రెప్పపాటులో ఘోరం | tractor felling in well | Sakshi
Sakshi News home page

రెప్పపాటులో ఘోరం

Published Sat, Sep 17 2016 10:25 PM | Last Updated on Mon, Sep 4 2017 1:53 PM

రెప్పపాటులో ఘోరం

రెప్పపాటులో ఘోరం

  • పోలీసుల బైక్‌ను ఢీకొట్టి బావిలో పడిన ట్రాక్టర్‌
  • నలుగురు యువకులు దుర్మరణం
  • ప్రమాదం నుంచి తప్పించుకున్న యజమాని
  • బాధిత కుటుంబాలకు మంత్రి, ఎమ్మెల్యే పరామర్శ 
  • సైదాపూర్‌/ చిగురుమామిడి : మద్యం మత్తు... అతివేగం.. ర్యాష్‌ డ్రైవింగ్‌ రెప్పపాటులో నలుగురి ప్రాణాలు తీసింది. ట్రాక్టర్‌ కొనుగోలు చేసిన ఓ యువకుడు మిత్రులకు దావత్‌ ఇచ్చేందుకు వారిని కొత్తవాహనంపై తీసుకెళ్లాడు. అందరూ కలిసి రాత్రి వరకూ మద్యం తాగారు. తిరుగు ప్రయాణంలో రెప్పపాటులో ఘోరం జరిగింది. మద్యం మత్తులో వేగంగా ట్రాక్టర్‌ నడుపుతూ అటుగా వెళ్తున్న బైక్‌ను ఢీకొట్టారు. ఏం జరిగిందో అని వెనుకకు తిరిగి చూసేలోపు వాటి ట్రాక్టర్‌ రోడ్డు పక్కనే ఉన్న బావిలో పడింది. ఐదుగురిలో నలుగురు ట్రాక్టర్‌తో సహా బావిలో పడి దుర్మరణం చెందారు. మరో యువకుడు త్రుటిలో తప్పించుకుని పారిపోయాడు. ఈ విషాద సంఘటన సైదాపూర్‌ మండలం దుద్దెనపల్లిలో శుక్రవారం రాత్రి జరిగింది. 
     
    చిగురుమామిడి మండలం బొమ్మనపల్లి గ్రామానికి చెందిన కత్తుల శివకుమార్‌ మంగళవారం కొత్త ట్రాక్టర్‌ కొనుగోలు చేశాడు. ఇంజిన్‌ కూలింగ్‌ కోసం మూడు రోజులుగా ట్రాక్టర్‌ను తిప్పుతున్నాడు. ట్రాక్టర్‌ కొన్నందుకు దావత్‌ ఇచ్చేందుకు తమ మిత్రులు అదే గ్రామానికి చెందిన బొల్లి రాజు(18), కొంకట శ్రీకాంత్‌(22), మాచమల్ల రఘు(22), పిల్లి సంతోష్‌(24)ను తీసుకుని శుక్రవారం ట్రాక్టర్‌పై సైదాపూర్‌కు వెళ్లాడు. అక్కడి వైన్‌షాపులో అందరూ కలిసి మద్యం తాగారు. రాత్రి 10 గంటల వరకూ అక్కడే ఉన్నారు. బయల్దేరే ముందు మరో మద్యం బాటిల్‌ కొనుక్కున్నారు. మత్తులోనే ట్రాక్టర్‌పై స్వగ్రామానికి బయల్దేరారు. దుద్దెనపల్లి వద్ద బ్రిడ్జి దాటిన తర్వాత కోహెడ ఏఎస్సై రాజేందర్, మరో కానిస్టేబుల్‌ వెళ్తున్న బైక్‌ను ట్రాక్టర్‌ డ్రైవర్‌ వేగంగా ఢీకొట్టాడు. ఈ క్రమంలో ఏఎస్సై, కానిస్టేబుల్‌ కిందపడ్డారు. భయంతో వారిని గమనిస్తూనే అంతే వేగంగా ట్రాక్టర్‌ ముందుకు పోనిచ్చాడు. దీంతో ట్రాక్టర్‌ అదుపుతప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. ప్రమాదాన్ని గమనించిన ట్రాక్టర్‌ యజమాని శివకుమార్‌ కిందకు దూకాడు. ట్రాక్టర్‌ నలుగురు యువకులతో సహా రెప్పపాటులో చెట్లపొదల్లో ఉన్న వ్యవసాయ బావిలో పడింది. దీంతో శివకుమార్‌ అక్కడి నుంచి పారిపోయాడు. ప్రమాదానికి గురైన ఏఎస్సై వెంటనే స్థానిక పోలీసులకు సమాచారమిచ్చాడు. సంఘటన స్థలానికి చేరుకున్న ఎస్సై శ్రీధర్‌కు సంఘటన వివరాలన్నీ రాజేందర్‌ వివరించాడు. ఎస్సై క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి తన సిబ్బందితో ప్రమాద స్థలంలో రాత్రంతా బందోబస్తు ఏర్పాటు చేశారు. బావిలో పడిన ట్రాక్టర్, యువకుల కోసం లైట్లు వేసి వెతికినా కనిపించలేదు. దీంతో ఫైరింజన్‌ను రప్పించారు. బావిలోని నీళ్లు తోడేందుకు ప్రయత్నించినా ఫలించలేదు. శనివారం ఉదయం 6 గంటల ప్రాంతంలో మరో మోటార్‌ బిగించి బావిలోని నీళ్లు తోడేశారు. దీంతో ట్రాక్టర్, పిల్లి సంతోష్‌ మృతదేహం బయటపడింది. ప్రొక్లెయిన్‌తో శవాన్ని బయటకు తీశారు. ఈలోగా కరీంనగర్‌ ఆర్డీవో చంద్రశేఖర్, కరీంనగర్‌ డీఎస్పీ రామారావు, హుజూరాబాద్‌ రూరల్‌ సీఐ సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఆర్డీవో టెలిస్కోపిక్‌ క్రేన్‌ తెప్పించి ట్రాక్టర్‌తోపాటు బొల్లి రాజు,కొంకట శ్రీకాంత్, మాచమల్ల రఘు మృతదేహాలను పైకి తీశారు. కత్తుల శివకుమార్‌ కోసం బావిలో మరోసారి వెతికినా కనిపించలేదు. దీంతో అతడు తప్పించుకుని ఉంటాడని భావించారు. మృతదేహాలను హుజూరాబాద్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే  ట్రాక్టర్‌ యజమాని కనిపించకపోవడంతో మృతుల బంధువులు ఆందోళనకు దిగారు. హుజూరాబాద్‌ రూరల్, హుస్నాబాద్‌ సీఐలు ఎండీ.గౌస్‌బాబా, దాసరి భూమయ్య వారికి నచ్చజెప్పారు.  
     
