రాజన్న ట్రస్ట్‌బోర్డులో 14 మంది సభ్యులు
-
తాజాగా మంత్రి మండలిలో నిర్ణయం
-
దరఖాస్తులకు వచ్చే నెల 8వరకు గడువు
-
సెప్టెంబర్ రెండో వారంలో నియామకం
వేములవాడ : వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి ట్రస్ట్‌బోర్డులో సభ్యుల సంఖ్యను తొమ్మిది నుంచి 14కు పెంచుతూ ప్రభుత్వం సోమవారం జరిగిన మంత్రిమండలి సమావేశంలో నిర్ణయం తీసుకుంది. సమైక్య రాష్ట్రంలో ఆలయ కమిటీలో సభ్యుల సంఖ్య తొమ్మిది ఉండేది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి కొత్త కమిటీని నియమించలేదు. దానికి బదులు ప్రభుత్వం సీఎం కేసీఆర్ అధ్యక్షతన వేములవాడ ఆలయ అభివద్ధి అథారిటీ (వీటీడీఏ)ను ఏర్పాటు చేసింది. వైస్‌చైర్మన్‌గా జిల్లాకు చెందిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ముద్దసాని పురుషోత్తంరెడ్డిని నియమించింది. అప్పటినుంచి సభ్యుల నియామకంలో జాప్యం జరుగుతోంది. మహాశివరాత్రి జాతరకు రెనోవేషన్ కమిటీని నియమించి ఉత్సవాలను నిర్వహించింది. టీఆర్‌ఎస్ శ్రేణుల నుంచి నామినేటెడ్ పదవులపై ఒత్తిడి పెరుగుతుండటంతో ప్రభుత్వం ఆ దిశగా ముందడుగు వేసింది. సభ్యుల సంఖ్యను పెంచి మరికొంత మందికి అవకాశాలు కల్పించాలని మంత్రిమండలి నిర్ణయించింది. ఇప్పటికే రాజన్న ధర్మకర్తల మండలి నియామకానికి నోటిఫికేషన్ విడుదలైంది. దరఖాస్తులకు వచ్చేనెల 8వరకు గడువుంది. పలువురు ఆశావహులు ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నారు. ఎమ్మెల్యే రమేశ్‌బాబుతోపాటు ఇతర నాయకులను ప్రసన్నం చేసుకుని కమిటీలో చోటు దక్కించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. సెప్టెంబర్ రెండో వారంలో రాజన్న ధర్మకర్తల మండలి ఏర్పాటు ఖాయమని టీఆర్‌ఎస్ వర్గాలు భావిస్తున్నాయి. నియోజకవర్గ నాయకులతోపాటు మంత్రులు ప్రాతినిథ్యం వహించే నియోజకవర్గాలు, ఉత్తర తెలంగాణలోని అసెంబ్లీ స్థానాల నుంచి సైతం సభ్యులను తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ అంశంపై ఇప్పటికే ఎమ్మెల్యే రమేశ్‌బాబుపై ఆయా ప్రాంతాల ఎమ్మెల్యేలతో ఒత్తిడి తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది.