సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రం ప్రభుత్వం జూలై 1నుంచి కొత్త కార్మిక చట్టాలను అమలు చేయనుంది. ఈ కొత్త కార్మిక చట్టాలు అమలుతో కార్యాలయ పని వేళలు, ఉద్యోగుల భవిష్య నిధి, వేతనాలలో గణనీయమైన మార్పు చోటు చేసుకోనుంది. అలాగే ఆఫీసు వేళలు, పీఎఫ్ పెరిగే అవకాశం ఉన్నప్పటికీ టేక్-హోమ్ జీతం తగ్గే అవకాశం ఉంది.
జూలై 1 నుంచి కొత్త లేబర్ కోడ్‌లను అమలు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అయితే, కొన్ని రాష్ట్రాలు ఇంకా నాలుగు లేబర్ కోడ్‌ల కింద నిబంధనలను రూపొందించలేదు. 23 రాష్ట్రాలు,కేంద్ర పాలిత ప్రాంతాలు (UTలు) మాత్రమే వేతనాలపై కోడ్ ముసాయిదా నిబంధనలను ప్రచురించాయని కార్మిక ఉపాధి శాఖ సహాయ మంత్రి రామేశ్వర్ లోక్‌సభ లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు.
కొత్త లేబర్ కోడ్స్, మార్పులు
జూలై 1వ తేదీ నుంచి కొత్త కార్మిక చట్టాలు అమలైతే, ఆఫీసు పని గంటలను 8-9 గంటల నుండి 12 గంటల వరకు పెంచవచ్చు. అయితే పనిగంటలు పెరిగితే ఉద్యోగులకు మూడు వీక్లీ ఆఫ్‌లు ఇవ్వడం తప్పనిసరి. అలాగే ఆఫీస్ పనివేళలను మార్చుకోవడానికి కంపెనీలకు వీలుంటుంది. కాబట్టి, వారంలో పనిదినాలు నాలుగు రోజులకు తగ్గించబడతాయి, కానీ వారంలో మొత్తం పని గంటలు ప్రభావితం కావు. కొత్త వేతన కోడ్ ప్రకారం వారానికి మొత్తం 48 పని గంటలు తప్పనిసరి.
కొత్త వేతన కోడ్ ప్రకారం టేక్-హోమ్ జీతం కాంపోనెంట్, ప్రావిడెంట్ ఫండ్‌కు యజమానుల సహకారంలో మార్పు ఉంటుంది. స్థూల నెలవారీ జీతంలో కనీసం 50 శాతం బేసిక్ జీతం ఉంటుంది కాబట్టి ఉద్యోగుల టేక్-హోమ్ జీతం కూడా గణనీయంగా మారుతుంది. ఇది ఉద్యోగి, యజమాని పీఎఫ్ కంట్రిబ్యూషన్లు పెరుగుతాయి. కొంత మంది ఉద్యోగులకు, ముఖ్యంగా ప్రైవేట్ రంగ ఉద్యోగులకు టేక్ హోం జీతం తగ్గుతుంది. అయితే ఉద్యోగి పదవీ విరమణ తర్వాత వచ్చే డబ్బు, గ్రాట్యుటీ మొత్తం పెరుగుతుంది.
కాగా కేంద్ర ప్రభుత్వ నాలుగు కొత్త లేబర్ కోడ్స్ అమలుకు కేంద్రం యోచిస్తోంది. వేతనాలు, సామాజిక భద్రత, పారిశ్రామిక సంబంధాలు, వృత్తిపరమైన భద్రత, ఆరోగ్యం- పని పరిస్థితులు లాంటి అంశాల ఆధారంగా 29 కేంద్ర కార్మిక చట్టాలను విలీనం చేసి ఈ కొత్త కోడ్స్‌ను రూపొందించింది.
Comments
Please login to add a commentAdd a comment