
వైద్యరంగంలో మార్పులు రావాలి
చిన్న ఆవుటపల్లి (గన్నవరం రూరల్) : మెడికల్ గ్రాడ్యుయేట్ల వైద్య సమర్థతను పెంచేందుకు మార్పులు రావాలని మంత్రి కామినేని శ్రీనివాస్ ఆకాంక్షించారు. శనివారం డాక్టర్ పిన్నమనేని సిద్ధార్థ మెడికల్ కళాశాలలో డిపార్ట్‌మెంట్ ఆప్ మెడికల్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో ఆప్టిమైజింగ్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ కాంపిటెన్సీ ఎస్‌ఎస్‌మెంట్ నేషనల్ సెమినార్ ఒమేగా–16ను ఆయన ప్రారంభించారు. ఈ సెమినార్‌లో దేశంలోని పలు యూనివర్సిటీలకు చెందిన వైస్ చాన్సలర్లు, ప్రొఫెసర్‌లు, వైద్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సెమినార్ రికమండేషన్లను ప్రభుత్వానికి పంపాలని కోరారు. ప్రస్తుతం నడుస్తున్న కాంపిటెన్సీ అసెస్‌మెంట్‌లో మార్పుల కోసం ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, ఈ సెమినార్‌ల వల్ల సమర్థమైన వైద్యులు తయారవుతారన్నారు. ప్రభుత్వపరంగా అందరికీ వైద్యం అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఆస్పత్రుల్లో ప్రసవాల శాతం నూరు శాతానికి చేరుకోవాలని పేర్కొన్నారు. రాష్ట్రంలో 1400 ఆస్పత్రుల్లో ఉచిత రోగ నిర్ధారణ కేంద్రాలు పనిచేస్తున్నాయని తెలిపారు. ఈ సెమినార్‌ల వల్ల వైద్యరంగంలో చేపట్టబోయే నూతన ఆవిష్కరణలకు ఆలోచనలు వస్తాయని, మరిన్ని జరగాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. ఉదయం నుంచి నిపుణుల ప్రసంగాలు కొనసాగాయి. ప్రొఫెసర్ ఐవీ రావు, రామనారాయణ్, సుధాకర్ నాయక్, సేతు రామన్, అనంత కృష్ణన్, బాల సుబ్రమనియన్, జి.ఈశ్వర్, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వీసీ రావిరాజ్, కళాశాల డైరెక్టర్ జనరల్ డాక్టర్ సి.నాగేశ్వరరావు, ప్రిన్సిపాల్ డాక్టర్ మూర్తి, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎన్‌వీ కృష్ణారావు, ఆర్గనైజింగ్ సెక్రటరీ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.