
టీడీపీ ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డిపై ఫోర్జరీ కేసు
⇒ బంజారాహిల్స్‌లో విలువైన భూమిని కబ్జా చేసే యత్నం
⇒ బోగస్ డాక్యుమెంట్లను సృష్టించిన వైనం
⇒ నకిలీ స్థల యజమానిని తెరపైకి తెచ్చిన నిందితులు
⇒ దీపక్‌రెడ్డితోపాటు మరో నలుగురిపై కేసు నమోదు చేసిన సీసీఎస్ పోలీసులు
⇒ నోటీసులు ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్న అధికారులు
⇒ హైదరాబాద్, అనంతపురంలో అందుబాటులో లేని దీపక్‌రెడ్డి
⇒ మరో రెండు భూకబ్జా కేసుల్లోనూ దీపక్‌రెడ్డి హస్తం!
సాక్షి, సిటీబ్యూరో: తెలుగుదేశం పార్టీ నేత, అనంతపురం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ జి.దీపక్‌రెడ్డిపై హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్(సీసీఎస్) పోలీసులు ఫోర్జరీ కేసు నమోదు చేశారు. బంజారాహిల్స్ ప్రాంతంలో విలువైన భూమిని తప్పుడు పత్రాలతో కబ్జా చేయడానికి ప్రయత్నించారనే ఆరోపణలపై ఈ కేసును రిజిస్టర్ చేశారు. అనంతపురం జిల్లా రాయదుర్గంకు చెందిన దీపక్‌రెడ్డి ఆ జిల్లాలోని తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డికి స్వయాన అల్లుడు. భూకబ్జా కేసులో ఐదో నిందితుడిగా ఉన్న దీపక్‌రెడ్డికి నోటీసులు జారీ చేయడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. హైదరాబాద్, అనంతపురంలో ఆయన జాడ లభించకపోవడంతో సాధ్యం కాలేదు. ఈ కేసులో సహ నిందితులుగా ఉన్న వారిపై మరో రెండు ఇదే తరహా కేసులు ఉండడంతో వాటిలోనూ దీపక్‌రెడ్డి పాత్రను పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తు దశలో ఉందని సీసీఎస్ డీసీపీ అవినాష్ మహంతి చెప్పారు.
ఖరీదైన 3.37 ఎకరాలపై కన్ను
బంజారాహిల్స్‌లోని రోడ్ నంబర్ 2లో సర్వే నం.129/71లోని 3.37 ఎకరాల స్థలానికి సంబంధించి ఈ వివాదం రేగింది. ఈ స్థలాన్ని కొన్ని దశాబ్దాల క్రితం నగరంలో నివాసం ఉన్న శరణార్థి అయూబ్ కమల్‌కు అప్పటి ప్రభుత్వం కేటాయించింది. దీన్ని ఆయన నుంచి 1960లో ఎంవీఎస్ చౌదరితోపాటు ఆయన సోదరులు ఉమ్మడిగా ఖరీదు చేశారు. అప్పటి నుంచి ఈ భూమి వారి ఆధీనంలోనే ఉంది. అయితే అయూబ్ కమల్ ఈ స్థలాన్ని అన్సారీ బ్రదర్స్‌కు విక్రయించినట్లు, వారి నుంచి దీన్ని తాము కొనుగోలు చేసినట్లు జై హనుమాన్ ఎస్టేట్స్ సంస్థకు చెందిన బి.శైలేష్ సక్సేనా, బి.సంజయ్ సక్సేనా, బి.ప్రకాశ్‌చంద్ర సక్సేనాలతోపాటు జి.దీపక్‌రెడ్డి బోగస్ డాక్యుమెంట్లు సృష్టించారు. వీటి ఆధారంగా సివిల్ సూట్ దాఖలు చేయడం ద్వారా తదుపరి చర్యలకు ఉపక్రమించారు. దీంతో ఎంవీఎస్ చౌదరి జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రాథమిక విచారణ చేపట్టిన షేక్‌పేట మండల రెవెన్యూ అధికారులు ఆ ఖరీదైన స్థలానికి ఎంవీఎస్ చౌదరి యజమాని అని తేల్చారు. స్థలాన్ని కాజేసేందుకు ప్రయత్నించినవారిపై చౌదరి తరపు ప్రతినిధి, మాదాపూర్‌కు చెందిన ఎం.రాధాకృష్ణ సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది.
