
గులాబీ బాస్ బేగ్..?
• రాజ ధానిలో సమావేశమైనఆ పార్టీ ప్రజా ప్రతినిధులు
• జిల్లా అధ్యక్ష పదవితోపాటు ఒక్కో అసెంబ్లీ నుంచి ఐదుగురి పేర్లు ప్రతిపాదన
• మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ కోసం బేగ్ ప్రయత్నాలు
• రెండు, మూడు రోజుల్లో కొత్త కమిటీని ప్రకటించనున్న టీఆర్‌ఎస్ అధిష్టానం
సాక్షి, ఖమ్మం: జిల్లా టీఆర్‌ఎస్ అధ్యక్ష పదవి మరోసారి షేక్ బుడాన్‌బేగ్‌కే దక్కనుంది. హైదరాబాద్‌లో రెండు రోజులుగా జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు సమావేశమై జిల్లా అధ్యక్షుడి ఎంపికపై సుదీర్ఘంగా చర్చించారు. అధ్యక్ష పదవికి బేగ్ సరైనవ్యక్తి అని అందరూ ఏకాభిప్రాయానికి వచ్చారు. రెండు,మూడు రోజుల్లో పార్టీ అధిష్టానం అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. అధ్యక్షుడితోపాటు జిల్లాకమిటీలో ప్రతి నియోజకవర్గం నుంచి ఐదుగురు సభ్యులు ఉండేలా కసరత్తు చేస్తున్నారు. జిల్లాల పునర్విభజన నేపథ్యంలో అన్ని జిల్లాలకు కొత్త అధ్యక్షులను నియమిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు.
దీంతో ఖమ్మం జిల్లా అధ్యక్షుడిని కూడా మారుస్తారనే ప్రచారం జరిగింది.షేక్ బుడాన్‌బేగ్ టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడిగా రెండేళ్లుగా పనిచేస్తున్నారు. ఆయన పనితీరు పట్ల అధిష్టానంతోపాటు జిల్లా ప్రజాప్రతినిధులు సంతృప్తిగా ఉన్నారు. దీంతో మరోసారి కూడా ఆయన్నే కొనసాగించాలనే నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.బుడాన్‌బేగ్ మాత్రం మైనార్టీ కార్పొరేషన్ పదవి కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆ దిశగా పలువురు నాయకులను కలిసి తన అభిప్రాయాన్ని చెప్పినట్లు సమాచారం. టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్ష పదవిలో కొనసాగితే...మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ పదవి రాదేమోననే ఆలోచనలో బేగ్ ఉన్నారని తెలుస్తోంది.
అధ్యక్ష పదవికి అంగీకారం తెలుపుతూనే.. మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ పదవి తప్పకుండా ఇవ్వాలని పార్టీ పెద్దలను కోరినట్లు తెలిసింది. తొలుత అధ్యక్ష పదవి బేగ్‌కు ఇచ్చిన తర్వాత.. మైనార్టీ కార్పొరేషన్ విషయం చర్చిద్దామని అధిష్టానం ఓ నిర్ణయానికి వచ్చిందని ఆ పార్టీలో ప్రచారం జరుగుతోంది. అరుుతే బేగ్‌కు మైనార్టీ కార్పొరేషన్ ఇస్తే.. అధ్యక్ష పదవిని ఎవరికి ఇవ్వాలనే దానిపై కూడా ప్రాథమికంగా ఆ పార్టీ జిల్లా ప్రజాప్రతినిధులు ఏకాభిప్రాయానికి వచ్చారని సమాచారం. జిల్లా కమిటీలో అధ్యక్షుడితోపాటు ఉపాధ్యక్షుడు, ఐదుగురు ప్రధాన కార్యదర్శులు, ఐదుగురు కార్యదర్శులు, ఐదుగురు సహాయ కార్యదర్శులు, ఏడుగురు కార్యవర్గ సభ్యులు కలిపి మొత్తంగా 24 మంది ఉండనున్నారు. మొత్తంగా ఒక్కో నియోజకవర్గం నుంచి సమ ప్రాతిపదికన కమిటీలో ప్రాతినిధ్యం ఇవ్వనున్నారు.