
కవలల ప్రేమ !
వారిద్దరూ కవల పిల్లలు. ఏడేళ్లుగా ఒకరిని విడిచి ఒకరు ఉండడంలేదు. ఒకే కంచంలో తింటూ.. ఒకే పాఠశాలకు వెళ్లి చదువుకుంటున్నారు. అలాంటి వారి మధ్య ఒక్క రోజు ఎడబాటు రావడంతో భరించలేకపోయారు. వివరాల్లోకి వెళితే.. వేంపల్లె రాజీవ్ కాలనీలో నివాసం ఉండే రవికుమార్‌కు కేతన్, కేతన అనే అబ్బాయి, అమ్మాయి (కవలలు) ఉన్నారు. ఆదివారం మధ్యాహ్నం వీరు తండ్రి రవికుమార్ వద్దకు వెళ్లి తిరిగి వస్తూ జెడ్పీ బాలుర హైస్కూలు సమీపంలో రోడ్డు దాటుతుండగా కేతనను ఓ వ్యక్తి మోటారు సైకిల్‌పై వెళ్తూ ఢీకొట్టాడు. దీంతో ఆ చిన్నారి కుడి భుజం, మోచేయి వద్ద ఎముక విరిగింది.
వేంపల్లె ప్రభుత్వాసుపత్రిలో ప్రాథమిక చికిత్స నిర్వహించి మెరుగైన చికిత్స కోసం కేతనను కడప రిమ్స్‌కు తరలించారు. కేతన్ ఇంటి వద్దే ఉండిపోయాడు. రిమ్స్‌లో కేతన చికిత్స పొందుతూ సోదరుడు కేతన్ వస్తే కాని ఏమీ తిననని మారాం చేసింది. కేతన్‌ను రిమ్స్‌కు తీసుకెళ్లాక అన్నం తినింది. సోమవారం సాయంత్రం డిశ్చార్జ్ అయ్యాక ఇంటికి వచ్చారు. ఇంట్లో కూడా కేతనకు.. సోదరుడు కేతన్ అన్నం తినిపిస్తూ సపర్యలు చేస్తున్నాడు. వీరి ప్రేమ చూసి ఇరుగు పొరుగు వారు ఔరా అంటూ ఆశ్చర్యపోతున్నారు.
-ఫొటో: రామ్మోహన్‌రెడ్డి, వేంపల్లె