ట్రాక్టర్ బోల్తా.. డిగ్రీ విద్యార్థి దుర్మరణం
కళ్లను దానం చేసిన కుటుంబ సభ్యులు
బనగానపల్లె రూరల్ : నాపరాళ్ల ట్రాక్టర్ బోల్తా పడడంతో డిగ్రీ విద్యార్థి మృతి చెందాడు. ఈ ఘటన నందివర్గం పోలీసుస్టేషన్ పరిధిలోని రామకృష్ణాపురం అడ్డ రోడ్డు బుధవారం చోటుచేసుకుంది. రామకృష్ణాపురం గ్రామానికి చెందిన బుడిగి మద్దిలేటి, సుభద్ర దంపతులకు మోహన్‌కృష్ణ (22), హరికృష్ణ.. ఇద్దరు కుమారులు. బనగానపల్లెలోని ఓ ప్రైవేట్ కళాశాలలో మోహన్‌కృష్ణ బీఎస్సీ ద్వితీయ సంవత్సరం చేశాడు. హరికృష్ణ ఇంటర్ మొదటి సంవత్సరం పూర్తి చేసి చివరి సంవత్సరం చేరేందుకు ఉన్నారు. గ్రామంలోని గనిలో నుంచి నాపరాళ్లను ట్రాక్టర్‌లో పలుకూరు క్రాస్ రోడ్డు వద్ద ఉన్న నాపరాళ్ల డిపోల వద్ద తరలించేందుకు తండ్రి మద్దిలేటితో పాటు మోహన్‌కృష్ణ కూడా లోడింగ్ పనికి వెళ్లాడు. నాపరాళ్ల లోడ్‌ను డిపో వద్దకు తరలిస్తుండగా ఎదురుగా వస్తున్న మరో వాహనానికి సైడ్ ఇవ్వబోయి ట్రాక్టర్ అదుపు తప్పింది. దీంతో ట్రాక్టర్‌కు, ట్రాలీకి ఉన్న బోల్ట్ ఊడిపోవడంతో ట్రాలీ బోల్తాపడి ట్రాలీలో కూర్చున్న మోహన్‌కృష్ణ పైనాపరాళ్లు పడడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న నందివర్గం ఎస్‌ఐ హనుమంతరెడ్డి ఘటన స్థలానికి వెళ్లి.. మృతదేహం పై పడ్డ నాపరాళ్లను తొలగించి పోస్టుమార్టం నిమిత్తం బనగానపల్లె ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. చేతికొచ్చిన పెద్ద కుమారుడు మోహన్‌కృష్ణ మృతి చెందడంతో కుటుంబ సభ్యులు రోదనలు మిన్నంటాయి.
కళ్లను దానం చేసిన కుటుంబ సభ్యులు
ఎస్‌ఐ హనుమంతరెడ్డి సహకారంతో మోహన్ కృష్ణ కళ్లను తలిదండ్రులు దానం చేశారు. కర్నూలుకు చెందిన కంటి వైద్యనిపుణులు డాక్టర్ భరణికుమార్ ఆధ్వర్యంలో టెక్నిషియన్ రంగారెడ్డి మృతుడు మోహన్ కృష్ణ కళ్లను సేకరించారు.