ప్రాణాలు తీసిన సెల్ఫీ | Three youth drowned while taking selfie | Sakshi
Sakshi News home page

ప్రాణాలు తీసిన సెల్ఫీ

Published Mon, Nov 14 2016 1:50 AM | Last Updated on Sat, Oct 20 2018 6:19 PM

ప్రాణాలు తీసిన సెల్ఫీ - Sakshi

ప్రాణాలు తీసిన సెల్ఫీ

  • మైపాడు బీచ్‌లో ముగినిపోయి ముగ్గురు యువకులు మృతి
  • పోలీసులకు తెలిస్తే ఇబ్బందువుతుందని మృతదేహాలను నెల్లూరుకు తీసుకువచ్చిన స్నేహితులు
  • నెల్లూరు రంగనాయకులపేట, కనుపర్తిపాడులో విషాదచాయలు
  •  
    నెల్లూరు(క్రైమ్‌) : సముద్రంలో సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించి మునిగిపోయి ముగ్గురు యువకులు మృత్యువాత పడ్డారు. ఇందుకూరుపేట పోలీసులు, సేకరించిన సమాచారం మేరకు.. నెల్లూరు రంగనాయకులపేట రైలువీధికి చెందిన ఎస్‌కే అబ్దుల్‌ ముసావీర్‌(23), రబ్బానీబాష, ఫాజిల్, ఇసుకడొంకకు చెందిన నదీమ్‌(23), కనుపర్తిపాడుకు చెందిన బి.హరీష్‌(24), అంబాపురానికి చెందిన సుబ్రమణ్యం, బట్వాడిపాలెంకు చెందిన గజేంద్రఉదయ్‌లు స్నేహితులు. ముసావీర్, రబ్బానీబాషాలు వెంకటాచలంలోని క్యూబా కళాశాలలో బీటెక్‌ పూర్తిచేసి ప్రస్తుతం ఉద్యోగ వేటలో ఉన్నారు. నదీమ్, సుబ్రమణ్యం, గజేంద్ర ఉదయ్‌లు బురాన్‌పూర్‌ సమీపంలోని హోండాషోరూమ్‌లో పనిచేస్తుండగా ఫాజిల్‌ ఎంజీబ్రదర్స్‌లో పనిచేస్తున్నాడు. ఆదివారం వీరంతా కలిసి మైపాడు బీచ్‌కు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఇందుకుగానూ నదీమ్‌ తన తండ్రి సర్వీసుకు తీసుకొచ్చిన మారుతీ వ్యాన్‌ను సిద్ధం చేశారు. ఆదివారం తెల్లవారుజామున ముసవీర్, రబ్బాని, ఫాజిల్, నదీమ్‌లు రంగనాయకులపేటలోని పెద్దమసీదులో నమాజు చేసుకుని బయటకు వచ్చేలోపు హరీష్,సుబ్రమణ్యం, గజేంద్ర ఉదయ్‌లు వచ్చారు. అందరూ కలిసి మైపాడు బీచ్‌కు వెళ్లారు. 
    అందరూ మునిగే చోటున కాకుండా..
    ఏడుమంది పర్యాటకులు మునిగే ప్రాంతంలో కాకుండా అతి సమీపంలో ఉన్న చేపలు ఆరబెటే ప్లాట్‌ఫాం ఎదురుగా మునిగేందుకు సముద్రపు నీటిలోదిగారు. కొంతసేపు సరదాగా ఆడుకున్నారు. ఇంతలో సెల్ఫీ తీసుకునేందుకు స్నేహితులు నీళ్లలో కొద్దిదూరం వెళ్లారు. అక్కడ సెల్ఫీ తీసుకునే క్రమంలో ప్రమాదవశాత్తు అలల తాకిడికి నీటిలో మునిగిపోయారు. గజేంద్ర ఉదయ్‌ ఈతకొట్టుకుంటూ కొద్దిదూరం వచ్చి పెద్దగా కేకలు వేశాడు. ఈవిషయాన్ని గమనించిన స్థానిక మత్స్యకారులు హుటాహుటిన సముద్రంలో దూకి మిగిలిన ఆరుగురుని రక్షించే ప్రయత్నం చేశారు. అప్పటికే పరిస్థితి విషమంగా మారింది. ముసావీర్, నదీమ్, హరీష్‌లు