను ప్రామాణికంగా చేసుకొని జిల్లాలను ఏర్పాటు చేస్తుండడాన్ని తప్పుబడుతున్నారు. లోక్‌సభ నియోజకవర్గాల ఆధారంగా కొత్త జిల్లాలుంటాయని.. ఈ క్రమంలో భువనగిరి(యాదాద్రి) పరిధిలోకి ఇబ్రహీంపట్నం వెలుతుందనే ప్రచారాన్ని తెరమీదకు తెచ్చారు. ఈ వార్తలతో ఉలిక్కిపడ్డ స్థానిక ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి.. ఇబ్రహీంపట్నం కేంద్రంగా ఎల్బీనగర్, మహేశ్వరం, రాజేంద్రనగర్, ఉప్పల్ సెగ్మెంట్లతో కలిపి జిల్లాను ఏర్పాటు చేయాలని సీఎంను అభ్యర్థించారు.
మరోవైపు రాజేంద్రనగర్‌ను వికారాబాద్ కేంద్రంగా ఏర్పడే జిల్లాలో విలీనం చేస్తారనే అంశంపై అక్కడి ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ విభేదిస్తున్నారు. మొయినాబాద్ మండల ప్రజాప్రతినిధులు కూడా పశ్చిమ జిల్లాలో కలిసేందుకు ససేమిరా అంటున్నారు. జిల్లా మంత్రి మహేందర్‌రెడ్డి మాత్రం వికారాబాద్, మల్కాజిగిరి పేరిట రెండు జిల్లాలు మాత్రమే ఉంటాయని, మల్కాజిగిరిలో ఇబ్రహీంపట్నం కలుస్తుందని స్పష్టం చేశారు. ఏదిఏమైనా మరో 25 రోజుల్లో ఏ నియోజకవర్గం.. ఏ జిల్లా పరిధిలోకి వెళుతుందనేది తేలిపోనుంది.