అంతా అప్రజాస్వామికం
– నోటిఫికేషన్ లేకుండానే వర్శిటీల పాలకమండలి సభ్యుల నియామకం
– సమాన అవకాశాలకు పాతరేసిన ప్రభుత్వం
– సీనియర్ ప్రొఫెసర్ కోటాలో అనుభవంలేని ప్రొఫెసర్ల ఎంపిక
ఎస్కేయూ/ జేఎన్‌టీయూ : శ్రీకష్ణదేవరాయ విశ్వవిద్యాలయం, జేఎన్‌టీయూ అనంతపురం పాలకమండలి సభ్యుల నియామకం ఆంధ్రప్రదేశ్ యూనివర్సిటీల యాక్ట్–1991కు విరుద్ధంగా జరిగింది. ఈ ఏడాది ఫిబ్రవరి 26న జరిగిన వర్శిటీల్లోని పరిపాలన, ఆర్థిక పరమైన అత్యున్నత హోదాగల పాలక మండలి సభ్యుల నియామకంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
వర్సిటీ ప్రొఫెసర్లకు తెలియకుండా భర్తీ :
ఆంధ్రప్రదేశ్ యూనివర్సిటీల యాక్ట్ – 1991 , సెక్షన్ 18 (2) ప్రకారం పాలకమండలి సభ్యుల నోటిఫికేషన్‌కు నామినేషన్‌లు ఆహ్వానించాల్సి ఉంది. యూనివర్సిటీ క్యాంపస్ కళాశాలలో ఒక సీనియర్ ప్రొఫెసర్, క్యాంపస్ కళాశాలలో ఒక ప్రిన్సిపల్, క్యాంపస్ కళాశాలలో ఒక ప్రొఫెసర్ / అధ్యాపకుడు, అనుబంధ కళాశాలల్లో ఒక అధ్యాపకుడు, అనుబంధ కళాశాలల్లో ఒక ప్రిన్సిపల్, విభిన్న రంగాల నుంచి నలుగురు ప్రముఖుల నుంచి నామినేషన్‌లు దాఖలు చేయాలి. కానీ నియామకాల్లో అలా ఎవరినీ కోరలేదు. కనీసం యూనివర్సిటీ నుంచి ఎంపిక చేయబోయే వారి బయోడేటాలు తెప్పించుకోలేదు. ఎస్కేయూలో జీవో నం. ఎంఎస్ 13, జేఎన్‌టీయూ అనంతపురంలో జీవో నం.15 ప్రకారం నేరుగా పాలకమండలి సభ్యుల పేర్లను ప్రభుత్వం ఎంపిక చేయడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
సమాన అవకాశాలకు పాతర :
రాజ్యాంగంలోని 14వ అధికరణ ద్వారా అందరికీ సమాన అవకాశాలు కల్పించాలి. పాలకమండలి సభ్యుల నోటిఫికేషన్ ఇచ్చి ఉంటే అందరూ దరఖాస్తు చేసుకునేవారు. నిష్ణాతుల దరఖాస్తులు పరిశీలించే అవకాశం ఉండేది. ఆంధప్రదేశ్ యూనివర్సిటీస్ యాక్ట్–1991 ప్రకారం సెక్షన్ 33 (2) ప్రకారం పాలక మండలి సభ్యుల నియామకంలో తప్పిదాలు జరిగినా.. చట్టాన్ని అతిక్రమించి భర్తీ చేసినా ఛాన్సలర్, వైస్ ఛాన్సలర్ దష్టికి తీసుకెళ్లాలి. పాలకమండలి సభ్యులు ఛాన్సలర్ విశ్వాసం ఉన్నంత వరకూ పదవిలో ఉంటారు. మూడేళ్ల కాలంలో ఛాన్సలర్ వారిని ఎప్పుడైనా తొలగించొచ్చు. వైస్ ఛాన్సలర్ల నియామకంలో సెర్చ్ కమిటీ ద్వారా ఎంపిక చేసే పద్ధతి అవలంబిస్తున్నారు. కానీ నిర్ణయాలకు ఆమోదం తెలిపే కీలకమైన పాలకమండలి సభ్యుల ఎంపికలో మాత్రం నియంతత్వ ధోరణితో వ్యవహరిస్తుండడం వివాదాస్పదమవుతోంది.
ఎస్కేయూ వీసీకి ఫిర్యాదు :
తాజాగా పాలకమండలి సభ్యుల నియామకం చేసిన పద్ధతి రాజ్యాంగ విరుద్ధమని ఎస్కేయూ వీసీ ఆచార్య కే.రాజగోపాల్‌కు కొందరు అధ్యాపకులు గత నెల రెండో వారంలో ఫిర్యాదు చేశారు. సీనియర్ ప్రొఫెసర్ కోటాలో పాలక మండలి సభ్యుడిని నియమించారు. 2013లో ప్రొఫెసర్‌గా ఉద్యోగోన్నతి వచ్చిన వారు సీనియర్ ప్రొఫెసర్ ఎలా అవుతారని అందులో పేర్కొన్నారు. వర్సిటీల యాక్ట్‌కు విరుద్ధంగా భర్తీ చేశారని చాన్సలర్ దష్టికి తీసుకెళ్లాలని అందులో కోరారు.