టీఆర్‌ఎస్‌ది నిరంకుశ పాలన
ఇందూరు : టీఆర్‌ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో నిరంకుశ పాలన కొనసాగిస్తుందని టీపీపీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడుగు గంగాధర్ ఆరోపించారు. శుక్రవారం కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల సమయంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వ అధికారంలోకి రాగానే రాష్ట్రంలో ఉద్యమాలు, ధర్నాలు, ఆందోళనలు ఉండవని కేసీఆర్ చెప్పారని తెలిపారు. కానీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో ప్రజలు, నిరుద్యోగులు, రైతులు, విద్యార్థులు రోడ్డెకుతున్నారని, ఇదేనా టీఆర్‌ఎస్ పరిపాలన అని ప్రశ్నించారు. విద్యార్థులు, నిరుద్యోగుల జీవితాలతో ప్రభుత్వం ఆటలాడుకుంటోందని, ఉద్యోగాల పేరిట మోసం చేస్తుందన్నారు. అలాగే ఎంసెట్ పేపర్ లీకేజీ విషయంలో ప్రభుత్వ పాత్ర ఉందని ఆరోపించారు. మల్లన్న సాగర్ భూ నిర్వసితులపై లాఠీచార్జి జరిగిన సందర్భంగా బాధితులను పరామర్శించడానికి వెళుతున్న కాంగ్రెస్ నాయకులను అరెస్టు చేయడం ప్రజాస్వామ్యానికి అడ్డు తడిలినట్టేనన్నారు. సమావేశంలో కాంగ్రెస్ నాయకులు శేఖర్ గౌడ్, కుద్దుస్, బంటు రాము, సుభాష్ తదితరులు పాల్గొన్నారు.