యువతను కార్యోన్ముఖుల్ని చేద్దాం
హామీల అమలుకు ప్రభుత్వం మెడలు వంచుదాం
జగన్‌ను ముఖ్యమంత్రిని చేసే వరకు సైనికుల్లా కృషిచేద్దాం
వైఎస్సార్ సేవాదళ్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి పిలుపు
21న విస్తృత సేవా కార్యక్రమాలు
తిరుపతిలో పార్టీ యువజన, విద్యార్థి విభాగాల మేధోమదన సదస్సు
తిరుపతి రూరల్: రాష్ట్రంలో అవినీతి, అక్రమ, అనైతిక పాలన చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా యువత, విద్యార్థి లోకాన్ని కార్యోన్ముఖులను చేయాలని పార్టీ యువజన, విద్యార్థి విభాగాల రాష్ట్ర పరిశీలకుడు, వైఎస్సార్ సేవాదళ్ రాష్ట్ర అధ్యక్షుడు, చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి పిలుపునిచ్చారు. పార్టీ యువజన, విద్యార్థి విభాగాల రాష్ట్ర స్థాయి మేధోమదన సదస్సు శుక్రవారం తిరుపతిలో జరిగింది. సమావేశంలో రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి పాల్గొన్నారు. అధ్యక్షత వహించిన ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి విద్యార్థి, యువజన విభాగాల అధ్యక్షులకు, నాయకులకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని చంద్రబాబు ఓ ప్రైవేటు కంపెనీలాగా మార్చారని ఆయన ఆరోపించారు. హామీలను అమలు చేయకుండా ద్రోహిగా సీఎం మిగిలిపోయారని విమర్శించారు. ప్రత్యేక హోదా విషయంలో సీఎం వైఖరి చూస్తుంటే తుగ్లక్‌ను తలపిస్తున్నారన్నారు. పార్టీని ప్రతిష్టం చేసే చర్యల్లో యువజన విభాగాదే కీలకపాత్ర అన్నారు. ఎదగడానికి అడ్డదారులు ఉండవని, అంకితభావం, చిత్తశుద్దితో అప్పగించిన పనులను పూర్తి చేయాలని, పదవులకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యల పరిష్కరానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. తిరుపతి నుంచే ప్రభుత్వ వైఫల్యాలపై పోరు మొదలు పెడుతున్నట్లు యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా ప్రకటించారు. నాయకులు, పార్టీ ప్రజా ప్రతినిధులతో సమన్వయంతో క్షేత్ర స్థాయిలో ముందుకు నడవాలని యువతకు సూచించారు.
21న జగన్‌మోహన్‌రెడ్డి జన్మదినం సందర్భంగా గ్రామ, మండల స్థాయిల్లో కూడా సేవా కార్యక్రమాలు నిర్వహించాలి సూచించారు. సామాజీక సేవ కార్యక్రమాలు వైపు యువతను నడిపించాలని పార్టీ యువజన విభాగం ఆనంతపురం జిల్లా అధ్యక్షుడు ఆలూరి సాంబశివారెడ్డి సూచించారు. జిల్లాలో 16వేల ఎకరాలను విదేశి కంపెనీల పరం చేయడానికి చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకోవాలని, అందుకోసం సెజ్ ప్రాంతంలో పాదయాత్ర చేద్దామని విశాఖ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు రాంబాబు పేర్కొన్నారు. తటస్థ ఓటర్లను ఆకర్షించేందుకు ప్రత్యేక కార్యచరణ రూపోందించాలని ప్రకాశం జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు రామానాయుడు సూచించారు. బూత్‌లెవల్ నుంచి పార్టీని కార్యక్రమాలను యువజన విభాగం పర్యావేక్షిస్తు ఉండాలే ప్రణాళికలను రూపోందించాలని కడప యువజన విభాగం జిల్లా అ«ధ్యక్షుడు రాజశేఖర్ పేర్కొన్నారు.
భారీ బైక్ ర్యాలీ..
పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడుగా తిరుపతికి వస్తున్న జక్కంపూడి రాజాకు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేతం జయచంద్రారెడ్డి ఆధ్వర్యంలో భారీ బైక్‌ర్యాలీతో ఘనస్వాగతం పలికారు. కరకంబాడి నుంచి లీలామహాల్ సుబ్బలక్ష్మి సర్కిల్ మీదుగా ఉదయ్ ఇంటర్నేషన్ హోటల్ వరకు వందలాది బైక్‌లతో ర్యాలీ జరిగింది. ఈ సదస్సులో వైఎస్సార్‌సీపీ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఓబుల్‌రెడ్డి, సుదర్శన్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి మురళీ, కృష్ణచైతన్యయాదవ్, కిషోర్, లక్ష్మిపతి, ఇమామ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.