మాంసం ప్రియుల ట్రెండ్ మారింది. ఇంటి పెరట్లో సహజ సిద్ధంగా పెంచుకునే నాటు కోళ్ల మాంసం రుచే వేరు. వీటి మాంసం గట్టిగా ఉండడంతో వండడానికి, తినడానికి ఇబ్బంది పడేవారు. రుచి లేకపోయినా మృదువుగా ఉండే బాయిలర్ కోడి మాంసానికి అలవాటు పడిన జనం ప్రస్తుతం నాటు కోడి మాంసం వైపు చూస్తున్నారు. వీటి ధరలు మటన్ రేట్లను మరిపిస్తున్నా.. కేజీ బాయిలర్ కోడి మాంసం కంటే.. అరకేజీ నాటుకోడి మాంసంతో సరిపెట్టుకుంటున్నారు. ఆదివారం అయితే నాటు కోళ్ల కోసం జనం బారులు తీరుతున్నారు. దీంతో పల్లెల నుంచి నాటు కోళ్లు తీసుకొచ్చి విక్రయించేవారు ఎక్కువయ్యారు. పాత బస్టాండ్ ప్రాంతం ఆదివారం నాటు కోళ్ల సంతను తలపిస్తోంది.
సాక్షి, గూడూరు(నెల్లూరు) : ఒకప్పుడు పల్లెల్లో నాటు కోళ్లను పెంచుకుని, వాటి మాంసాన్ని ఆహారంగా తినేవారు. కాలక్రమంలో వాటిని పెంచడంలో ఇబ్బందులతో పెంచేవారే తగ్గిపోయారు. దీంతో పల్లెల్లో సైతం పుట్టగొడుగుల్లా చికెన్ సెంటర్లు వెలిశాయి. ఇలా కొన్నాళ్లకు ఆ రుచి వెగటేసింది. మళ్లీ నాటు కోడి మాంసం అంటూ అటూ పల్లెలతో పాటు ఇటు పట్టణ ప్రజలు ఉత్సాహం చూపుతున్నారు. పెద్ద పెద్ద హోటళ్లలోనూ, ఫంక్షన్‌ల్లో ‘నాటు కోడి మాంసం, రాగి సంగటి’ అనే కొత్త సంప్రదాయం వచ్చింది. నాటు కోళ్లకు గిరాకీ పెరగడంతో కొందరు పల్లెల్లో నాటు కోళ్ల పెంపకాలు చేపట్టారు. వ్యాపారులు అక్కడ నాటు కోళ్లను కొనుగోలు చేసి, పట్టణానికి తీసుకొచ్చి విక్రయిస్తున్నారు. మాంసం ప్రియులు నాటు కోళ్లను కొనుగోలు చేయడం వైపు మొగ్గు చూపుతున్నారు. నాటు కోడి మాంసం దాదాపుగా మటన్ ధరకు సరితూగుతోంది. మటన్ ధర కిలో రూ.500 నుంచి రూ.600 వరకు ఉంది. ఈ క్రమంలో నాటు కోడి ఒకటన్నర కిలో ధర రూ.600 ఉంది. వ్యర్థాలు పోను అది సుమారు కిలో మంసం మాత్రమే వస్తుంది. దీంతో నాటు కోడి మాంసం మటన్ ధరకు సరితూగేలా పలుకుతోంది.
Comments
Please login to add a commentAdd a comment