![జోరుగా పొగాకు మార్కెట్](/styles/webp/s3/article_images/2017/09/5/61491126264_625x300.jpg.webp?itok=AWV6rK_P)
జోరుగా పొగాకు మార్కెట్
► రోజురోజుకీ పెరుగుతున్న గరిష్ట ధరలు
► ఈ సీజన్‌లో రూ.168 అత్యధిక ధర
► ఊరట చెందుతున్న పొగాకు రైతులు
► ప్రధాన కంపెనీలు ధరలు
► పెంచకపోవడంపై చర్చ
ఒంగోలు టూటౌన్ : జిల్లాలో పొగాకు మార్కెట్ జోరుగా కొనసాగుతోంది. ధరలు ఆశాజనకంగా ఉండటంతో రైతులు ఊరట చెందుతున్నారు. ఇప్పటి వరకు అత్యధిక ధర రూ.168 వచ్చింది. గత శనివారం టంగుటూరు–1లో ఈ ధర రావడం పొగాకు రైతుల్లో చర్చనీయాంశమైంది. ఈ సీజన్‌లో రాష్ట్రంలో ఇదే అత్యధిక ధర కావడం గమనార్హం. ఇదే విధంగా శుక్రవారం ఒంగోలు–2 వేలం కేంద్రంలో అత్యధిక ధర రూ.168 రాగా, అత్యల్ప ధర కొండపి వేలం కేంద్రంలో పలికింది. శనివారం టంగుటూరు వేలం కేంద్రంలో అత్యధిక ధర రూ.167 పలకగా, అత్యల్ప ధర రూ.135 రావడంపై రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇలా పలు వేలం కేంద్రాలలో రూ.161 నుంచి రూ.166 వరకు ధర లభిస్తోంది. ఈ సీజన్‌లో పొగాకు కొనుగోళ్లు మార్చి 15న ప్రారంభమయ్యాయి. తొలిరోజు గరిష్ట ధర కిలో రూ.160 పలికి రైతుల్లో ఆనందం నింపింది. గత ఏడాది కిలో రూ.140తో ప్రారంభించిన వ్యాపారులు.. ఈసారి కిలో రూ.160తో ప్రారంభించడం విశేషంగా చెప్పుకోవచ్చు. దీంతో తొలి రోజే ధరలపై రైతుల్లో కొంత మేర సంతృప్తి కనిపించింది. కొనుగోళ్లు ప్రారంభించిన నాటి నుంచి నేటి వరకు రోజురోజుకీ ధరలు పెరుగుతూనే ఉన్నాయి.
కిలోకి రూ.163పైనే గరిష్ట ధర...: శనివారం దక్షిణాది తేలిక నేలలు, నల్లరేగడి నేలల కొన్ని వేలం కేంద్రాలలో ధరలు పరిశీలిస్తే.. కిలోకి గరిష్ట ధర రూ.163 పైనే ఉంది. అత్యధికంగా టంగుటూరు–1లో మళ్లీ కిలోకి రూ.167 పలికింది. అదే విధంగా వెల్లంపల్లి వేలం కేంద్రంలో అత్యధిక ధర రూ.163 రాగా, కనిష్ట ధర రూ.116 లభించింది. ఒంగోలు–1 వేలం కేంద్రంలో కిలోకి అత్యధికంగా రూ.162 రాగా, ఒంగోలు–2 వేలం కేంద్రంలో అత్యధిక ధర రూ.164 వచ్చింది. టంగుటూరు–2 వేలం కేంద్రంలో అత్యధిక రూ.162 లభించగా, అత్యల్ప ధర రూ.104 లభించింది. కొండపి వేలం కేంద్రంలో అత్యధిక ధర రూ.163 లభించడంతో రైతులు కొంత ఊరట చెందారు.
15 తరువాత విదేశీ కంపెనీ ప్రతినిధులు రాక...: పలు విదేశీ కంపెనీల ప్రతినిధులు ఈ నెల 15 తరువాత వచ్చే అవకాశం ఉందని బోర్డు అధికారులు తెలిపారు. కంపెనీ ప్రతినిధులు వస్తే.. పంట నాణ్యతను పరిశీలించి ఆర్డర్లు ఖరారు చేసుకునే అవకాశం ఉంది. ఈ పరిస్థితులలో విదేశీ ఆర్డర్లకు చూపించేందుకు శాంపిల్స్ కోసం కొంత మంది వ్యాపారులు పోటీపడుతున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే పొగాకు కొనడం వలనే ధరలు పెరిగినట్లు తెలుస్తోంది. మేలు రకం పొగాకు వారికి చూపించేందుకే స్థానిక వ్యాపారులు వేలం కేంద్రాలలో పోటీపడుతున్నట్లు తెలుస్తోంది. కీలక కంపెనీల కన్నా.. డీలర్లుగా ఉండే మధ్య స్థాయి కంపెనీల వారే ప్రస్తుతం కాస్తంత ఎక్కువ ధరలు ఇస్తున్నట్లు స్పష్టమవుతోంది. మార్కెట్లో ప్రధాన కంపెనీలుగా పేరున్న కంపెనీలు తొలిరోజు ఇచ్చిన గరిష్ట ధర కిలో రూ.160లోపేనని రైతు సంఘ నాయకులు చెబుతున్నారు. ప్రధాన ఎగుమతిదారులుగా పేరున్న కంపెనీలు ఇంకా పూర్తిస్థాయిలో కొనుగోళ్లకు రాలేదని పొగాకు రైతులు చర్చించుకుంటున్నారు. దీనిపై పొగాకు రైతుల్లో ఒకింత ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రధాన కంపెనీలు ధరలు పెంచకుండా సాధారణ వ్యాపారులు మాత్రమే అధిక ధరలు ఇవ్వడం ఎంతకాలం సాధ్యమన్న అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా ఊహించిన దానికన్నా ఆరంభంలోనే మార్కెట్ మెరుగ్గా ఉండటంపై రైతులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటి వరకు 1.2 మిలియన్ కిలోలు కొనుగోలు: జిల్లాలో మొత్తం 82 మిలియన్ కిలోల పొగాకు ఉత్పత్తికి బోర్డు అనుమతిచ్చింది. దీనిలో ఎస్‌బీఎస్ పరిధిలో 42 మిలియన్ కిలోల ఉత్పత్తికి ఆథరైజ్డ్ ఇవ్వగా, సుమారు 32 మిలియన్ కిలోలు మాత్రమే పంట ఉత్పత్తి వచ్చే అవకాశం ఉందని అంచనా. దీనిలో ఇప్పటి వరకు 1.2 మిలియన్ కిలోలు కొన్నట్లు ఎస్‌బీఎస్ ఆర్‌ఎం జి.ఉమామహేశ్వరరావు తెలిపారు. సరాసరి ధర రూ.156.29 వచ్చినట్లు చెప్పారు. అదే విధంగా ఎస్‌ఎల్‌ఎస్ పరిధిలో 40.5 మిలియన్ కిలోల పంట ఉత్పత్తికి అనుమతివ్వగా, కేవలం 23 మిలియన్ కిలోల పంట ఉత్పత్తి వస్తుందని అంచనా. ఇప్పటి వరకు వేలం కేంద్రాలలో 1.1 మిలియన్ కిలోల పొగాకు మాత్రమే కొనుగోలు చేసినట్లు ఎస్‌ఎల్‌ఎస్ ఆర్‌ఎం రత్నసాగర్ తెలిపారు. సరాసరి ధర రూ.156 వచ్చినట్లు తెలిపారు.