
‘ఫోర్జరీ లేఖలపై విచారణ చేపట్టాలి’
గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా చందూలాల్ పేరిట ఫోర్జరీ లేఖలు జారీ అవుతున్న వైనంపై న్యాయ విచారణ జరిపించాలని....
వరంగల్ : గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా చందూలాల్ పేరిట ఫోర్జరీ లేఖలు జారీ అవుతున్న వైనంపై న్యాయ విచారణ జరిపించాలని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే ధనసరి సీతక్క డిమాండ్ చేశారు. హన్మకొండ బాలసముద్రంలోని టీడీపీ జిల్లా కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. మంత్రిగా చందూలాల్ బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి ఐటీడీఏ అక్రమాలకు అడ్డాగా మారిందన్నారు. ఇసుక లారీల కారణంగా మృతిచెందిన ఆదివాసీలకు ఇప్పటిదాకా నష్టపరిహారం అందించలేదన్నారు.
సీఎం కే సీఆర్ ఏజెన్సీలో సాగుతున్న అక్రమాలపై విచారణ జరిపించాలని కోరారు. అనంతరం జిల్లా పార్టీ అధ్యక్షుడు గండ్ర సత్యనారాయణరావు మాట్లాడుతూ మిషన్ కాకతీయ పనుల్లో మంత్రి అనుయూయులు, ఇంజినీరింగ్ అధికారులతో కలిసి అక్రమాలకు పాల్పడుతున్నారన్నారు. నాయకులు బాస్కుల ఈశ్వర్, చాడ రఘునాథరెడ్డి, రహీం, శ్రీరాములు, మార్గం సారంగం, విజయకుమార్ పాల్గొన్నారు.