వేట మొదలైంది
►అన్ని శాఖల ప్రక్షాళనకు శ్రీకారం
►ఆకస్మిక తనిఖీలతో హడలెత్తిస్తున్న కలెక్టర్
►ప్రజల పనుల విషయంలో ఆలస్యం చేస్తే సహించని పరిస్థితి
కలెక్టర్‌గా బాబూరావునాయుడు బాధ్యతలు చేపట్టిన మరుక్షణం నుంచి పాలనలో తనదైన మార్కు చూపెట్టడం ప్రారంభించారు.పొగడ్తలకు దూరంగా... పనికి దగ్గరగా వెళుతున్నారు. ఒకపక్క తాను చేస్తూనే, మరోపక్క అధికారులు కూడా చేయాలని ఆదేశిస్తున్నారు. ప్రజల పరంగా వచ్చే సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు ప్రత్యేక వ్యూహరచన చేస్తున్నారు. శాఖల్లో పేరుకుపోయిన అవినీతి ప్రక్షాళనకు నడుం బిగించడంతోపాటు తప్పుచేసిన అధికారులను అందరి ముందే అదిలిస్తున్నారు. అంతేకాదు.. అందరికన్నా ముందే ఏదో ఒక కార్యాలయాన్ని తనిఖీ చేసి అందరినీ కదిలిస్తున్నారు.
►జిల్లాకు వచ్చిన కొత్తల్లో సాధారణ వ్యక్తిలా రిమ్స్‌కు ఉదయాన్నే వెళ్లారు. అటెండెన్స్ వద్ద కూర్చుని అంతా పరిశీలించారు. వైద్యసిబ్బంది సమయపాలన పాటించకపోవడం, వైద్యసేవల నిర్లక్ష్యంపై సీరియస్ అయ్యారు. పేదలకు వైద్యసేవలు అందించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు.
►గండికోట ముంపు పరిహారం పంపిణీపై ఆరోపణలు రావడంతో వెంటనే విచారణకు ఆదేశించారు. జమ్మలమడుగు ఆర్డీఓ వినాయకంను ప్రభుత్వానికి సరెండర్ చేశారు. అందులో పెద్ద ఎత్తున గోల్‌మాల్ జరిగిన నేపథ్యంలో రికవరీకి చర్యలు చేపట్టడంతోపాటు క్రిమినల్ కేసులకు సిద్ధమవుతున్నారు.
►భూములకు సంబంధించి ఆన్‌లైన్ వ్యవహారంలో అవకతవకలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై అట్లూరు, తొండూరు తహసీల్దార్లపై సస్పెన్షన్ వేటు వేశారు. అంతేకాకుండా మరో ఇద్దరు వీఆర్వోలు, ఒక డిప్యూటీ తహసీల్దార్‌కు కూడా మెమోలు జారీ చేశారు.
సాక్షి, కడప/సెవెన్‌రోడ్స్ : జిల్లా పాలనకు కేంద్రబిందువు కలెక్టరేట్. కలెక్టర్ పరిపాలనాధికారి. అలాంటి అత్యున్నత అధికారి అందరికీ ఆదర్శంగా పనిచేస్తే.. మిగతా యంత్రాంగం కూడా ఆయన బాటలోనే నడుస్తుందనే చెప్పొచ్చు. ప్రస్తుతం కలెక్టర్ డాక్టర్ బాబూరావునాయుడు ఆ దిశగా పాలనను గాడిలో పెట్టే దిశగా ముందుకుసాగుతున్నారని మేధావులు అంటున్నారు. బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచే అక్రమాలకు పాల్పడిన, విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఒక ఆర్డీఓను సరెండర్ చేయడం, మరో ఇద్దరు తహసీల్దార్లపై సస్పెన్షన్ వేటు, పలువురు అధికారులకు మెమోలు, సంజాయిషీ నోటీసులే అందుకు ఉదాహరణ. ప్రజల పట్ల నిజాయితీతో వ్యవహరించాలని, ఒకసారి సమస్యతో వచ్చిన సామాన్యులు మరోసారి కార్యాలయంలోకి రాకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ప్రజలకు సేవ చేసి మంచిపేరు తెచ్చుకోవాలి తప్ప పదేపదే తిప్పుకోవడం సహేతుకం కాదని తనదైన శైలిలో సున్నితంగా మందలిస్తున్నారు.
ఉరుకులు...పరుగులు..
