
శ్రీవాణిపై చర్యలు తీసుకుంటాం: సీఐ
వికారాబాద్ : అన్న భార్యపై దాడి చేసిన కేసులో పోలీసుల విచారణకు బుల్లితెర నటి శ్రీవాణి గైర్హాజరు అయింది. ఈ సందర్భంగా వికారాబాద్ మహిళాa పోలీస్ స్టేషన్ సీఐ నిర్మల మాట్లాడుతూ విచారణకు హాజరు కావాలని శ్రీవాణికి ఫోన్ చేశామన్నారు. అయితే ఆమె రాలేదని, విచారణకు శ్రీవాణి సహకరించడం లేదన్నారు. శ్రీవాణిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీఐ తెలిపారు. అవసరం అయితే అరెస్ట్ తప్పదన్నారు. మరోవైపు పోలీసుల విచారణకు అనూష హాజరు అయ్యింది. కాగా షూటింగ్ ఉన్నందునే విచారణకు హాజరు కాలేకపోయానని శ్రీవాణి తెలిపింది.
కాగా రంగారెడ్డి జిల్లా పరిగికి చెందిన అనూష, శ్రీవాణి ఇంటి స్థలం విషయంలో గొడవకు దిగడంతో పాటు ఘర్షణ పడి పరస్పరం ఫిర్యాదులు చేసుకోవడంతో కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఐ నిర్మల నిన్న వివాదాస్పద ఇంటి స్థలాన్ని పరిశీలించి విచారణ జరిపారు. స్థానికులతో మాట్లాడి ఆరా తీశారు. నటి శ్రీవాణి పలుమార్లు సదరు ఇంటి స్థలాన్ని సందర్శించిందని, వదిన అనూషపై బెదిరింపులకు పాల్పడిందని సీఐకి వివరించారు. దీంతో వారందరి వాంగ్మూలాలను సీఐ నమోదు చేశారు.