
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌కు చెందిన టీడీపీ ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డి చేసిన మరో ఫోర్జరీ వ్యవహారం రూఢీ అయింది. ఓ మహిళపై కక్షకట్టిన దీపక్‌రెడ్డి ఆమె సంతకాలు ఫోర్జరీ చేసి, ఆమెపైనే సివిల్ కేసు వేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్‌లో నమోదైన ఈ కేసు.. దర్యాప్తు నిమిత్తం హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్(సీసీఎస్)కు బదిలీ అయింది. ఆ పత్రాలను ఫోరెన్సిక్ పరీక్షల నిమిత్తం ఎఫ్‌ఎస్‌ఎల్‌కు పంపిన అధికారులు ఫోర్జరీ జరిగినట్లు నిర్ధారించారు. దీంతో కొద్దీ రోజుల క్రితం దీపక్‌రెడ్డికి నోటీసులు జారీ చేసి ఆయన కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే ఫోర్జరీ, భూకబ్జా తదితర ఆరోపణలపై నమోదైన కేసులో దీపక్‌రెడ్డి అరెస్టు అయిన విషయం తెలిసింది. ప్రస్తుతం ఈ కేసులో ఆయన బెయిల్‌పై ఉన్నారు.
ఆర్థిక లావాదేవీలపై వివాదం..
బంజారాహిల్స్‌కు చెందిన పద్మావతి 2012లో బాచుపల్లి ప్రాంతంలో రెండు క్రషర్ ప్లాంట్లు నిర్వహించారు. వీటికి ముడిసరుకును దీపక్‌రెడ్డి తన గ్రేట్ ఇండియా మైనింగ్ సంస్థ ద్వారా సరఫరా చేశారు. ఈ నేపథ్యంలో వీరి మధ్య ఆర్థిక లావాదేవీలకు సంబంధించి వివాదం రేగింది. దీంతో దీపక్‌రెడ్డి అనుచరులు క్రషర్ ప్లాంట్‌లోకి దౌర్జన్యంగా ప్రవేశించి, సామగ్రి ఎత్తుకెళ్లారు. పద్మావతి ఫిర్యాదుతో దుండిగల్ పోలీసులు రెండు కేసులు నమోదు చేశారు. పద్మావతిపై కక్షకట్టిన దీపక్‌రెడ్డి.. ఆమె క్రషర్ ప్లాంట్లను సొంతం చేసుకోవాలని భావించారు. బాచుపల్లిలోని ప్లాంట్ విక్రయించేందుకు పద్మావతి రూ.5 లక్షల అడ్వాన్స్ తీసుకుని అగ్రిమెంట్ కమ్ సేల్ డీడ్ చేసినట్లు నకిలీ పత్రాలు సృష్టించారు. దీనిపై పద్మావతి సంతకాన్ని ఫోర్జరీ చేశారు. వీటి ఆధారంగా దీపక్‌రెడ్డి సిటీ సివిల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
న్యాయస్థానం నుంచి నోటీసు అందుకున్న పద్మావతి అవాక్కయ్యారు. తాను ఎవరితోనూ ఎలాంటి అగ్రిమెంట్ చేసుకోలేదని, తన సంతకాన్ని ఫోర్జరీ చేశారని కోర్టుకు విన్నవించడంతో ఈ పిటిషన్ డిస్మిస్ అయింది. తన సంతకాలను ఫోర్జరీ చేసిన వారిపై చర్యలు తీసుకునేలా పోలీసుల్ని ఆదేశించాలని ఆమె కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కోర్టు ఆదేశాల మేరకు దీపక్‌రెడ్డిపై బంజారాహిల్స్ ఠాణాలో 2014లో కేసు నమోదైంది.
ఫోర్జరీ జరిగినట్టు నిర్ధారణ..
ఈ కేసును ఉన్నతాధికారులు దర్యాప్తు నిమిత్తం సీసీఎస్‌కు బదిలీ చేశారు. అనుమానిత డాక్యుమెంట్లు ఫోర్జరీవా? కాదా? అన్నది తేల్చడానికి వాటిని ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ(ఎఫ్‌ఎస్‌ఎల్)కి పంపారు. వీటిని విశ్లేషించిన నిపుణులు ఫోర్జరీ జరిగినట్లు నిర్ధారించారు. దీంతో సీసీఎస్ పోలీసులు పూర్తి వివరాలు సేకరించడానికి దీపక్‌రెడ్డికి నోటీసులు జారీ చేశారు. అధికారులు ఆయన కోసం ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో తనకు మరోసారి అరెస్టు ముప్పు తప్పదని దీపక్‌రెడ్డి భావించారు. పోలీసులకు వ్యక్తిగతంగా అందుబాటులోకి రాకుండా ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నాలు చేశారు. నాంపల్లి కోర్టులో ముందస్తు బెయిల్ లభించకపోవడంతో పై కోర్టును ఆశ్రయించినట్లు తెలిసింది.