అప్పుల బాధతో తాళలేక కర్నూలు జిల్లాలో ఇద్దరు రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గోనెగండ్ల మండలం గాజులదిన్నెకు చెందిన కె.రాముడు(60) తనకున్న పదెకరాల్లో వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడవరు. వరుస కరువులతో పాటు చేతికొచ్చిన కాస్త పంటకు గిట్టుబాటు ధర రాకపోవడంతో బ్యాంకులో రూ.1.30 లక్షలు, ప్రైవేట్‌గా రూ.2 లక్షల అప్పు చేశాడు.
ఈ నేపథ్యంలో రుణదాతల నుంచి ఒత్తిళ్లు అధికమవ్వడంతో మనస్తాపం చెందిన రాముడు ఆదివారం రాత్రి పొలానికి వెళ్లి పురుగు మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. ఆలస్యంగా గుర్తించిన కుటుంబసభ్యులు అతన్ని కర్నూలు ప్రభుత్వాస్పత్రికి తరలించగా.. సోమవారం ఉదయం మరణించాడు. కుటుంబసభ్యులు అతని రెండు కళ్లను ప్రభుత్వ కంటి ఆస్పత్రికి దానం చేశారు.
మరో ఘటనలో గూడురుకు చెందిన రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. పట్టణానికి చెందిన గొల్ల రాముడు(45) కొన్నేళ్లుగా 4 ఎకరాలను కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నాడు. వర్షాభావ పరిస్థితులతో రెండేళ్ల నుంచి పంటలు సక్రమంగా పండక నష్టపోయాడు. కుమారుడు, ఇద్దరు కుమార్తెల పెళ్లిళ్లు చేయడం.. మరోవైపు వ్యవసాయం కలిసి రాకపోవడంతో రూ.4 లక్షల వరకు అప్పు చేశాడు. ఈ నేపథ్యంలో రుణదాతల నుంచి ఒత్తిళ్లు వస్తుండటంతో మనస్తాపానికి గురైన రాముడు సోమవారం పొలానికి వెళ్లి పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమీపంలో ఉన్న రైతులు గమనించి అతన్ని ఆస్పత్రికి తరలిస్తుండగా మధ్యలోనే మృతి చెందాడు.