ఉదయం 8 నుంచి 11.30 గంటల వరకే
ప్రొద్దుటూరు : మండుతున్న ఎండలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం అంగన్‌వాడీ కేంద్రాల పని వేళలను మార్పు చేసింది. ఈ ప్రకారం నేటి నుంచి అంగన్‌వాడీ కేంద్రాలు ఉదయం 8 గంటల నుంచి 11.30 గంటల వరకు పని చేయాలని ఆదే శాలు జారీ అయ్యాయి. జూన్ 12వ తేది వరకు ఈ విధానాన్ని అమలు చేస్తారు. జిల్లాలో మొత్తం 15 ఐసీడీఎస్ ప్రాజెక్టులు ఉన్నాయి. వీటి పరిధిలో వేలాది మంది చిన్నారులు, గర్భవతులు, బాలింతలు ప్రతి రోజు పౌష్టికాహారం తీసుకుంటున్నారు. ప్రొద్దుటూరు రూరల్, ముద్దనూరు, పులివెందుల, రాయచోటి, లక్కిరెడ్డిపల్లె, బద్వేలు, పోరుమామిళ్ల ప్రాజెక్టుల పరిధిలో అన్న అమృత హస్తం పథకం అమలవుతోంది. ప్రస్తుతం అంగన్‌వాడీ కేంద్రాలు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పనిచేస్తున్నాయి.
కొద్ది రోజులుగా వాతావరణంలో పూర్తి మార్పు కనిపిస్తోంది. పలు చోట్ల 42 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు కావడంతో చిన్నారులు ఇబ్బంది పడుతున్న విషయం ప్రభుత్వం దృష్టికి వెళ్లడంతో పని వేళలను మార్పు చేశారు. ఉదయం 11 గంటల లోపే లబ్ధిదారులకు పౌష్టికాహారాన్ని అందించాలని సూచించారు. అయితే అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలు మాత్రం మధ్యాహ్నం 3 గంటల వరకు అంగన్‌వాడీ కేంద్రాల్లోనే ఉండాలని సూచించడంపై నిరసన వ్యక్తమవుతోంది. మే 1 నుంచి 15వ తేది వరకు కార్యకర్తలకు, 16 నుంచి 31 వరకు ఆయాలకు సెలవులు ఇవ్వాలని ఆదేశించారు. జిల్లా ప్రాజెక్టు డైరక్టర్ రాఘవరావు ఆయా ప్రాజెక్టుల సీడీపీఓలకు పని వేళల మార్పుపై సమాచారం అందించారు.