పర్యాటకరంగ అభివృద్ధికి చర్యలు
-
ప్రతిష్టాత్మకంగా ఫ్లెమింగో ఫెస్టివల్
-
కలెక్టర్ ముత్యాలరాజు
నెల్లూరు(పొగతోట):
జిల్లాలో పర్యాటకరంగం అభివృద్ధికి నిర్దేశించిన పనులను త్వరగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆర్.ముత్యాలరాజు సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో పర్యాటకరంగం అభివృద్ధిపై వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. మైపాడుబీచ్‌లో అప్రోచ్ రోడ్లు, కాటేజీలు పనులు పూర్తి చేయాలన్నారు. తడ నుంచి భీమునివారిపాళెం, కావలి క్రాస్ రోడ్డు నుంచి తుమ్మలపెంట వరకు, టీపీగూడూరు నుంచి కొత్తకోడూరు బీచ్ రోడ్డు వరకు, నర్రవాడ క్రాస్ రోడ్డు నుంచి ఉదయగిరి వరకు ఉన్న రోడ్లుకు మరమ్మతులు చేయాలన్నారు. ఇరకందీవి, తుమ్మలపెంట, తోకపాళెం వద్ద రిసార్ట్స్కు భూములు గుర్తించి ఏర్పాటు చేసేలా చర్యలు చేపట్టాలన్నారు. పల్లిపాడు పినాకిని గాంధీ ఆశ్రమం అభివృద్ధి, జువ్వలదిన్నె వద్ద శ్రీపొట్టి శ్రీరాములు మెమోరియల్ ఏర్పాటు అవసరమైన పనులు పెండింగ్ లేకుండా పూర్తి చేయాలన్నారు. వచ్చే ఏడాది జనవరిలో నిర్వహించే ఫ్లెమింగో ఫెస్టివల్‌ను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేలా చర్యలు చేపట్టాలన్నారు. కమిటీలు వేసి ప్రణాళికలు రూపొందించి ఫెస్టివల్ విజయవంతంమయ్యేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. సమావేశంలో టూరిజం ఈడీ చంద్రమౌళి, పీఆర్ ఎస్‌ఈ బుగ్గయ్య, జిల్లా టూరిజం అధికారి నాగభూషణం, ఫారెస్ట్ రేంజ్ అధికారులు వెంకటరత్నం, కుమారరాజ, కార్పొరేషన్ ఎస్‌ఈ జె.శ్రీనివాసులు, ఈఈ ఈశ్వరయ్య పాల్గొన్నారు.
కామధేను ప్రాజెక్టు పనులు పూర్తి చేయండి..
కామధేను ప్రాజెక్టుకు పనులు సకాలంలో పూర్తి చేసేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ముత్యాలరాజు సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. చింతలదేవి కామధేను ప్రాజెక్టు పరిపాలన భవనాన్ని పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయాలన్నారు. అంతకముందు నీరు-చెట్టుపై వివిద శాఖల అ«ధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. సమావేశంలో పశుసంవర్ధక శాఖ జేడీ శ్రీధర్‌బాబు, ఏపీ లైవ్‌స్టాక్ అభివృద్ధి సంస్థ సీఈఓ కొండలరావు, వ్యవసాయ శాఖ జేడీ హేమమహేశ్వరరావు, పీఆర్ ఎస్‌ఈ బుగ్గయ్య, డీఆర్‌డీఏ పీడీ లావణ్యవేణి, ఏపీఎంఐపీ పీడీ రమణరావు పాల్గొన్నారు.