    బాధిత కుటుంబాలను ఆదుకుంటాం
    – మంత్రి ఈటల 
     సంఘటన స్థలానికి మంత్రి ఈటల రాజేందర్, ఎమ్మెల్యే సతీశ్‌కుమార్‌ వచ్చారు. మృతదేహాలను పరిశీలించారు. సంఘటన జరిగిన తీరు తెలుసుకున్నారు. బాధిత కుటుంబాలను ఓదార్చారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం నుంచి ఆర్థికసాయం అందేలా చూస్తామని హామీ ఇచ్చారు.  
     
    శోకసంద్రమైన బొమ్మనపల్లి..
    సైదాపూర మండలంలో జరిగిన ప్రమాదంతో బొమ్మనపల్లి గ్రామంలో విషాదం అలుముకుంది. మృతులందరూ 25 ఏళ్లలోపే కావడంతో ఎదిగిన తమ కొడుకులు దుర్మరణం చెందడంతో తల్లిదండ్రులు తీవ్ర దుఖఃసారగంలో మునిగిపోయారు. 
     
    డిగ్రీ చదివిన పిల్లి సంతోష్‌కుమార్‌..
    పిల్లి నీలమ్మ–లక్ష్మీనారాయణ దంపతులకు మూడో సంతానం పిల్లి సంతోష్‌కుమార్‌. డిగ్రీవరకు చదివాడు. జీవనోపాధి నిమిత్తం నాలుగేళ్లుగా ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇతడికి అన్న, అక్క ఉన్నారు. వీరిది సామాన్య రైతుకుటుంబం. 
     
    ఎనిమిది నెలల క్రితం శ్రీకాంత్‌ వివాహం 
    కొంకట శ్రీకాంత్‌ హుస్నాబాద్‌ మండలం అంతకపేట్‌కు చెందిన హరిణిని ప్రేమించాడు. ఎనిమిది నెలల క్రితం వీరు పెళ్లి చేసుకున్నారు. హరిణి ప్రస్తుతం ఏడు నెలల గర్భిణి. 9వ తరగతి వరకే చదువుకున్న శ్రీకాంత్‌ కూడా ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.  ఇతడికి నలుగురు సోదరులు, ఒక అక్క ఉంది.  
     
    నానమ్మ వద్ద ఉంటున్న బొల్లి రాజు..
    బొల్లి రాజు తల్లిదండ్రులు బొల్లి స్వరూప, బొల్లి శ్రీనివాస్‌ జీవనోపాధి నిమిత్తం సైదాపూర్‌ మండలం చింతపల్లిలో ఉంటున్నారు. రాజు బొమ్మనపల్లిలోని తన నానమ్మ వద్ద ఉంటూ కూలీపనులకు వెళ్తున్నాడు. ఇతడు 9వ తరగతి వరకు చదువుకున్నాడు. రాజుకు ఒక చెల్లి ఉంది. వీరిది కూడా సామాన్య కుటుంబమే.  
     
    స్నేహానికి ప్రాణం ఇచ్చే రఘు..
    బొమ్మనపల్లికి చెందిన  మాచమల్ల పద్మ, మల్లేశం దంపతులకు రెండో కుమారుడు మాచమల్ల రఘు. పదో తరగతి వరకు చదువుకున్నాడు. బతుకుదెరువు కోసం ఆటో నడుపుతున్నాడు. ఆటోను కూడా బ్యాంకులో రుణం తీసుకుని కొనుగోలు చేశాడు. స్నేహితుడు కత్తుల శివకుమార్‌ పిలవడంతో వెళ్లి మత్యువాతపడ్డాడు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement