మామిడి తోరణాలు కట్టేందుకు ప్రయత్నిస్తూ..
-
విద్యుదాఘాతంతో ఇద్దరు మృతి, ఒకరికి గాయాలు
-
మృతులు కావలి ప్రాంత మత్స్యకారులు
-
పండుగనాడు విషాదం
కోవూరు : పండుగనాడు ఆ రెండు కుటుంబాల్లో విషాదం నెలకొంది. వినాయకుడి ప్రతిమ ఏర్పాటుచేసిన చోట పచ్చని తోరణాలు కట్టేందుకు ప్రయత్నిస్తూ ఇద్దరు యువకులు విద్యుదాఘాతంతో మృత్యువాతపడ్డారు. ఈ సంఘటన కోవూరులో సోమవారం చోటుచేసుకుంది. వివరాలు.. కావలి రూరల్ ప్రాంతమైన అన్నగారిపాళెం గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న లక్ష్మీపురం మత్స్యకార గ్రామానికి చెందిన బత్తాని రామకృష్ణ (24), పెద్దపట్టపాళెం పంచాయతీ పరిధిలో ఉన్న చిన్నపట్టపుపాళెం చెన్నెయపాళెంకు చెందిన యల్లంగారి పార్వతయ్యలు(24) (చంటి), విడవలూరు రామచంద్రాపురం మత్స్యకార గ్రామానికి చెందిన పామంజి సుబ్రహ్మణ్యంలు కోవూరు ఇనమడుగు సెంటర్‌లో ఉన్న రాజరాజేశ్వరి ఐస్ ఫ్యాక్టరీలో రొయ్యలను ప్యాకింగ్ చేసేందుకు కూలీలుగా పనిచేస్తున్నారు. చవితి సందర్భంగా ఫ్యాక్టరీ ఆవరణలో వినాయకుడి విగ్రహాన్ని ఏర్పాటుచే శారు. పై ముగ్గురు ఫ్యాక్టరీ గేట్ ముందు మామిడాకుల తోరణాలు ఏర్పాటుచేసేందుకు ఒక ఇనుపపైనును నిల»ñ ట్టాలని ప్రయత్నిస్తున్నారు. ఈ సమయంలో ఫ్యాక్టరీ ముందువెళ్తున్న 11 కేవీ విద్యుత్ వైర్లకు ఇనుపపైపు తగిలి ముగ్గురూ తీవ్రంగా గాయపడ్డారు. వారిని వెంటనే ఫ్యాక్టరీలో ఉన్న ఓ వాహనంలో నెల్లూరుకు తరలిస్తుండగా రామకృష్ణ, పార్వతయ్యలు మార్గమధ్యలో మృతిచెందారు. సుబ్రహ్మణ్యం నారాయణ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
సంఘటనా స్థలం పరిశీలన
విద్యుదాఘాతంతో ఇద్దరు మృతిచెందిన విషయం తెలుసుకున్న సీఐ మాధవరావు, ఎస్సై వెంకట్రావు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. వివరాలు తెలుసుకుని రామకృష్ణ, పార్వతయ్యల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం నెల్లూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఏఎస్‌ఐ మురళీమోహన్ పోస్టుమార్టానికి సంబంధించిన నివేదిక తయారుచేసి మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. అలాగే విద్యుత్‌శాఖ ఏడీ యుగంధర్ తన సిబ్బందితో ఫ్యాక్టరీ వద్దకు చేరుకుని పరిశీలించారు.
మిన్నంటిన రోధనలు
రామకృష్ణ, పార్వతయ్యల మృతితో వారి గ్రామాల్లో విషాదఛాయలు నెలకొన్నాయి. చేతికి అందివచ్చిన వారు పండుగరోజు మృత్యువాతపడటంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. పార్వతయ్య సోదరుడు చనిపోవడంతో అతని తల్లిదండ్రులు యల్లంగారి జయరామయ్య, బుజ్జమ్మలకు చేదోడువాదోడుగా ఉన్నాయి. ఈ క్రమంలో పార్వతయ్య మృతితో అతని కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.