- కరెన్సీ కష్టాలపై పోరుకు రాజకీయ పక్షాల ఏర్పాట్లు
- అత్యవసర సేవలకు మినహాయింపు
- కాకినాడలో ర్యాలీ.. కలెక్టరేట్ వద్ద ధర్నా నేడు జిల్లావ్యాప్తంగా ఆందోళనలు
- రాజమహేంద్రవరంలో నిరసనలకు ఛాంబర్ ఆఫ్ కామర్స్ మద్దతు
నేటి హర్తాళ్‌కు సర్వం సిద్ధం
Published Sun, Nov 27 2016 11:44 PM | Last Updated on Mon, Sep 4 2017 9:17 PM
కాకినాడ :
ముందస్తు ఏర్పాట్లు చేయకుండా పెద్ద నోట్లు రద్దు చేసి, ప్రజలను కరెన్సీ కష్టాల్లోకి నెట్టేసిన కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ విపక్షాలు ఇచ్చిన దేశవ్యాప్త పిలుపు మేరకు సోమవారం జిల్లాలో హర్తాళ్ నిర్వహించనున్నారు. దీనిని విజయవంతం చేసేందుకు వైఎస్సార్ సీపీ, కాంగ్రెస్, వామపక్షాలుసన్నద్ధమయ్యాయి. నల్లధనాన్ని వెలికి తీసే విషయంలో కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ప్రకటిస్తున్నామని, అయితే ప్రజల ఇబ్బందులను ఏమాత్రం పట్టించుకోకుండా ప్రభుత్వం అనుసరిస్తున్న నిరంకుశ విధానాలకు మాత్ర మే ఈ హర్తాళ్ నిర్వహిస్తున్నామని విపక్ష నేతలు స్పష్టం చేస్తున్నారు. ఈ పోరాటంలో విద్యాసంస్థలు, వ్యాపార సంస్థలు, సినిమా థియేటర్లు సహా వివిధ ప్రజాసంఘాలను కూడా భాగస్వాముల్ని చేస్తున్నారు. ఇప్పటికే ప్రజలు నోట్ల రద్దుతో ఇబ్బంది పడుతున్నందున అత్యవసర సర్వీసులకు మినహాయింపునివ్వాలని నేతలు నిర్ణయించారు. జిల్లా కేంద్రమైన కాకినాడలో వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు నివాసం నుంచి భానుగుడి సెంటర్ మీదుగా కలెక్టరేట్ వరకూ భారీ ర్యాలీ చేసి, అనంతరం కలెక్టరేట్ వద్ద ధర్నా చేయనున్నారు. వామపక్షాలు కూడా కలెక్టరేట్ వద్ద ధర్నా చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. అమలాపురంలో అన్ని రాజకీయపక్షాలూ హర్తాళ్‌ను సక్సెస్ చేసేందుకు సిద్ధమవుతున్నాయి. రాజమహేంద్రవరం పరిధిలో ఆయా పార్టీల నేతలు హర్తాళ్‌కు సన్నాహాలు చేస్తూండగా ఛాంబర్ ఆఫ్ కామర్స్ మద్దతు ప్రకటించింది.
విజయవంతం చేయండి : కన్నబాబు
హర్తాళ్‌ను విజయవంతం చేయాలని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. నల్లధనాన్ని వెలికితీసేందుకు తమ పార్టీ వ్యతిరేకం కాదని, కానీ ప్రజలను కరెన్సీ కష్టాల నుంచి గట్టెక్కించడంలో కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలనే తాము ఎండగడుతున్నామని చెప్పారు. ప్రజల పక్షాన నిలిచే ప్రతిపక్షంగా ప్రజలకు అండగా నిలవాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. అందువల్లనే ఆయా రాజకీయ పక్షాలను సమన్వయం చేసుకుని జిల్లాలో హర్తాళ్‌ను విజయవంతం చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఆయా నియోజకవర్గాల్లో పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ కో ఆర్డినేటర్లు ముఖ్యనేతలంతా కలిసి వచ్చే పార్టీలు, నాయకులు, ప్రజాసంఘాలతో హర్తాళ్‌ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
Advertisement
Advertisement