భీమవరం : తుందుర్రులో ఆక్వాపార్క్ నిర్మాణం వద్దంటూ మూడేళ్లుగా వేల మంది ప్రజలు ఆందోళన చేస్తున్నా పట్టించుకోకుండా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మూర్కంగా గ్రామాల్లో అరాచకాలు సృష్టిస్తున్నారని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ (నాని) విమర్శించారు. గోదావరి మెగా ఆక్వా ఫుడ్‌పార్క్‌ను తీరప్రాంతానికి తరలించాలని డిమాండ్ చేస్తూ మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి ముదునూరి ప్రసాదరాజు నరసాపురం అంబేడ్కర్ సెంటర్‌లో శుక్రవారం చేపట్టిన రెండురోజుల నిరాహారదీక్ష ప్రారంభ సభలో ఆయన మాట్లాడారు. ఆక్వాపార్క్ వద్దంటూ 40 గ్రామాల ప్రజలు ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకుండా యాజమాన్యానికి మద్దతుగా నిలుస్తోందన్నారు. గ్రామాల్లో పోలీస్ పికెట్లు ఏర్పాటు చేసి నిర్మాణం కొనసాగించేందుకు సహకరిస్తుందన్నారు. మొగల్తూరు నల్లంవారితోటలో ఆనంద గ్రూప్ నిర్వహిస్తున్న చిన్న ఫ్యాక్టరీలో విషవాయువుల కారణంగా ఐదుగురు కార్మికులు మృతి చెందారన్నారు. తుందుర్రులో నిర్మిస్తున్న ఆక్వా ఫుడ్‌పార్క్‌లో ప్రమాదం జరిగితే పరిస్థితి ఎలా ఉంటుందో ఆ ప్రాంత ప్రజలు ముందుగానే ఊహించి ఫ్యాక్టరీని జనావాసాలకు దూరంగా సముద్రతీరానికి తరలించాలని పోరాటం చేస్తున్నారన్నారు. దీనిని అధికార పార్టీ నాయకులు గుర్తించకుండా ముడుపులే ముఖ్యమన్నట్టు వ్యవహరించడం దారుణమని ఆళ్ల నాని దుయ్యబట్టారు. ప్రజల ఆందోళనలో న్యాయం ఉండడం వల్లే వారి పోరాటానికి వైఎస్సార్ కాంగ్రెస్ సంపూర్ణ మద్దతు ప్రకటించిందని, పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బాధితులకు అండగా ఉంటామంటూ భరోసా ఇచ్చారన్నారు.
ప్రభుత్వ మొండివైఖరి వల్లే ముదునూరి దీక్ష
ప్రజల ఆందోళనలు గుర్తించి ఆక్వా పార్క్ పనులు నిలిపివేయాలంటూ మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ నాయకుడు ముదునూరి ప్రసాదరాజు అల్టిమేటం ఇచ్చినా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో తప్పనిసరి పరిస్థితిలో నిరాహారదీక్షకు పూనుకున్నట్టు చెప్పారు. దీక్షకు సిద్ధమవుతున్న తరుణంలో కాలికి గాయమై వైద్యులు విశ్రాంతి తీసుకోవాలని సూచించినా ప్రజలకిచ్చిన మాట మేరకు ఆరోగ్యాన్ని కూడా లెక్కచేయకుండా దీక్షకు కూర్చోవడం అభినందనీయమన్నారు. తన దీక్షతోనైనా ప్రజల సమస్యకు పరిష్కారం దొరుకుతుందని ఆశించే ప్రసాదరాజు దీక్ష చేపట్టారన్నారు.
కార్మిక మంత్రి పితాని దృష్టిపెట్టాలి
కొత్తగా రాష్ట్ర కార్మిక మంత్రిగా పదవీబాధ్యతలు చేపట్టిన పితాని సత్యనారాయణ తుందుర్రు సమస్య పరిష్కారానికి కృషి చేయాలన్నారు. దీక్ష చేపట్టిన ముదునూరి ప్రసాదరాజు మాట్లాడుతూయనమదుర్రు మాదిరిగా గొంతేరు డ్రెయిన్‌ను కాలుష్యం చేస్తుంటే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. నల్లంవారితోట ఫ్యాక్టరీలోని కాలుష్యాన్ని నేటికీ పైప్‌లు ద్వారా గొంతేరు డ్రెయిన్‌లో కలుపుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్సీ మేకా శేషుబాబు, పాలకొల్లు, ఆచంట నియోజకవర్గ పార్టీ కన్వీనర్లు గుణ్ణం నాగబాబు, కౌరు శ్రీనివాస్, పీడీ రాజు, సాయినా«థ్ ప్రసాద్, చెల్లబోయిన వేణుగోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
మత్స్యకారుల గోడు పట్టదా?
