నేడు పంచాయతీ ఎన్నికలు
-
నాలుగు సర్పంచ్, ఎంపీటీసీ, 15 వార్డులకు పోలింగ్
-
29 పోలింగ్‌బూత్‌లు ఏర్పాటు
కరీంనగర్ సిటీ : వివిధ కారణాలతో ఖాళీ అయిన సర్పంచ్, ఎంపీటీసీ, వార్డు సభ్యుల స్థానాలకు గురువారం ఎన్నికలు జరగనున్నాయి. జిల్లావ్యాప్తంగా నాలుగు సర్పంచ్, ఒక ఎంపీటీసీ, 15 వార్డుస్థానాలకు పోలింగ్ జరగనుంది. ఇప్పటికే 30 వార్డు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మరణించిన.. రాజీనామా చేసిన.. తదితర కారణాలతో జిల్లా వ్యాప్తంగా 50 పంచాయతీల్లో ఖాళీలు ఏర్పడ్డాయి. వీటికి గతనెల 26న ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయింది. ధర్మారం మండలం అబ్బాపూర్, కథలాపూర్ మండలం తాండ్రియాల, రామడుగు మండలం వెదిర, సారంగాపూర్ మండలం చెర్లపల్లి సర్పంచ్ స్థానాలు, మెట్‌పల్లి మండలం జగ్గాసాగర్ ఎంపీటీసీ స్థానంతోపాటు వివిధ గ్రామాల్లోని 45వార్డు స్థానాలున్నాయి. ఇందులో 30 వార్డు స్థానాలు ఈనెల 3న ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన ఒక ఎంపీటీసీ, నాలుగు సర్పంచ్, 15 వార్డు స్థానాలకు ఎన్నిక నిర్వహించనున్నారు.
ఉదయం ఏడు నుంచి ఒంటి గంట వరకు పోలింగ్
సర్పంచ్, వార్డు స్థానాలకు ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. మధ్యాహ్నం రెండు గంటలకు ఓట్లు లెక్కిస్తారు. అనంతరం ఫలితాలు వెల్లడిస్తారు. ఎన్నికల కోసం అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. వెదిరలో ఐదు, తాండ్రియాలలో ఐదు, జగ్గాసాగర్‌లో మూడు, అబ్బాపూర్‌లో మూడు, చర్లపల్లిలో ఒకటి చొప్పున మొత్తం 29 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు డీపీవో ఎస్.సూరజ్‌కుమార్ తెలిపారు.
జగ్గాసాగర్‌లో సాయంత్రం 5 గంటల వరకు..
మెట్‌పల్లి మండలం జగ్గాసాగర్ ఎంపీటీసీ స్థానానికి ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. ఓట్ల లెక్కింపు ఈనెల 10న జగ్గాసాగర్‌లోనే చేపడుతారు. అదేరోజు ఫలితాన్ని వెల్లడిస్తారు.
తొలిసారి ఈవీఎంలు
జిల్లాలోని స్థానిక సంస్థల స్థానాలకు నిర్వహిస్తున్న ఉప ఎన్నికల్లో తొలిసారి ఈవీఎంలు వాడుతున్నారు. వార్డు, సర్పంచ్, ఎంపీటీసీ, అన్ని స్థానాల పోలింగ్‌కు ఈవీఎంలు వాడడంతో ఫలితం అరగంటలోపే వచ్చే అవకాశం ఉంది. ఈవీఎంల నిర్వహణకు ప్రత్యేకంగా హైదరాబాద్ నుంచి టెక్నీషియన్స్‌ను రప్పించారు.
బరిలో లేని టీఆర్‌ఎస్
పార్టీ గుర్తులపై జరుగుతున్న జగ్గాసాగర్ ఎంపీటీసీ ఎన్నికలో అధికార టీఆర్‌ఎస్ అభ్యర్థి లేకపోవడం విశేషం. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి పల్లికొండ స్వర్ణలత, స్వతంత్ర అభ్యర్థులు డాకురి కమల, వేంగంటి లక్ష్మీ మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. స్క్రూటì నీలో టీఆర్‌ఎస్ అభ్యర్థి నామినేషన్ తిరస్కరించడంతో పార్టీకి అభ్యర్థి లేకుండాపోయారు. చివరకు స్వతంత్ర అభ్యర్థికి టీఆర్‌ఎస్ మద్దతు ఇవ్వాల్సి వచ్చింది. ఎస్సీ జనరల్‌కు రిజర్వ్ అయిన అబ్బాపూర్ సర్పంచ్ స్థానానికి నల్లల రామకృష్ణ, సీపెల్లి శ్రావణి, బీసీకి రిజర్వ్ అయిన చెర్లపల్లిలో ముక్కెర అశోక్‌కుమార్, బర్రె లచ్చవ్వ మధ్య ముఖాముఖీ పోటీ నెలకొంది. జనరల్ మహిళ అయిన వెదిరలో వనజ, భార్గవి, సత్య, పద్మ పోటీపడుతున్నారు. ఎస్సీ జనరల్ అయిన తాండ్రియాలలో చిన్న నాగమల్లేష్, దేవదాసు, నర్సయ్య, భాస్కర్, భూమయ్య, మారుతి, రాజేష్, సుదర్శన్ పోటీపడుతున్నారు.