- మూడు ప్రదేశాలపై ప్రతిపాదనలు
- ప్రభుత్వానికి వరంగల్ అధికారుల నివేదిక
ములుగులో గిరిజన వర్సిటీ
Published Mon, Aug 1 2016 10:32 PM | Last Updated on Mon, Sep 4 2017 7:22 AM
సాక్షిప్రతినిధి, వరంగల్ : రాష్ట్ర ప్రభుత్వం వరంగల్ జిల్లాలో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ఈ ఏడాది జనవరిలో వరంగల్ జిల్లా పర్యటకు వచ్చినప్పుడు గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటుపై స్పష్టమైన ప్రకటన చేశారు. వరంగల్ జిల్లాను విద్యా కేంద్రంగా తీర్చిదిద్దడం లక్ష్యంగా గిరిజన విశ్వవిద్యాలయాన్ని సైతం ఈ జిల్లాలోనే ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు కోసం అనువైన ప్రదేశంపై ప్రతిపాదనలు పంపాలని ప్రభుత్వ వరంగల్ జిల్లా అధికారులను ఆదేశించింది.
ఈ మేరకు జిల్లా రెవెన్యూ అధికారులు పలు స్థలాలను గుర్తించారు. గిరిజన సంక్షేమ మంత్రి ఆజ్మీరా చందులాల్ ప్రాతినిధ్యం వహిస్తున్న ములుగు నియోజకవర్గంలోని ములుగు మండలంలో మూడు ప్రదేశాలు అనువైనవిగా అధికారులు ప్రతిపాదించారు. వరంగల్ జిల్లా కేంద్రానికి 50 కిలో మీటర్ల పరిధిలోనే ఈ మూడు స్థలాలు ఉన్నాయని పేర్కొన్నారు. ములుగు మండలం మాధవరావుపల్లిలో 160 ఎకరాల ప్రభుత్వ భూమిని, రాంచంద్రపురం శివారులో అటవీ శాఖకు చెందిన 550 ఎకరాలు, జాకారం పరిధిలోని అటవీ శాఖకు చెందిన 150 ఎకరాలను రెవెన్యూ అధికారులు గుర్తించారు.
మూడు ప్రదేశాల వివరాలు పంపాం
సీహెచ్.మహేందర్‌జీ, ములుగు ఆర్డీవో
గిరిజన విశ్వవిద్యాలం ఏర్పాటు కోసం మూడు చోట్ల స్థలాలను పరిశీలించాము. ప్రతిపాదనలు ప్రభుత్వానికి నివేదించాం. ఎక్కడ ఏర్పాటు చేసే విషయంపై ప్రభుత్వం నిర్ణయిస్తుంది.
Advertisement
Advertisement