
‘బాలకృష్ణకు ఓటేసినందుకు సిగ్గుపడుతున్నాం’
హిందూపురం: హిందూపురం ఎమ్యెల్యే బాలకృష్ణ కార్మికుల సమస్యలను పట్టించుకోవడం లేదని, ఆయనకు ఓటేసినందుకు సిగ్గుతో తలదించుకునే పరిస్థితి ఉందంటూ కార్మిక, ప్రజా సంఘాలు మండిపడ్డాయి. శనివారం అనంతపురం జిల్లా హిందూపురం పట్టణంలో జరిగిన విలేకరుల సమావేశంలో తూముకుంట పారిశ్రామిక సంఘం అధ్యక్షుడు రవికుమార్ మాట్లాడారు.
తూముకుంట పారిశ్రామిక వాడలో 93 ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఇక్కడి యాజమాన్యాలు కార్మికులపై అక్రమ కేసులు పెడుతున్నాయని వారు మండిపడ్డారు. వేతనాల పెంపు కోసం శాంతియుతంగా పోరాడుతుంటే... యాజమన్యాలు పోలీసులను ఉసిగొల్పి 11 మంది కార్మికులపై అక్రమ కేసులు పెట్టాయని ఆరోపించారు. అయినా ఎమ్మెల్యేగా ఉన్న బాలకృష్ణ ఏమాత్రం పట్టించుకోవడం లేదన్నారు.
ఇప్పటికైనా ఎమ్మెల్యే తమ సమస్యలను పరిష్కరించేందుకు ముందుకు రావాలని కోరారు. ఈ సమావేశంలో ఓపీడీఆర్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసులు, రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వెంకటరామిరెడ్డి, విప్రో కార్మిక సంఘం స్థానిక అధ్యక్షుడు రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.