Tribal Welfare Minister Chandulal
-
ములుగులో గిరిజన వర్సిటీ
మూడు ప్రదేశాలపై ప్రతిపాదనలు ప్రభుత్వానికి వరంగల్ అధికారుల నివేదిక సాక్షిప్రతినిధి, వరంగల్ : రాష్ట్ర ప్రభుత్వం వరంగల్ జిల్లాలో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ఈ ఏడాది జనవరిలో వరంగల్ జిల్లా పర్యటకు వచ్చినప్పుడు గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటుపై స్పష్టమైన ప్రకటన చేశారు. వరంగల్ జిల్లాను విద్యా కేంద్రంగా తీర్చిదిద్దడం లక్ష్యంగా గిరిజన విశ్వవిద్యాలయాన్ని సైతం ఈ జిల్లాలోనే ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు కోసం అనువైన ప్రదేశంపై ప్రతిపాదనలు పంపాలని ప్రభుత్వ వరంగల్ జిల్లా అధికారులను ఆదేశించింది. ఈ మేరకు జిల్లా రెవెన్యూ అధికారులు పలు స్థలాలను గుర్తించారు. గిరిజన సంక్షేమ మంత్రి ఆజ్మీరా చందులాల్ ప్రాతినిధ్యం వహిస్తున్న ములుగు నియోజకవర్గంలోని ములుగు మండలంలో మూడు ప్రదేశాలు అనువైనవిగా అధికారులు ప్రతిపాదించారు. వరంగల్ జిల్లా కేంద్రానికి 50 కిలో మీటర్ల పరిధిలోనే ఈ మూడు స్థలాలు ఉన్నాయని పేర్కొన్నారు. ములుగు మండలం మాధవరావుపల్లిలో 160 ఎకరాల ప్రభుత్వ భూమిని, రాంచంద్రపురం శివారులో అటవీ శాఖకు చెందిన 550 ఎకరాలు, జాకారం పరిధిలోని అటవీ శాఖకు చెందిన 150 ఎకరాలను రెవెన్యూ అధికారులు గుర్తించారు. మూడు ప్రదేశాల వివరాలు పంపాం సీహెచ్.మహేందర్‌జీ, ములుగు ఆర్డీవో గిరిజన విశ్వవిద్యాలం ఏర్పాటు కోసం మూడు చోట్ల స్థలాలను పరిశీలించాము. ప్రతిపాదనలు ప్రభుత్వానికి నివేదించాం. ఎక్కడ ఏర్పాటు చేసే విషయంపై ప్రభుత్వం నిర్ణయిస్తుంది. -
మంత్రి సంతకం ఫోర్జరీపై దర్యాప్తుకు కేసీఆర్ ఆదేశం
హైదరాబాద్: తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి చందూలాల్ సంతకం ఫోర్జరీ చేసినట్టు వచ్చిన కథనాలపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు స్పందించారు. ఈ కథనాలపై ఆయన సోమవారం విచారణకు ఆదేశించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు చందూలాల్ పేషీలో ఒకరిని, ఎస్టీ సంక్షేమ శాఖ సెక్రటరీ పేషీ నుంచి మరొకరిని అరెస్టు చేసినట్టు సమాచారం. గిరిజన సంక్షేమశాఖ మంత్రి అజ్మీరా చందూలాల్ పేరిట ఫోర్జరీ లేఖలు గత ఏడాదికాలంగా వెలువడుతున్నట్టు ఇటీవల కథనాలు వచ్చాయి. ఆయన సంతకాలను ఫోర్జరీ చేసి అక్రమాలకు పాల్పడుతున్నట్టు, కీలకమైన ఫైళ్లు, లేఖలపై మంత్రిగారి షాడో ఒకరు ఫోర్జరీ సంతకాలు చేసినట్టు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఈ వివాదంపై సమగ్ర దర్యాప్తుకు ఆదేశించినట్టు తెలుస్తోంది. -
‘ఫోర్జరీ లేఖలపై విచారణ చేపట్టాలి’
వరంగల్ : గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా చందూలాల్ పేరిట ఫోర్జరీ లేఖలు జారీ అవుతున్న వైనంపై న్యాయ విచారణ జరిపించాలని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే ధనసరి సీతక్క డిమాండ్ చేశారు. హన్మకొండ బాలసముద్రంలోని టీడీపీ జిల్లా కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. మంత్రిగా చందూలాల్ బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి ఐటీడీఏ అక్రమాలకు అడ్డాగా మారిందన్నారు. ఇసుక లారీల కారణంగా మృతిచెందిన ఆదివాసీలకు ఇప్పటిదాకా నష్టపరిహారం అందించలేదన్నారు. సీఎం కే సీఆర్ ఏజెన్సీలో సాగుతున్న అక్రమాలపై విచారణ జరిపించాలని కోరారు. అనంతరం జిల్లా పార్టీ అధ్యక్షుడు గండ్ర సత్యనారాయణరావు మాట్లాడుతూ మిషన్ కాకతీయ పనుల్లో మంత్రి అనుయూయులు, ఇంజినీరింగ్ అధికారులతో కలిసి అక్రమాలకు పాల్పడుతున్నారన్నారు. నాయకులు బాస్కుల ఈశ్వర్, చాడ రఘునాథరెడ్డి, రహీం, శ్రీరాములు, మార్గం సారంగం, విజయకుమార్ పాల్గొన్నారు.