యనమదుర్రు డ్రెయిన్ వెంబడి ఉన్న అనేక పరిశ్రమల కారణంగా తాగునీటికి సైతం ఉపయోగపడే యనమదుర్రు కాలుష్యకారకమై నేడు ఆ నీటిలో కాలుపెడితేనే రోగాలు అంటుకునే విధంగా ఉన్నాయని నాని ఆందోళన వ్యక్తం చేశారు. తుందుర్రు ఆక్వాపార్క్ కారణంగా జీవనదిలాంటి గొంతేరు డ్రెయిన్ కాలుష్యంబారిన పడి వరి, చేపలు, రొయ్యల సాగు దెబ్బతినడమేగాక వేలాదిమంది మత్స్యకారులు జీవనోపాధిని కోల్పోతారన్నారు. ఈ విషయంపై మత్స్యకారులు గగ్గోలు పెడుతున్నా జిల్లా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు పట్టించుకోకుండా చోద్యం చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం అండదండలతోనే ఫ్యాక్టరీ యాజమాన్యం మొండివైఖరి అవలంబిస్తోందని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత అయినా తుందుర్రులో ఫ్యాక్టరీని తొలగించడం ఖాయమన్నారు.
మంత్రి అచ్చెన్నాయుడు తీరు దారుణం
నల్లంవారితోటలోని రొయ్యల షెడ్ నుంచి వచ్చే వ్యర్థాలు గొంతేరు డ్రెయిన్‌లో కలుస్తున్నాయంటూ ఆధారాలతో సహా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అసెంబ్లీలో ప్రస్తావిస్తే మంత్రి అచ్చెన్నాయుడు దానివల్ల ఎటువంటి కాలుష్యం లేదంటూ బుకాయించడం అధికార పార్టీ నాయకుల అబద్ధాలకు అవధులు లేకుండా పోయాయన్నారు. అవాస్తవాలతో ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారని నాని ఆరోపించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పరిశ్రమల స్థాపనకు వ్యతిరేకం కాదని, అయితే ప్రజలను ఇబ్బందిపెట్టే ప్రాంతాల్లో పెట్టడాన్ని మాత్రమే వ్యతిరేకిస్తున్నామన్నారు. తుందుర్రు పార్క్ వద్దంటూ వేలాదిమంది ప్రజలు ఆందోళనలు చేస్తుంటే స్థానిక ఎంపీలు గోకరాజు గంగరాజు, తోట సీతారామలక్ష్మి, ఎమ్మెల్యేలు బండారు మాధవనాయుడు, పులపర్తి అంజిబాబు పట్టించుకోకపోవడం వారికి ప్రజలపై ఉన్న మమకారాన్ని తెలియజేస్తుందన్నారు.
ప్రజాభీష్టాన్ని పట్టించుకోని ప్రభుత్వం
మాజీ మంత్రి మోపిదేవి వెంకట రమణ
నరసాపురం రూరల్ : ప్రభుత్వం పారిశ్రామికవేత్తలతో కుమ్మక్కై తుందుర్రు మెగా ఆక్వా ఫుడ్‌పార్కు విషయంలో ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా పనిచేయడం సరికాదని మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మోపిదేవి వెంకటరమణ అన్నారు. ముదునూరి ప్రసాదరాజు చేపట్టిన నిరాహార దీక్షలో శుక్రవారం సాయంత్రం పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజా ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణిచివేసేందుకు పోలీస్ పెద్దల సహకారంతో ప్రభుత్వం చేస్తున్న కుట్రపూరిత వ్యవహారాలన్నీ ప్రజలు గమనిస్తున్నారన్నారు.
నేడు రోజా, అంబటి రాక
నరసాపురం రూరల్ : ముదునూరి ప్రసాదరాజు చేపట్టిన నిరాహార దీక్షలో పాల్గొనేందుకు శనివారం పలువురు ప్రముఖులు రానున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, నగరి ఎమ్మెల్యే ఆర్‌కే రోజా, పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు, పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి పినిపే విశ్వరూప్ తదితరులు తరలిరానున్నారు.
