గ్రేటర్‌లో బదిలీలు? | transfers in ghmc hyderabad | Sakshi
Sakshi News home page

గ్రేటర్‌లో బదిలీలు?

Published Wed, Sep 7 2016 11:57 PM | Last Updated on Tue, Sep 4 2018 5:24 PM

transfers in ghmc hyderabad

సాక్షి,సిటీబ్యూరో: మరికొన్ని రోజుల్లో జీహెచ్‌ఎంసీలో భారీస్థాయిలో బదిలీలు జరగనున్నాయి. ప్రస్తుతం గ్రేటర్‌లో ఉన్న 24 సర్కిళ్లను దసరా నాటికి 30 సర్కిళ్లుగా మార్చేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. అప్పటిలోగా దీర్ఘకాలంగా ఒకే దగ్గర తిష్టవేసిన వారిని సాగనంపే యోచనలో ప్రభుత్వం ఉంది. ఇందుకు ఐదారేళ్లకు పైబడి పనిచేస్తున్న వారి వివరాలను పంపించాల్సిందిగా ఆదేశించింది. ఈమేరకు అధికారులు వివరాలు పంపించినట్లు తెలుస్తోంది. వివిధ ప్రభుత్వ విభాగాల నుంచి జీహెచ్‌ఎంసీకి వచ్చిన వారు ఏళ్లతరబడి కదలడం లేదు.

వీరిలో టౌన్‌ప్లానింగ్, ఆరోగ్యం– పారిశుధ్యం, ఇంజినీరింగ్‌ విభాగాల వారు అధికంగా ఉన్నారు. డీటీసీపీ నుంచి వచ్చిన వారు టౌన్‌ప్లానింగ్‌లో, పబ్లిక్‌ హెల్త్‌ నుంచి వచ్చిన వారు ఇంజినీరింగ్‌ విభాగంలో, వైద్య, ఆరోగ్యశాఖ నుంచి వచ్చిన వారు ఆరోగ్యం–పారిశుధ్య విభాగాల్లో కొనసాగుతున్నారు. ఇక్కడ అవినీతిలో ఆరితేరిన వారు బదిలీ కాకుండా పైరవీలతో కొనసాగుతున్నారు.

ఇక జీహెచ్‌ఎంసీకి చెందిన వారు సైతం తమనెవరూ ఏమీ చేయలేరనే ధీమాతో అడ్డగోలుగా అక్రమాలకు పాల్పడుతున్నారు. వారిని బదిలీ చేసినా, జీహెచ్‌ఎంసీ పరిధిలోనే ఒక సర్కిల్‌ నుంచి మరో సర్కిల్‌కు లేదా జోన్‌కు మాత్రమే వెళుతున్నారు. దీంతో వారి ఆగడాలకు సైతం అడ్డు లేకపోయింది. ఏసీబీ దాడుల్లోనూ కోట్లకు కోట్లు అక్రమాస్తులు బయట పడుతుండడంతో దీర్ఘకాలంగా పనిచేస్తున్నవారిని, అక్రమార్కులుగా ముద్ర పడ్డవారిని బదిలీ చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.

‘యూనిఫైడ్‌ సర్వీస్‌ రూల్స్‌’ అమలు!
టౌన్‌ప్లానింగ్‌ విభాగంలో తిష్టవేసిన కొందరిని ఇటీవల సంస్థాగతంగా ఇతర సర్కిళ్లకు బదిలీ చేసినప్పటికీ పెద్దగా మార్పు కనబడలేదు. ఈ నేపథ్యంలో జీహెచ్‌ఎంసీలో పనిచేస్తున్నవారిని ఇతర కార్పొరేషన్లలోకి, అక్కడి వారిని ఇక్కడికి బదిలీ చేసేందుకు వీలుగా తొలిసారి ‘యూనిఫైడ్‌ సర్వీస్‌ రూల్స్‌’ను అమల్లోకి తేనున్నట్లు సమాచారం. ఇప్పటి దాకా ఈ రూల్స్‌ లేకపోవడంతో ఒక కార్పొరేషన్‌లో జాయినైన వారు సర్వీస్‌ చివరిదాకా అక్కడే కొనసాగుతున్నారు.

ఇటీవల టౌన్‌ప్లానింగ్, ఇంజినీరింగ్‌ వంటి విభాగాల్లో భారీ సంఖ్యలో కొత్త నియామకాలు జరిగినప్పటికీ వారిని తాత్కాలికంగా ఆయా పోస్టుల్లో నియమించారు. త్వరలో భారీ బదిలీలు జరుగనున్నాయని తెలిసి చాలామందికి స్థిరమైన స్థానాలు కేటాయించలేదు. డిప్యూటీ కమిషనర్లు సైతం ఒక్కరే రెండేసి సర్కిళ్లకు పనిచేస్తున్నారు. బదిలీలన్నీ పూర్తయ్యాక, వారికి స్థిరమైన స్థానాలు కేటాయించాలనే యోచనలో ఉన్నతాధికారులు ఉన్నట్లు తెలుస్తోంది. ఎటొచ్చీ బదిలీలు తప్పవని జీహెచ్‌ఎంసీలో ఇప్పటికే గుప్పుమంటోంది. సాధారణ ఉద్యోగులతో పాటు ఐదారుగురు అడిషనల్‌/జోనల్‌ కమిషనర్లు సైతం బదిలీ కావచ్చునని సమాచారం.

యూనిఫైడ్‌ సర్వీస్‌ రూల్స్‌ అమలు చేస్తే..
జీహెచ్‌ఎంసీతో పాటు వరంగల్‌లోని కాకతీయ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (కుడా) తదితర స్థానిక సంస్థల్లో ఒకసారి నియమితులైన ఉద్యోగులు రిటైరయ్యేంత వరకు అక్కడే కొనసాగుతున్నారు. దీంతో తమనెవరూ ఏమీ చేయలేరనే ఈ ధీమాతో వారు అక్రమాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ పరిస్థితి నివారించేందుకు ‘యూనిఫైడ్‌ సర్వీస్‌ రూల్స్‌’ అమల్లోకి తెస్తామని ఇటీవల మంత్రి కేటీఆర్‌ తెలిపారు. దీనిప్రకారం ఒక కార్పొరేషన్‌లోని వారిని రాష్ట్రంలోని ఏ స్థానిక సంస్థకైనా బదిలీ చేయవచ్చు. యూనిఫైడ్‌ సర్వీస్‌ రూల్స్‌ను అమలు చేస్తామని గత ప్రభుత్వాలు సైతం చెప్పినా కార్యరూపం దాల్చలేదు. కానీ ఇప్పుడు ఈ రూల్స్‌ను జీహెచ్‌ఎంసీలో అములు చేసేందుకు రంగం సిద్ధం చేసినట్టు సమాచారం.

 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement