
రోడ్డుకు అడ్డంగా పులి: నిలిచిపోయిన ట్రాఫిక్
జన్నారం: ఆదిలాబాద్ జిల్లా జన్నారం మండలంలోని కవ్వాల్ టైగర్ జోన్ పరిధి పైడిపల్లి అటవీప్రాంతంలో శుక్రవారం అర్ధరాత్రి ఓ పులి బస్సులోని ప్రయాణికులను ముచ్చెమటలు పట్టించింది. రోడ్డుకు అడ్డంగా వచ్చిన ఆ పులి దర్జాగా అరగంట పాటు కదలకుండా ఉండిపోయింది. ప్రత్యక్ష సాక్షి కథనం ప్రకారం.. నిర్మల్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు మేడారం జాతర వెళ్లి లక్సెట్టిపేట నుంచి జన్నారం వైపు వస్తోంది. ఆ క్రమంలోనే రోడ్డుకు అడ్డంగా పులి కనిపించింది.
బస్సు లైట్ల వెలుగులో పులి కళ్లు మెరవడంతో డ్రైవర్ వెంటనే బస్సును అక్కడే నిలిపివేశాడు. అదే సమయంలో తాళ్లపేటకు చెందిన కంది శ్రీనివాస్ తన స్నేహితులు ఇద్దరితో కలిసి జన్నారం నుంచి రాత్రి 11.30 గంటలకు తాళ్లపేటకు బయల్దేరాడు. బస్సు అప్పటికే అక్కడ నిలిపివేయడంతో తన బైక్‌ను కూడా ఆపాడు. సుమారు 35 నిమిషాల వరకు పులి అక్కడే ఉంది. తర్వాత అడవిలోకి వెళ్లిపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ఎన్నడూ చూడని పులి తమ కళ్ల ముందే ప్రత్యక్షమవ్వడంతో ప్రయాణికులు భయంలో వణికిపోయారు. పులి వెళ్లిపోయాక బస్సు జన్నారం వైపు బయల్దేరింది.