మొగల్తూరు : తుందుర్రు గోదావరి మెగా ఆక్వా పరిశ్రమను తీరప్రాంతానికి తరలించాలి్సందేనని పలువురు ముక్తకంఠంతో పేర్కొన్నారు. తుందుర్రు ఆక్వా ఫుడ్ పార్క్ నిర్మాణ పనులు నిలుపుదల చేసి తీరప్రాంతానికి తరలించాలంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ముదునూరి ప్రసాదరాజు శుక్రవారం నరసాపురంలో నిరాహార దీక్ష చేపట్టారు. ఆయనకు సంఘీభావం తెలిపేందుకు వచ్చిన నాయకులు, ఫ్యాక్టరీ వ్యతిరేక పోరాట కమిటీ నాయకులు ప్రభుత్వ వైఖరిపై ధ్వజమెత్తారు.
ఇప్పటికైనా కళ్లు తెరవాలి
ప్రజల ఉద్యమాన్ని పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం ఇప్పుడైనా కళ్లు తెరవాలి. తుందుర్రు ఆక్వా పరిశ్రమను తీర ప్రాంతానికి తరలించాలి. అభివృద్ధికి, పరిశ్రమలకు వైఎస్సార్ సీపీ వ్యతిరేకం కాదు. ప్రజలకు హాని తలపెట్టే పరిశ్రమల ఏర్పాటుకు మాత్రమే వ్యతిరేకం.
– గుణ్ణం నాగబాబు, పాలకొల్లు నియోజకవర్గ కన్వీనర్
మహిళలంటే బాబుకు చులకన
ముఖ్యమంత్రి చంద్రబాబుకు మహిళలంటే చులకన. అందుకే మహిళా ది నోత్సవం రోజున మహిళలను అరెస్ట్ చేయించి జైలు పాలు చేశాడు. జనావాసాల మధ్యన పరిశ్రమ ఏర్పాటు చేయవద్దని కోరుతున్నందుకు మహిళలని చూడకుండా పిడిగుద్దులు కురిపిస్తున్నాడు.
– కె.సాయిబాల పద్మ, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు
తరలించే వరకూ పోరు
తుందుర్రు ఆక్వాపార్క్‌ను తీరప్రాంతానికి తరలించే వరకు పోరాటం చేస్తాం. ప్రసాదరాజు చేపట్టిన నిరాహార దీక్షతోనైనా ప్రభుత్వం స్పందించి ఫ్యాక్టరీ నిర్మాణాన్ని నిలుపుదల చేసి
వేరే ప్రాంతానికి తరలించే ప్రయత్నం చేయాలి.
– మేకా శేషుబాబు, మాజీ ఎమ్మెల్సీ
భయ్రభ్రాంతులకు గురిచేస్తున్నారు
మూడు సంవత్సరాలుగా జనావాసాల మధ్య పరిశ్రమను ఏర్పాటు చేయవద్దని ఆందోళన చేస్తుంటే నన్ను 53 రోజులు జైల్లో పెట్టించి హింసించారు. ఏదైనా చిన్న అలికిడి వినిపిస్తే పోలీసులు రావడం, మమ్మల్ని భయభ్రాంతులకు గురిచేయడం ఆనవాయితీగా మారింది.
– ఆరేటి సత్యవతి, తుందుర్రు ఆక్వా పరిశ్రమ వ్యతిరేక కమిటీ ఉద్యమరాలు
పరిశ్రమ వద్దంటే హింసిస్తున్నారు
ప్రజాస్వామ్యంలో అడిగే హక్కు లేకుండా చేస్తున్నారు. పరిశ్రమ జనావాసాల మధ్య వద్దు అన్నందుకు పోలీసులు హింసిస్తున్నారు. ముఖ్యమంత్రి పోలీసులను ఆనందాకు కాపలాకాసేందుకు నియమించినట్టుగా ఉంది.
– సముద్రాల సత్యవాణి, కె.బేతపూడి
ఉద్యమాన్ని అణిచేందుకు ప్రయత్నం
పోలీసులతో తమపై అక్రమకేసులు బనాయించి, జైలు పాలు చేసి ఉద్యమాన్ని అణచాలని చూస్తున్నారు. మూడు సంవత్సరాలుగా ముప్పై గ్రామాల ప్రజలు ఉద్యమం చేస్తుంటే ఈ ప్రభుత్వానికి చీమకుట్టినట్టుగా లేదు. ఇప్పటికైనా కళ్లు తెరవాలి.
– ఆరేటి వాసు, ఉద్యమ నాయకుడు