రాజధాని ప్రజలకు నడకయాతన | transport problom in city 10villages dont have bus transport | Sakshi
Sakshi News home page

రాజధాని ప్రజలకు నడకయాతన

Published Fri, Apr 1 2016 3:43 AM | Last Updated on Thu, Aug 30 2018 4:49 PM

transport problom in city 10villages dont have bus transport

రోడ్లు విస్తరించినా బస్సులు వేయని సర్కారు
రాజధానిలో పది గ్రామాల ప్రజల అవస్థలు
సందర్శకులకూ తప్పని ఇబ్బందులు

సాక్షి, విజయవాడ బ్యూరో : అమరావతి ప్రాంత ప్రజలకు ‘నడక’యాతన తప్పడం లేదు. అద్భుత ప్రజా రాజధానిగా గొప్పలు చెబుతున్న సర్కారు రవాణా సౌకర్యాలపై కనీస దృష్టిపెట్టడం లేదు. ఇటీవల పలు గ్రామాల్లో పెద్ద ఎత్తున ఇళ్లు, దుకాణాలు, పశువుల పాకలు తొలగించి రోడ్లు విస్తరిస్తున్నారు. రోడ్లు విస్తరించినప్పటికీ పది గ్రామాలకు బస్సు సౌకర్యం లేకపోవడంతో మూడు నుంచి ఐదు కిలోమీటర్ల కాలినడక తప్పడం లేదు. కోట్లు కుమ్మరించి కొనుగోలు చేసిన అధునాతన స్కానియా బస్సులకు ‘అమరావతి’ అని నామకరణం చేసి హైదరాబాద్‌కు తిప్పుతూ సంబరపడే ఆర్టీసీ యాజమాన్యం రాజధాని ప్రాంత వాసులకు కనీసం ఆర్డినరీ బస్సు సౌకర్యాన్ని కూడా విస్తరించడం లేదు. ఫలితంగా రాజధాని అమరావతి ప్రాంత వాసుల ప్రయాణ కష్టాలు తీరడంలేదు.

 సీఎం, మంత్రులు, అధికారుల కోసమే?
రాజధాని పేరుతో ఇక్కడ భూముల క్రయ విక్రయాలు ఊపందుకున్న తొలినాళ్లలోనే వర్తక, వాణిజ్య సంస్థలు అందుబాటులోకి వచ్చాయి. బ్యాంకులు, హోటళ్లు, కార్లు, బైక్ షోరూమ్‌లతో పాటు అనేక వ్యాపార సంస్థలు వెలిశాయి. టీడీపీ అధికారం చేపట్టి రెండేళ్లు కావస్తున్నా.. రాజధాని ప్రాంతంలో ఎర్రబస్సు రాని గ్రామాల ప్రజల ఇబ్బందులు మాత్రం తీరలేదు. ఇటీవల సీఎం, మంత్రులు, అధికారులు పర్యటించేందుకు వీలుగా రాజధాని ప్రాంతంలో సీఆర్‌డీఏ అధికారులు రోడ్ల విస్తరణ పనులు చేపట్టారు. పాలకులు, అధికారులు కార్లలో రాకపోకలు సాగిస్తున్నారు కానీ, ఆయా గ్రామాల ప్రజలకు మాత్రం బస్సు సౌకర్యంపై దృష్టి పెట్టడం లేదని స్థానికులు ఆవేదన చెందుతున్నారు.

 బస్సెక్కాలంటే 3 నుంచి 5 కిలోమీటర్లు నడవాల్సిందే...
తుళ్లూరు, రాయపూడితో పాటు పది గ్రామాల్లో బస్సులు లేక ప్రజలు పడుతున్న అవస్థలను ప్రభుత్వ యంత్రాంగం ఏమాత్రం పట్టించుకోవడం లేదని పలువురు విమర్శిస్తున్నారు. విజయవాడ, గుంటూరు నుంచి పాత అమరావతితో పాటు కొన్ని ప్రాంతాలకు నిర్ణీత సమయంలో నామమాత్రంగా ఆర్టీసీ బస్సులు (ట్రిప్పులు) తిరుగుతున్నప్పటికీ అవి పలు గ్రామాల ప్రజలకు ఏ మాత్రం అందుబాటులో లేవు. దీంతో సమీప గ్రామాల నుంచి మూడు నుంచి ఐదు కిలోమీటర్లు కాలినడకన ప్రధాన రోడ్డుకు వచ్చి బస్సు ఎక్కాల్సిన పరిస్థితి ఏర్పడింది.

వెంకటపాలెం, శాఖమూరు, ఐనవోలు, లింగాయపాలెం, అనంతవరం, అబ్బిరాజుపాలెం, తాళ్లాయిపాలెం, బేతపూడి, నేలపూడి గ్రామాలకు చెందిన 20 వేలకుపైగా ప్రజలు ఆర్టీసీ బస్సు అందుబాటులో లేకపోవడంతో సమీప గ్రామాలకు ఆటోలు, బైక్‌లు, కాలినడకన వెళ్లేందుకు వ్యయప్రయాసలు పడుతున్నారు. 3,700 జనాభా కలిగిన వెంకటపాలెం అరటి, కూరగాయలు తదితర వాణిజ్య పంటల సాగుకు పెట్టింది పేరు. బీజేపీ ఎంపీ గోకరాజు గంగరాజు, పలువురు ప్రజాప్రతినిధులకు చెందిన భూములు ఉండటంతో వెంకటపాలేనికి ప్రాధాన్యం ఏర్పడింది. అయినా ఈ గ్రామానికి ఆర్టీసీ బస్సు రాకపోవడంతో అక్కడి ప్రజలు 4 కిలోమీటర్ల దూరంలోని ఉండవల్లి, మూడు కిలోమీటర్ల దూరంలోని పెనుమాక వెళ్లి బస్సు ఎక్కాల్సిన పరిస్థితి ఉంది.

 సందర్శకుల తాకిడి పెరిగినా...
శ్రీకృష్ణదేవరాయల కాలం నుంచి చరిత్రకెక్కిన ఉద్దండ్రాయునిపాలెం ఇటీవల రాజధాని నిర్మాణ శంకుస్థాపనకు వేదిక కావడంతో నిత్యం సందర్శకులు వస్తున్నారు. ప్రధానంగా శని, ఆదివారాల్లో ఇక్కడికి సందర్శకుల తాకిడి ఎక్కువగా ఉంటోంది. అయినా ఇక్కడికి ఆర్టీసీ సర్వీసు లేకపోవడంతో సందర్శకులు అవస్థలు పడుతున్నారు. ఆటోలు, బైక్‌లు, సొంత వాహనాలపైనే రాకపోకలు సాగించాల్సి వస్తోంది. తాళ్లాయిపాలెలలో ప్రముఖ శైవక్షేత్రం ఉండటంతో ఏడాది పొడవునా దాదాపు లక్షమందికి పైగా భక్తులు ఇక్కడికి వస్తుంటారు. ఇక్కడికీ బస్సు సౌకర్యం లేదు. ఇలా రాజధాని గ్రామాల్లో రోడ్లు విస్తరించారు.. షాపులు వెలిశాయి.. కానీ అక్కడి ప్రజలు, బయటి ప్రాంతాల నుంచి వచ్చేవారికి మాత్రం ప్రయాణ సౌకర్యాలు ఏమాత్రం మెరుగుపడలేదు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement