జనధనంతో.. ప్రైవేటుకు ప్రయోజనం..
జనధనంతో.. ప్రైవేటుకు ప్రయోజనం..
Published Wed, Oct 19 2016 11:34 PM | Last Updated on Tue, Oct 16 2018 6:33 PM
నిబంధనలకు నీళ్లొదిలిన తుని మున్సిపల్ అధికారులు
పట్టణంలో అనేక ప్రాంతాల్లో కచ్చా డ్రెయిన్లూ కరువే..
టీడీపీ వారి లేఅవుట్‌కు రూ.28 లక్షలతో కాలువ నిర్మాణం
ఎగువ నుంచి నీరు పోవడానికేనని సాకులు
తుని : వడ్డించే వాడు మనవాడైతే చాలు.. బంతి చివర కూర్చున్నా నష్టం లేదన్నది సామెత. దీన్ని తుని పురపాలకసంఘం అధికారులు కొంచెం మార్చి ‘మనవాడైతే అసలు బంతిలో కూర్చోకపోయినా విందుకు లోటు లేదు’ అంటున్నారు. ప్రజాధనాన్ని ప్రజల కోసం కాక రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ధారాదత్తం చేస్తున్నారు.
తుని పట్టణంలోని అనేక ప్రాంతాల్లో కనీసం రోడ్లు, కాలువలు లేవు. వీటికి సంబంధించి ప్రతిపక్షానికి చెందిన కౌన్సిలర్లు విజ్ఞాపనలిచ్చినా నిధులు లేవని చెప్పి మున్సిపల్ అధికారులు కాలయాపన చేస్తున్నారు. అదే అధికారులు ప్రైవేటు లే అవుట్ కోసం ప్రజాధనంతో అధికారికంగా కాలువ నిర్మాణం చేపట్టారు . అది అధికార పార్టీకి చెందిన మున్సిపల్ వైస్ చైర్మన్‌కు సంబంధించిన వారి లే అవుట్ కావడంతో నిబంధనలు సడలించారు. రూ.28 లక్షలతో యుద్ధప్రాతిపదికన కాలువ పనులు చేపట్టారు.
నిబంధనలు ఇలా..
ఏదైనా వ్యవసాయ భూమిని లే అవుట్ వేయాలంటే మార్కెట్ విలువలో పది శాతం భూమి మార్పిడి ఫీజు చెల్లించాలి. కాలువలు, రోడ్లు, విద్యుత్ సదుపాయం లే అవుట్ వేసినవారే సమకూర్చాలి. మొత్తం స్థలంలో పది శాతాన్ని ప్రజావసరాలకు మార్ట్‌గేజ్ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ సక్రమంగా ఉంటేనే డీటీపీసీ లేదా ఉడా అనుమతులు ఇస్తాయి. గతంలో తుని పరిసర ప్రాంతాల్లో సుమారు 270 ఎకరాల్లో అనధికార లే అవుట్లు వేశారు. ఇందుకు సంబంధించి రూ.30 కోట్ల మేర చెల్లించాలని ఉడా అధికారులు నోటీసులు జారీ చేశారు. ఇప్పుడు తాజాగా పట్టణానికి ఆనుకుని ఉన్న మున్సిపల్ వైస్ చైర్మన్ కుటుంబసభ్యులకు చెందిన 15 ఎకరాల్లో ఉడా లే అవుట్ వేస్తున్నారు. ఇందుకు సంబంధించిన అనుమతుల కోసం దాఖలు చేసిన దరఖాస్తుల్లో రోడ్లు, కాలువలు, విద్యుత్ తదితర మౌలిక సదుపాయాలను కల్పిస్తామని పేర్కొన్నారు. 60 అడుగుల రోడ్లు, మేజర్ డ్రెయిన్లను ఏర్పాట చేయాల్సిన బాధ్యత లే అవుట్ వేసే వారిదే. ఇందుకు భిన్నంగా మున్సిపల్ అధికారులు ప్రజలు పన్నుల రూపంలో చెల్లించిన సొమ్ముతో అధికార పార్టీకి చెందిన రియల్‌ఎ స్టేట్ వ్యాపారికి చెందిన లే అవుట్ లో కాలువ నిర్మిస్తున్నారు. విశేషమేమిటంటే అదే లే అవుట్‌కు అనుకుని మరో లే అవుట్ వ్యాపారి పక్కా రోడ్లు, కాలువలు, విద్యుత్ లైను ఏర్పాటు చేశారు. ఇక్కడ మాత్రం విరుద్ధంగా జరుగుతోంది.
కనీస సదుపాయాలకు నోచని 18కి పైగా మురికివాడలు
పట్టణంలోని 18కి పైగా మురికివాడల్లో కనీస సదుపాయాలు లేవు. రోడ్లు, కాలువలు ఏర్పాటు చేయాలని ఏళ్ల తరబడి ప్రజలు అడుగుతున్నా నిధుల కొరత ఉందని చెప్పి అధికారులు తప్పించుకుంటన్నారు. కొండవారిపేట, డ్రైవర్స్ కాలనీ, బ్రహ్మాల కాలనీ, సాయినగర్, వారదరపు పేట, రామకృష్ణా కాలనీ, ఇసుకలపేట, ఉప్పరగూడెం తదితర ప్రాంతాల్లో కచ్చా కాలువలు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులకు తమ ప్రాంతాల్లో పరిస్ధితిని వివరించినా స్పందన లేదని ప్రజలు వాపోతున్నారు. ఈ నేపథ్యంలో ప్రైవేట్ వ్యక్తుల వ్యాపారానికి మేలు చేకూర్చేందుకు రూ.28 లక్షలను ధారపోయడాన్ని పలువురు తప్పు పడుతున్నారు. ఇలాంటి అనుచితాలు మాని, ప్రజాధనాన్ని ప్రజోపయోగానికే ఖర్చు పెట్టాలంటున్నారు. కాగా ఎగువ ప్రాంతంలో నీరు పోవడానికి దారి లేకపోవడంతో సదరు లే అవుట్ యజమానిని అభ్యర్థించి అటుగా కాలువను ప్రజల కోసం కాలువను నిర్మిస్తున్నామని మున్సిపల్ కమిషనర్ ఎస్.వెంకటరమణ చెప్పారు. ఇందులో ఎవరి ఒత్తిళ్లూ లేవని, నిబంధనల ప్రకారం లే అవుట్ యజమాని రోడ్లు, కాలువలు నిర్మించాల్సే ఉంటుందని అన్నారు.
Advertisement