టీఆర్‌ఎస్ దళపతి కేసీఆర్
⇔ టీఆర్‌ఎస్ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎనిమిదోసారి ఎన్నిక
⇔ ప్లీనరీలో జయజయధ్వానాలు.. అభినందనలు తెలిపిన నేతలు
⇔ అందరికీ ధన్యవాదాలు: కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: టీఆర్‌ఎస్ అధ్యక్షుడిగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వరుసగా ఎనిమిదోసారి గులాబీ దళపతిగా బాధ్యతలు చేపట్టారు. శుక్రవారం ఉదయం తెలంగాణ భవన్‌లో ఎన్నికల అధికారి నాయిని నర్సింహారెడ్డి పార్టీ అధ్యక్ష ఎన్నికపై ప్రకటన చేశారు. అందరూ కేసీఆర్ నాయకత్వమే కావాలని కోరుకున్నారని.. అందుకే ఆయన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు తెలిపారు. అనంతరం కొంపల్లిలో ఏర్పాటు చేసిన తెలంగాణ ప్రగతి ప్రాంగణంలో టీఆర్‌ఎస్ ప్లీనరీ అట్టహాసంగా ప్రారంభమైంది.
రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి పార్టీ ప్రతినిధులు భారీగా తరలివచ్చారు. ఉదయం 11 గంటలకు అక్కడికి చేరుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుగా పార్టీ జెండాను ఆవిష్కరించి ప్లీనరీని ప్రారంభించారు. అదే ప్రాంగణంలో ఏర్పాటు చేసిన అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించారు. అమరుల త్యాగాలను స్మరించుకుంటూ రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. అనంతరం పార్టీలో సీనియర్ నేత, సెక్రెటరీ జనరల్ ఎంపీ కె.కేశవరావు టీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడిగా కేసీఆర్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ప్రకటించారు. దీంతో పార్టీ శ్రేణుల జయజయధ్వానాలతో సభా ప్రాంగణం మార్మోగింది.
గులాబీ దళపతిగా తిరిగి పగ్గాలు అందుకున్న తమ అధినేత కేసీఆర్‌కు ముందుగా మంత్రులు పుష్పగుచ్ఛం అందించి అభినందనలు తెలిపారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మహిళా ఎమ్మెల్యేలు వేదికపైకి వెళ్లి అభినందనలు తెలిపారు. నేతల ఆత్మీయ పలకరింపులు, సెల్ఫీలతో సభాప్రాంగణమంతా కోలాహ లంగా మారింది. ప్లీనరీ వేదికపై మేయర్ బొంతు రామ్మోహన్ స్వాగతం పలకగా.. శాసన మండలి పార్టీ విప్ పల్లా రాజేశ్వరరెడ్డి స్వాగతోపన్యాసం చేశారు. ఎంపీ కె.కేశవరావు తొలి పలుకులు అందించే ప్రసంగం చేశారు.
అనుమానాల్ని పటాపంచలు చేశాం: కేసీఆర్
టీఆర్‌ఎస్ అధ్యక్షుడిగా తనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు పార్టీ అధినేత కేసీఆర్ అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ.. ‘‘2001లో తెలంగాణలో దిక్కుతో చని స్థితిలో సమైక్య పాలకుల అహంకార పూరిత అవమానాలతో కుంగి కృశించి పోతున్న తరుణంలో గులాబీ జెండా ఎగిరిం ది. ఈ పార్టీ ఉంటుందా అని అందరికీ అను మానం ఉండేది. కానీ అన్ని అనుమానాల్ని పటాపంచలు చేసి తెలంగాణ కలను టీఆర్‌ఎస్ సాకారం చేసింది’’అని అన్నారు.
ప్రతి గింజపై కేసీఆర్ పేరు: పల్లా
ప్రతి బియ్యపు గింజపై తినేవాడి పేరుంటుం దనే నానుడిని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తిరగరాశారని పార్టీ విప్ పల్లా రాజేశ్వరరెడ్డి అన్నారు. ఇకపై తినే గింజపై రైతు పేరు.. రైతుకు అండగా నిలిచిన కేసీఆర్ పేరు ఉంటుందని అన్నారు. పార్టీ సభ్యత్వానికి అపూర్వ స్పందన లభించిం దని, ఈసారి 75 లక్షలకు చేరిన తీరు దేశంలోనే అద్వితీయమని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో పండు గలు, పబ్బాలు, బతుకమ్మలు, బోనాలన్నిం టినీ ఉద్యమ రూపంగా మలిచిన కేసీఆర్.. ముఖ్యమంత్రిగా రాష్ట్రంలోని అన్ని వర్గాలు, అన్ని కులాలకు ఆత్మీయ బంధువుగా నిలిచాడని అన్నారు.
కారణజన్ముడు..: కేకే
ముఖ్యమంత్రి కేసీఆర్ కారణ జన్ముడని, తెలంగాణలో నూతన శకానికి నాంది పలికిన నాయకుడని సీనియర్ నేత కేకే అన్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా పథకా లను రూపకల్పన చేసి తెలంగాణ రాష్ట్రానికే కొత్త నిర్వచనం ఇచ్చిన ఘనత ఆయనకే దక్కిందని చెప్పారు. ఆర్థిక లక్ష్య సాధనతో పాటు సామాజిక న్యాయం, సమానత్వం తోనే పాలనకు సార్థకత వస్తుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో అన్ని వర్గాల అభివృద్ధికి నిధులు కేటాయించి ప్రభుత్వం చిత్తశుద్ధిని నిరూపించుకుందన్నారు.