న్యూఢిల్లీ/బెంగళూరు: అయోధ్యలో రామాలయ నిర్మాణానికి కేవలం హిందువుల నుంచే కాదు, ఏ మతం వారు విరాళాలు ఇచ్చినా స్వీకరిస్తామని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు సభ్యుడు, కర్ణాటక రాష్ట్రం ఉడిపిలోని ప్రముఖ పెజావర్ మఠాధిపతి విశ్వప్రసన్న తీర్థ స్వామి తెలిపారు. రామునిపై విశ్వాసం ఉన్న ఏ మతం వారైనా ఎంతైనా విరాళంగా ఇవ్వవచ్చునన్నారు.
ఆగస్టు 5న జరిగే భూమిపూజకు.. అత్యంత సీనియర్ బీజేపీ నేతలు ఎల్‌కే అడ్వాణీ, ఎం.ఎం.జోషి, ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ తదితర 200 మందిని ఆహ్వానిస్తామని ట్రస్టు సభ్యులు అనిల్ మిశ్రా, కామేశ్వర్ చౌపాల్ తెలిపారు. ఆగస్టు 5వ తేదీన అయోధ్యలో చేపట్టే రామాలయ భూమిపూజ కార్యక్రమం దూరదర్శన్‌తోపాటు ఇతర చానెళ్లలో ప్రత్యక్ష ప్రసారం అవుతుందని వారన్నారు. దేశంలోని ప్రముఖ యాత్రాస్థలాల మట్టితోపాటు ప్రముఖ సిక్కు, బౌద్ధ, జైన మతాలయాల వద్ద మట్టిని కూడా సేకరించి, అయోధ్యకు పంపుతామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment