
సాక్షి,హైదరాబాద్: గ్రేటర్ పరిధిలో అధికార టీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియ పూర్తికి మరో వారం రోజులు పట్టే అవకాశాలున్నట్లు పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రధానంగా ఈ పదవిని దక్కించుకునేందుకు ముషీరాబాద్ నియోజకవర్గానికి చెందిన ఎంఎన్ శ్రీనివాస్, సనత్‌నగర్ నియోజకవర్గానికి చెందిన పీఎల్ శ్రీనివాస్ రేసులో ఉన్నట్లు సమాచారం. వీరిద్దరూ కాకుండా కేసీఆర్, కేటీఆర్ ఆశీస్సులతో తెరపైకి మరో కొత్త నేతపేరు కూడా అనూహ్యంగా ముందుకొచ్చే అవకాశాలున్నట్లు పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. కాగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ..సెప్టెంబరు 30 లోగా గ్రేటర్ పరిధిలోని అన్ని డివిజన్లు, బస్తీల్లో పార్టీ కమిటీల ఏర్పాటు ప్రక్రియను పూర్తిచేయాలని ఆదేశించినప్పటికీ మొత్తంగా 50 శాతమే ఎంపిక పూర్తయినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
చదవండి: హుజురాబాద్ ఉప ఎన్నిక: తొలిరోజే టీఆర్‌ఎస్ అభ్యర్థి నామినేషన్ దాఖలు
పలు నియోజకవర్గాల్లో పార్టీ ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జులు, అధిష్టానం నియమించిన దూతలు, కార్పొరేటర్లు, ముఖ్యనేతల మధ్య సయోధ్య కరువవడంతోనే ఈ ప్రక్రియ ఆలస్యమవుతున్నట్లు సమాచారం. మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ ప్రాతినిథ్యం వహిస్తున్న సనత్‌నగర్ నియోజకవర్గంతోపాటు డిప్యూటీ స్పీకర్ పద్మారావు ప్రాతినిథ్యం వహిస్తున్న సికింద్రాబాద్ నియోజకవర్గం పరిధిలో ఎంపిక ప్రక్రియ దాదాపు పూర్తయినట్లు తెలిసింది. అధికార పార్టీలో చేరిన ఎమ్మెల్యేలు ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో కార్పొరేటర్లు, ఎమ్మెల్యేల మధ్య ఎంపిక ప్రక్రియ కొత్త వివాదాలకు తావిస్తోంది.
చదవండి: టీఆర్‌ఎస్ మీటింగ్‌ల్లో పస లేదు.. నాకే బ్రహ్మరథం
కేటీఆర్ ఆదేశించినా...ఆలస్యం..
పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఈనెలాఖరులోగా ఎట్టిపరిస్థితుల్లోనూ కమిటీలను ఏర్పాటు చేయాలని ఆదేశించినప్పటికీ క్షేత్రస్థాయిలో యంత్రాంగం ఆదిశగా పనిచేయకపోవడం పార్టీలో సమన్వయ రాహిత్యం తేటతెల్లమౌతోందని రాజకీయ విశ్లేషకులు స్పష్టంచేస్తున్నారు. మరోమారు కేటీఆర్ జోక్యంతోనే కొలిక్కి వస్తుందని చెబుతున్నారు. ఏదేమైనా దసరాలోగా ఈ ప్రక్రియ పూర్తవుతుందని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మొత్తంగా పార్టీలో మొదటి నుంచి పనిచేస్తున్న నేతలు, కొత్తగా పార్టీలో చేరిన వారి మధ్య సయోధ్య లేకపోవడమే ఈ ప్రక్రియ ఆలస్యానికి ప్రధాన కారణమని సుస్పష్టమౌతోంది.
Comments
Please login to add a commentAdd a comment