గుమాస్తా కుమార్తె టాపర్ | Topper was clerk daughter | Sakshi
Sakshi News home page

గుమాస్తా కుమార్తె టాపర్

Published Sun, May 22 2016 9:13 AM | Last Updated on Mon, Sep 4 2017 12:37 AM

గుమాస్తా కుమార్తె టాపర్

గుమాస్తా కుమార్తె టాపర్

ఎంసెట్ మెడికల్‌లో స్టేట్ ఫస్ట్ ర్యాంకు సాధించిన హేమలత
 
 విజయవాడ(గుణదల)/కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు):
ప్రతిభకు ఆర్థిక స్థితిగతులు అడ్డంకి కాదని మధ్యతరగతి కుటుంబానికి చెందిన విద్యార్థిని రుజువు చేసింది. బట్టల దుకాణంలో గుమాస్తాగా పనిచేసే ఓ సాధారణ వ్యక్తి కుమార్తె ఎంసెట్-2016 మెడికల్ విభాగంలో తొలి ర్యాంకు సాధించి స్ఫూర్తిదాయకం గా నిలిచింది. శనివారం విడుదలైన ఎంసెట్ మెడికల్ ఫలితాల్లో కర్నూలు జోహరాపురానికి చెందిన మాచాని హేమలత మొదటి ర్యాంకు సాధించింది. కర్నూలులోని శ్రీనివాస క్లాత్ స్టోర్‌లో గుమాస్తాగా పనిచేస్తున్న మాచాని వీరన్న, చంద్రకళ దంపతుల రెండో కుమార్తె హేమలత. తన ముగ్గురు బిడ్డ లు చదువులో ఆణిముత్యాలని చెప్పారు. తన సంతానాన్ని ఉన్నత స్థానంలో నిలపడానికి నిరంతరం శ్రమిస్తున్నానని వీరన్న తెలిపారు.

 నాన్న కల నెరవేర్చిన హేమలత
 మాచాని వీరన్న, చంద్రకళ దంపతులకు ముగ్గురు ఆడ పిల్లలు సంతానం. పెద్ద కుమార్తె సౌజన్య ప్రస్తుతం మహానందిలో అగ్రికల్చర్ బీఎస్సీ చదువుతోంది. రెండో కుమార్తె హేమలత ఎంసెట్ మెడిసిన్‌లో స్టేట్ ఫస్టు ర్యాంకు సాధించింది. వీరిద్దరూ కర్నూలులోని ఓ ప్రైవేట్ కాలేజీలో ఇంటర్మీడియెట్ పూర్తి చేశారు. ఇక మూడో కుమార్తె విజయశ్రీ ప్రస్తుతం పదో తరగతి చదువుతోంది. తన ముగ్గురు కుమార్తెల్లో ఒక్కరినైనా డాక్టర్‌గా చూడాలనుకున్నారు మాచాని వీరన్న. ఎన్నో వ్యయప్రయాలసకోర్చి పిల్లలను చదివించారు. రెండో తనయ మాచాని హేమలత ఎంసెట్‌లో రాష్ట్రంలో ప్రథమ ర్యాంకు సాధించి తండ్రి కలను సాకారం చేసింది.

 2015లో 248వ ర్యాంకు
 2015 ఎంసెట్ మెడికల్‌లో మాచాని హేమలత మొదటి ప్రయత్నంలోనే 248వ ర్యాంకు సాధించింది. అయితే, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం.. నిర్దేశిత వయసుకు 28 రోజులు తక్కువగా ఉండడంతో ఆమె అప్పట్లో వైద్య విద్యలో ప్రవేశం పొందలేకపోయింది.  

 న్యూరో సర్జన్ అవుతా
 ‘చాలా ఆనందంగా ఉంది. రోజుకు పన్నెండు గంటలు కష్టపడేదాన్ని. నిరంతరం పుస్తకాలతోనే దోస్తీ చేసేదాన్ని. తల్లిదండ్రుల కల నెరవేర్చడానికి నిరంతరం కష్టడుతూనే ఉంటా. న్యూరోసర్జన్ కావాలన్నది చిరకాల కోరిక. నా విజయం వెనుక మా తల్లిదండ్రులు, అధ్యాపకుల కృషి చాలా ఉంది. ఇంటర్మీడియెట్‌లో 985 మార్కులు వచ్చాయి’ అని హేమలత చెప్పింది.
 
 ర్యాంకర్ల మనోగతం
 న్యూరాలజిస్ట్‌నవుతా...  
 మాది రంగారెడ్డి జిల్లా కొత్తగూడ, నాన్న నరేంద్రరెడ్డి న్యాయవాది. అమ్మ గృహిణి. చిన్నప్పటి నుంచి డాక్టర్‌ను కావాలనే ఆకాంక్షతో ఇంటర్‌లో బైపీసీలో చేరాను. తల్లిదండ్రుల ప్రోత్సాహం, ఉపాధ్యాయుల శిక్షణతో రెండో ర్యాంకు సాధించాను. న్యూరాలజిస్ట్ కావాలనేది నా ఆశయం.  
     - ఎర్ల సాత్విక్‌రెడ్డి, రెండో ర్యాంకర్
 
 తల్లిదండ్రుల ప్రోత్సాహం...
 సైదాబాద్‌కు చెందిన మా నాన్న సత్యనారాయణరెడ్డి సివిల్ ఇంజనీర్. నా అభీష్టం మేరకు ఇంటర్ బైపీసీలో చేర్పించారు. ఎంసెట్‌లో రాష్ట్రస్థాయిలో మూడో ర్యాంకు సాధించడం చాలా సంతోషంగా ఉంది. తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో ఇంతటి విజయం సాధించా. న్యూరాలజిస్ట్ లేదా కార్డియాలజిస్ట్‌గా ప్రజలకు సేవ చేయాలనేది నా ఆకాంక్ష.      
 - ఎ.యజ్ఞప్రియ, మూడో ర్యాంకర్
 
 నగర కుర్రాడి సత్తా
 ఏపీ ఎంసెట్ మెడికల్‌లో నగరానికి చెందిన ఇక్రంఖాన్ సత్తా చాటాడు. 160 మార్కులు152 మార్కులు సాధించి ఐదో ర్యాంక్‌ను సొంతం చేసుకున్నాడు. నారాయణగూడ నారాయణ శ్రీ చైతన్య కాలేజీలో ఇంటర్ చదివిన ఇక్రం ఎంపీసీలో 987 మార్కులు సాధించాడు. న్యూఢిల్లీలోని ఎయిమ్స్‌లో ఎంబీబీఎస్ చేయడమే తన లక్ష్యమని ఇక్రంఖాన్  తెలిపాడు.
 
 కార్డియాలజిస్ట్‌నవుతా
 బోయినపల్లికి చెందిన ఎస్.సాహితి సావిత్రి ఎస్‌ఆర్‌నగర్ చైతన్య కళాశాలలో ఇంటర్ చదివింది. మెడిసిన్ విభాగంలో రాష్ట్ర స్థాయిలో 6వ ర్యాంకు సాధించింది. 160కు 152 మార్కులు తెచ్చుకుంది. ఇంటర్‌లో 982 మార్కులు సాధించింది. ఆమె తండ్రి రమణ ఐఎస్‌బీ లో, తల్లి దీప్తి సాఫ్ట్‌వేర్ రంగంలో పనిచేస్తున్నారు. భవిష్యత్తులో కార్డియాలజిస్టునయ్యి సేవలందించాల న్నది తన ఆకాంక్షని సాహితి తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement