సంతోష్
జీవితంపై విరక్తి చెంది ఇద్దరి ఆత్మహత్య
Published Tue, Aug 16 2016 12:02 AM | Last Updated on Mon, Sep 4 2017 9:24 AM
అలమండ (జామి) : జీవితంపై విరక్తి చెంది ఇద్దరు ఆత్మహత్య చేసుకున్న సంఘటన అలమండ, జామి గ్రామాల్లో చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలియజేసిన వివరాలు ఇలా ఉన్నాయి. అలమండ గ్రామానికి చెందిన కోట సంతోష్ (28) అనే వ్యక్తి కొంతకాలంగా కడుపునొప్పితో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో మద్యానికి బానిసవ్వడంతో జీవితంపై విరక్తి చెంది ఆదివారం రాత్రి తన ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సోమవారం ఉదయం ఏడు గంటలైనా సంతోష్ ఇంటి నుంచి బయటకు రాకపోవడంతో, తల్లి రాములమ్మ గదిలోకి వెళ్లి చూసేసరికి కుమారుడు ఉరివేసుకుని కనిపించాడు. దీంతో ఆమె కేకలు వేయడంతో ఇరుగుపొరుగు వారు వచ్చి పోలీసులకు సమాచారం అందజేశారు. ఎస్సై ఘని సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని పోస్టుమార్టం కోసం మతదేహాన్ని విజయనగరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇతని భార్య సంతోషి ఇటీవలే పుట్టింటికి వెళ్లింది. అలాగే జామి గ్రామంలోని మంగళవీధికి చెందిన గొర్లె ఎర్నిబాబు (30) కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. అనారోగ్యం ఎంతకీ నయం కాకపోవడంతో జీవితంపై విరక్తి చెంది ఆదివారం సాయంత్రం పురుగు మందు తాగాడు. వెంటనే కుటుంబ సభ్యులు గమనించి 108 వాహనంలో విజయనగరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ, అదే రోజు రాత్రి మతి చెందాడు. మతుడికి భార్య, ఇద్దరు కుమారులున్నారు. ఎస్సై ఘని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Advertisement