విశాఖపట్టణం నుంచి బదిలీపై కలెక్టర్‌గా వచ్చిన బాబూరావునాయుడు ప్రజల సమస్యల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. అందులోనూ గ్రామీ ణ ప్రాంతంలో పుట్టిపెరిగిన ఆయన సమస్యల పట్ల మంచి అవగాహన కలిగి ఉండడంతో కింది స్థాయి అధికారులను పరుగులు పెట్టిస్తున్నారు. ఒకపక్క కలెక్టర్ ఎప్పటికప్పుడు చురుగ్గా స్పం దిస్తూ...అంతే స్పీడుగా కిందిస్థాయి సిబ్బంది కూడా పనిచేయాలని చెబుతున్నారు. ఇప్పటికే వల్లూరు, వీరపునాయునిపల్లె, లక్కిరెడ్డిపల్లె, చిం తకొమ్మదిన్నె, కొండాపురం, పెండ్లిమర్రి, ముద్దనూరు, ఎర్రగుంట్ల తదితర మండలాల్లో పర్యటించి కార్యాలయాలను తనిఖీ చేశారు. సమీక్షల ద్వారా సమస్యల పరిష్కారానికి చొరవచూపాలని కిందిస్థాయి అధికారులను ఆదేశిస్తున్నారు.
శాఖల్లో ప్రక్షాళనకు శ్రీకారం
జిల్లాలో అన్ని శాఖలకు సమీక్షలు నిర్వహించిన కలెక్టర్ అవినీతి ప్రక్షాళనకు శ్రీకారం చుడుతున్నారు. ప్రత్యేకంగా ఏయే శాఖల్లో ఎక్కువగా అవినీతి రాజ్యమేలుతుందో తెలుసుకుంటున్న ఆయన ఆయా శాఖల అధికారులకు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ప్రజలను పీడిస్తే చర్యలు తప్పవని కరాఖండిగా చెబుతున్నారు. సమీక్షల సందర్భంగా కూడా ముందస్తు హెచ్చరికలు ఇప్పటికే ఆయన జారీ చేశారు. వచ్చిన మొదట్లోనే మార్కెట్‌యార్డుకు వెళ్లి పసుపు రైతుల సమస్యల పట్ల సావధానంగా స్పందించిన ఆయన పరిష్కారానికి చొరవ చూపారు. కానీ వివిధ శాఖల్లో ఎంతోకా లంగా వేళ్లూనుకుపోయిన నిర్లక్ష్యం, అవినీతి కారణంగా ఇంకా స్తబ్ధత కొనసాగుతోంది. అధికారపార్టీ వైపు నుంచి కూడా ఒత్తిళ్లు ఉంటాయి. వాటిన్నింటినీ రాబోయే రోజుల్లో తనదైన శైలిలో ఆయన అధిగమిస్తారని, పాలనను గాడిలో పెడతారని జిల్లావాసులు ఆశాభావంతో ఉన్నారు.
ఊరికి ఉపకారంపై ప్రత్యేక దృష్టి
కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఊరికి ఉపకారం అంశంపై ప్రత్యేక దృష్టి సారించారు. ఉపాధ్యాయులు, వార్డెన్లు, అధికారులు, వివిధ పదవుల్లో ఉన్నవారు, మేధావులు సొంత ఊళ్లకు కొంతైనా మేలు చేయాలన్న సంకల్పాన్ని తెలియజేశారు. అంతేకాకుండా హాస్టళ్లు, స్కూళ్ల వద్ద పిల్లల ద్వారా చెట్లు నాటించడం, కచ్చితంగా ప్రతి మొక్క బతికేలా ప్రత్యేక చర్యలు చేపట్టడంపై ప్రత్యేక దృష్టి సారించారు. గ్రామీణ ప్రాంత సమస్యలపై ప్రత్యేక దృష్టిపెడుతున్నారు. మొత్తానికి కలెక్టర్ వ్యవహార శైలి అటు ప్రజలకు మేలు చేస్తుండగా.. విధి నిర్వహణలో అలసత్వం చూపే అధికారులకు మాత్రం దడ పుట్టిస్తోందనే చెప్పవచ్చు.
వీఆర్వోను సస్పెండ్ చేసిన కలెక్టర్
కడప సెవెన్‌రోడ్స్ : రైల్వేకోడూరు మండలం రెడ్డివారిపల్లె గ్రామ రెవెన్యూ అధికారి పి.హరిప్రసాద్‌ను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ బాబూరావునాయుడు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. వీఆర్వో హరిప్రసాద్ 1–బి అండగల్‌ను ట్యాంపరింగ్ చేశారనే ఆరోపణలు వచ్చాయి. దీనిపై విచారణ నిర్వహించగా, ట్యాంపరింగ్ నిజమేనని తేలింది. ఈ నివేదిక కలెక్టర్‌కు అందడంతో ఆయన వీఆర్వోను సస్పెండ్ చేశారు.