ఎందుకీ నిర్లక్ష్యం..?
- ఫసల్‌బీమాపై వ్యవసాయశాఖ మౌనం
- రబీలో ఐదు పంటలకు వర్తింపజేసిన బీమా కంపెనీ
- అరకొర సాగు నేపథ్యంలో ఇబ్బంద్లుఓ రైతులు
అనంతపురం అగ్రికల్చర్: ప్రధానమంత్రి ఫసల్‌బీమా యోజనా (పీఎం ఎఫ్‌బీవై) బీమా పథకంలో రైతులకు ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి..? అన్నది ఇప్పుడు రైతులను వేధిస్తున్న ప్రశ్న. ఈ అంశంపై వ్యవసాయశాఖ మౌనం పాటిస్తుండటంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. అక్టోబర్ 28న వ్యవసాయ బీమా కంపెనీ నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే అధికారులు మాత్రం పథకం అమలు గురించి ఏమీ చెప్పడం లేదు. రబీకి సంబంధించి జిల్లాలో వరి, జొన్న, పప్పుశెనగ, వేరుశనగ, పొద్దుతిరుగుడు పంటలకు ఫసల్ బీమా వర్తింపజేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఫసల్‌బీమా కింద ఖరీఫ్‌లో అయితే రైతు వాటాగా 2 శాతం, రబీ పంటలకైతే 1.5 శాతం ప్రీమియం చెల్లించాలనే నిబంధన ఉంది. ఇందులో వరి హెక్టారుకు రూ.33,750, జొన్నకు రూ.20 వేలు, పప్పుశెనగకు రూ.21,250, వేరుశనగకు రూ.45 వేలు, పొద్దుతిరుగుడుకు రూ.25 వేలు బీమా పరిహారం వర్తింపజేశారు. పప్పుశెనగ పంటకు డిసెంబర్ 15, జొన్న, వేరుశనగ, పొద్దుతిరుగుడుకు డిసెంబర్ 31, వరికి జనవరి 15వ తేదీలోగా ప్రీమియం చెల్లించాలని గడువు విధించారు.
రైతుల మేలు పట్టదా..?
ప్రస్తుతం నెలకొన్న వర్షాభావ పరిస్థితులు, అరకొరగా పప్పుశెనగ పంట సాగులోకి రావడంతో రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. గతంలో అమలు చేసిన పంటల బీమా పథకాలలో పోల్చితే ఫసల్‌బీమాలో రైతులకు ఉపయోగపడేలా అనేక వెసులుబాట్లు కల్పించారని చెబుతున్నా... అవి ఏంటనే విషయాన్ని మాత్రం ఎవరూ చెప్పడం లేదు. వర్షాభావ పరిస్థితులతో పాటు అగ్నిప్రమాదం, పిడుగుపాటు, గాలివాన, తుపాను, తీవ్ర తుఫాను, టోర్నడోలు, వరదలు, నీట మునగడం, భూమి దిగిపోవడం, అనావృíష్టి, వాతావరణం బాగుండకపోవడం, పంటకు తెగుళ్లు, కీటకాలు ఆశించి నష్టం జరిగినా బీమా పరిధిలోకి తెచ్చినట్లు సమాచారం. అలాగే పంట కోతల తర్వాత పంట తడిచినా పరిహారం వర్తింపజేశారు. ఇవన్నీ కాకుండా పంటకు వేయడానికి భూములు దుక్కులు చేసుకుని, విత్తనాలు, ఎరువులు సమకూర్చుకున్న తర్వాత వర్షాలు లేక విత్తనం వేయలేని పరిస్థితి ఏర్పడినా 25 శాతం వరకు పరిహారం వర్తింపజేయాలనే నిబంధన కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే బీమా చేసిన రైతు, ట్రాక్టర్, వ్యవసాయ సామగ్రిని కూడా బీమా పరిధిలోకి తీసుకువచ్చినట్లు చెబుతున్నారు. గత పథకాలతో పోల్చితే ఫసల్‌బీమాలో వెసులుబాట్లు ఉన్నా అవి రైతులకు ప్రయోజనం కల్పించేలా అధికారులు చర్యలు చేపట్టకపోవడం విశేషం. ఇపుడున్న పరిస్థితుల్లో పప్పుశెనగ రైతులకు కొంత లబ్ధికలిగే అవకాశాలు ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా నల్లరేగడి భూములు కలిగిన 25 మండలాల్లో 80 నుంచి 90 వేల హెక్టార్ల విస్తీర్ణంలో పప్పుశెనగ వేయడానికి రైతులు అన్నీ సిద్ధం చేసుకున్నారు. ఖర్చు పెట్టి భూములు దుక్కులు చేసుకున్నారు. విత్తన పప్పుశెనగ, ఎరువులు కొనుక్కున్నారు. అయితే తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో 10 వేల హెక్టార్లకు మించి పంట వేయలేకపోయారు. ఇలాంటి సమయంలో ఫసల్‌బీమా ఆదుకునే పరిస్థితి ఉంటే వ్యవసాయశాఖ తక్షణ చర్యలు తీసుకుంటే రైతులకు కొంత వరకు మేలు జరిగే పరిస్థితి ఉంది. హెక్టారుకు రూ.21,250 పరిహారం వర్తింపజేసినందున రైతుల నుంచి 1.5 శాతం ప్రీమియం కట్టిస్తే కనీసం 25 శాతం బీమా పరిహారమైన వచ్చే పరిస్థితి ఉందని చెబుతున్నారు.
బీమా కంపెనీతో మాట్లాడుతున్నాం - శ్రీరామమూర్తి, జేడీ, వ్యవసాయశాఖ
ఫసల్ బీమా పై స్పష్టమైన నిబంధనలు, వెసులుబాట్ల గురించి రాష్ట్ర బీమా కంపెనీతో మాట్లాడుతున్నాం. అననుకూల పరిస్థితుల నడమ పంట వేయకపోయినా పరిహారం వచ్చే నిబంధన ఉంటే తప్పనిసరిగా ప్రీమియం కట్టించేలా చర్యలు తీసుకుంటాం.