
సీసీఎస్‌లో హాజరైన టీడీపీ ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డి
ఫోర్జరీ పత్రాలతో హైదరాబాద్‌లో భూకబ్జాకు యత్నించిన కేసులో నిందితుడిగా ఉన్న టీడీపీ నేత, అనంతపురం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ జి.దీపక్‌రెడ్డి శుక్రవారం
కోర్టు ద్వారా మంజూరైన ముందస్తు బెయిల్ వివరాలు దర్యాప్తు అధికారికి అందజేత
సాక్షి, హైదరాబాద్: ఫోర్జరీ పత్రాలతో హైదరాబాద్‌లో భూకబ్జాకు యత్నించిన కేసులో నిందితుడిగా ఉన్న టీడీపీ నేత, అనంతపురం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ జి.దీపక్‌రెడ్డి శుక్రవారం హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్(సీసీఎస్)లో హాజరయ్యారు. నాంపల్లి కోర్టు తనకు మంజూరు చేసిన ముందస్తు బెయిల్‌ను కేసు దర్యాప్తు అధికారికి అందజేశారు. తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డికి స్వయానా అల్లుడైన దీపక్‌రెడ్డి మరికొందరితో కలసి బంజారాహిల్స్‌లోని రోడ్ నెం.2లో అత్యంత ఖరీదైన ప్రాంతంలో ఉన్న సర్వే నం.129/71లోని 3.37 ఎకరాల స్థలాన్ని ఫోర్జరీ పత్రాలతో కబ్జా చేసేందుకు ప్రయత్నించినట్టుగా సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేయడం విదితమే.
ఈ నేపథ్యంలో ప్రాథమిక ఆధారాలు సేకరించిన అధికారులు వివరణ కోరుతూ దీపక్‌రెడ్డికి నోటీసుల జారీకి ప్రయత్నించారు. అయితే వారికి దొరక్కుండా తప్పించుకు తిరిగిన దీపక్‌రెడ్డి అనారోగ్యకారణాలు చూపిస్తూ కోర్టు నుంచి ముందస్తు బెయిల్ పొందారు. దీన్ని ఎగ్జిక్యూట్ చేసుకోవడానికి శుక్రవారం సీసీఎస్‌కు వచ్చారు. ఈ సందర్భంగా రెండు గంటలపాటు దీపక్‌రెడ్డిని కేసు దర్యాప్తు అధికారి ఫోర్జరీపై ప్రశ్నించినట్లు తెలిసింది. ఈ కేసుకు సంబంధించి పరారీలో ఉన్న మిగిలిన నిందితులు బి.శైలేష్ సక్సేనా, బి.సంజయ్ సక్సేనా, బి.ప్రకాష్ చంద్ర సక్సేనాల కోసమూ సీసీఎస్ అధికారులు ముమ్మరంగా గాలిస్తున్నారు.
‘సాక్షి’ ఫొటో జర్నలిస్ట్‌పై దౌర్జన్యం..
సీసీఎస్ నుంచి తిరిగెళుతున్న సమయంలో దీపక్‌రెడ్డిని ఫొటోలు తీసిన ‘సాక్షి’ ఫొటో జర్నలిస్ట్ పి.మోహనాచారిపై ఆయనతోపాటు ఆయన అనుచరులు దౌర్జన్యానికి దిగారు. తీవ్రంగా దుర్భాషలా డారు. దౌర్జన్యానికి దిగి మోహనాచారి చేతిలో ఉన్న కెమెరాను బలవంతంగా లాక్కోవ డంతోపాటు అందులోని చిప్‌ను తీసేసుకు న్నారు. ఈ అన్యాయం ఏమిటని ‘సాక్షి’ ఫొటో జర్నలిస్ట్ ప్రశ్నించగా... ‘‘నాకేం అవుతుంది. ఇప్పటికే ఓ కేసు ఉంది. మరో కేసు రిజిస్టర్ అవుతుంది’’ అంటూ దీపక్ రెడ్డి విరుచుకుపడ్డారు. దీనిపై మోహనాచారి శుక్రవారం రాత్రి సైఫాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.