ఆచూకీ దొరకని అన్సారీ బ్రదర్స్
కేసు దర్యాప్తులో భాగంగా సీసీఎస్ పోలీసులు షేక్‌పేట మండల రెవెన్యూ అధికారుల నుంచి వివరాలు సేకరించారు. ఈ నేపథ్యంలో సదరు స్థలానికి యజమానులు ఎంవీఎస్ చౌదరి బ్రదర్స్ అని తేటతెల్లమైంది. దీపక్‌రెడ్డి తదితరులు సృష్టించిన నకిలీ డాక్యుమెంట్లలోని చిరునామాల ఆధారంగా అన్సారీ బ్రదర్స్‌ను పట్టుకోవడానికి సీసీఎస్ పోలీసులు రంగంలోకి దిగారు. అయితే, ఆ చిరునామాల్లో అన్సారీ బ్రదర్స్ ఆచూకీ లభించలేదు. గతంలోనూ అక్కడ అలాంటి వ్యక్తులెవరూ లేరని తేలింది. దీంతో నిందితులు ఆ భూమికి సంబంధించి నకిలీ యజమానిని తెరపైకి తెచ్చినట్లు పోలీసులు భావిస్తున్నారు. దీపక్‌రెడ్డి తదితరులు వినియోగించిన స్టాంప్ పేపర్లు, స్టాంపులు తదితరాలు పాత తేదీలతో ఉండడం గమనార్హం.
నోటీసులు ఇచ్చేందుకు ప్రయత్నాలు
ఈ కేసులో మిగిలిన వారితోపాటు ఐదో నిందితుడిగా ఉన్న ఎమ్మెల్సీ జి.దీపక్‌రెడ్డికి నోటీసులు ఇవ్వడానికి సీసీఎస్ పోలీసులు ప్రయత్నాలు ప్రారంభించారు. బంజారాహిల్స్ లోని సదరు స్థలానికి సంబంధించిన పూర్తి రికార్డులు తీసుకురావాల్సిందిగా ఈ నోటీసుల్లో సీసీఎస్ పోలీసులు కోరనున్నారు.
సక్సేనాలపై మరో రెండు కేసులు...
సీసీఎస్‌లో నమోదైన కేసులో దీపక్‌రెడ్డితోపాటు ఆరోపణలు ఎదుర్కొంటున్న సక్సేనా బ్రదర్స్‌పై ఇదే తరహాకు చెందిన మరో రెండు కేసులు ఉన్నాయి. హైదరాబాద్‌లో తాము కన్నేసిన ప్రభుత్వ, ప్రైవేట్ భూములకు వీరు నకిలీ పత్రాలు సృష్టిస్తుంటారు. వీటి ఆధారంగా సివిల్ కేసులు దాఖలు చేసి, భూమిని వివాదంలోకి లాగుతారు. ఇలా వివాదంలో చిక్కుకున్న స్థలం యజమాని ప్రైవేట్ వ్యక్తి అయితే కబ్జాదారులతో రాజీకే మొగ్గు చూపుతుంటారు. ప్రభుత్వ స్థలమైతే విషయం పోలీసు స్టేషన్లు, కోర్టుల వరకు వెళ్తోంది. ఈ రకంగా ఆసిఫ్‌నగర్, జూబ్లీహిల్స్‌లో రూ.వందల కోట్ల విలువైన భూముల కబ్జాపై నమోదైన కేసులను సీసీఎస్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ వ్యవహారాల్లోనూ దీపక్‌రెడ్డి ప్రమేయం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. తదుపరి దర్యాప్తు, అనుమానితుల విచారణ తర్వాతే పూర్తి వివరాలు వెలుగులోకి వస్తాయని చెబుతున్నారు.
కాగితాల్లోనే స్థలాల యజమానులు
ఈ మూడు కేసులపై దర్యాప్తు ప్రారంభించిన సీసీఎస్ పోలీసులు లోతుగా ఆరా తీస్తున్నారు. ఈ ముఠా సృష్టించిన పత్రాల్లోని వివరాలను సరిచూడడం ప్రారంభించారు. అందులో స్థలా లు అమ్మినట్లు, కొన్నట్లు రికార్డయిన వ్యక్తుల పేర్లు, చిరునామాలను క్షేత్రస్థాయిలో పరిశీలించా రు. అవన్నీ బోగస్ పేర్లు, చిరునామాలేనని స్పష్టమైంది. ప్రస్తుతం ఆయా చిరునామల్లో ఉంటున్న వారిని ఆరా తీయగా... సదరు పత్రా ల్లో ఉన్న వ్యక్తులు అక్కడ ఉండరని, వారు ఎవ రో కూడా తమకు తెలియదని చెప్పుకొచ్చారు. దీంతో పోలీసులు నకిలీ డాక్యుమెంట్లను తయారు చేసిన వారిని గుర్తించే పనిలో పడ్డారు. ఓ కేసుకు సంబంధించి ఈ పత్రాల సృష్టికర్తలను గుర్తించి, విచారించగా.. ముఠా సూత్రధారి, పాత్రధారులకు సంబంధించి కీలక సమాచారం బయటపడినట్లు తెలిసింది.