మృత్యువాత పడగా మిగిలిన వారిని సురక్షితంగా ఒడ్డున చేర్చారు. వారందరూ సముద్రం నీటిని తాగి ఉండటంతో వాటిని కక్కించారు. ఈ విషయం పోలీసులకు తెలిస్తే ఇబ్బందులు తలెత్తుతాయని భావించిన మిగిలిన స్నేహితులు మృతదేహాలను కారులో వేసుకుని నెల్లూరుకు చేరుకున్నారు. బాధిత కుటుంబ సభ్యులకు అప్పగించి అక్కడ నుంచి వెళ్లిపోయారు. విషయం తెలుసుకున్న ఇందుకురుపేట ఎస్ఐ ఎస్‌కే షరీఫ్‌ హుటాహుటిన నెల్లూరుకు చేరుకున్నారు. బాధిత తల్లిదండ్రులు మాత్రం తమకు ఎలాంటి కేసు వద్దని చెప్పడంతో చేసేదేమీ లేక వెనుదిరిగారు. 
    విషాదచాయాలు
    ముసావీర్‌ మృతితో రంగనాయకులపేట రైలువీధిలో విషాదచాయలు అలముకున్నాయి. రైలువీధికి చెందిన ముస్తాక్‌ బైక్‌ మెకానిక్, అతనికి ముగ్గురు పిల్లలు. రెండోకుమారుడు ముసాఫీర్‌. ముస్తాక్‌ తన పిల్లలను ఉన్నత చదువులు చదివించడంతో పాటు క్రమశిక్షణగా పెంచాడు. ముసాఫీర్‌ క్యూబా కాలేజీలో బీటెక్‌ పూర్తిచేసి ఉద్యోగ వేటలో ఉన్నాడు. కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉంటాడనుకున్న కుమారుడు విగతజీవిగా మారడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.  
    ఎవరి కోసం బ్రతకాలి?
    కన్నకొడుకు మృత్యువాత పడడంతో ఇక తామెవరికోసం బ్రతకాలని నదీమ్‌ తల్లిదండ్రులు విలపించారు. ఇసుకడొంకకు చెందిన నజీర్‌కు నదీమ్, ఓ కుమార్తె ఉంది. ఆయన కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఒక్కగానొక్క కొడుకు కావడంతో అల్లారుముద్దుగా పెంచుకున్నాడు. నదీమ్‌ సైతం తండ్రి మాటను జవదాటేవాడే కాదు. ప్రస్తుతం వెంకటాచలం మండలం బురాన్‌పూర్‌ సమీపంలోని హోండాషోరూమ్‌లో పనిచేస్తూ కుటుంబానికి చేదోడువాదోడుగా ఉంటున్నాడు. అతనికి పెళ్లిచేసే ప్రయత్నాల్లో కుటుంబసభ్యులున్నారు. ఈనేపథ్యంలో సముద్రం మృత్యువురూపంలో నదీమ్‌ను బలితీసుకుంది. తామెవరికీ అన్యాయం చేయలేదని, అయినా దేవుడు తమకు ఎందుకు ఇంత శిక్ష వేశాడని గుండెలవిసేలా రోదించారు. 
    పెళ్లైన ఏడాదిన్నరకే.. 
    బైనమూడి హరీష్‌కు ఏడాదిన్నర క్రితం పూజ రోహితతో వివాహమైంది. వివాహమైన నాటినుంచి దంపతులు ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. హరీష్‌ బురాన్‌పూర్‌లోని హోండా షోరూమ్‌లో పనిచేస్తున్నాడు. ఆదివారం సముద్రస్నానికి వెళుతున్నాని కుటుంబసభ్యులకు చెప్పి ఇంట్లోనుంచి బయటకు వచ్చాడు. బీచ్‌లో మునిగి మృతిచెందాడు. అతని భార్య గుండెలవిసేలా రోదించడం చూపరులను కంటతడిపెట్టించింది. 
     
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement