అలమండలో హత్య?
Published Thu, Aug 22 2013 2:04 AM | Last Updated on Mon, Jul 30 2018 8:27 PM
అలమండ(జామి), న్యూస్‌లైన్ : మండలంలోని అలమండలో వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఇది హత్యేనని సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్థానికులు, మృతుని కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం... అలమండ గ్రామానికి చెందిన బూసర్ల రాధ అప్పలనాయుడు(40) మంగళవారం రాత్రి అదే గ్రామంలోని గేదెల సన్నిబాబు అనే రైతు పొలానికి అప్పలరాజు చెరువు పెద్ద మదుము ద్వారా వచ్చే కాలువ నీటిని ఆయిల్ ఇంజన్ ద్వారా తోడడానికి వెళ్లాడు. రాత్రి తొమ్మిది గంటలైనా ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు అతని సెల్‌ఫోన్‌కు రింగ్ చేశారు. స్పందన లేకపోవడంతో రాత్రంతా వెతికారు. బుధవారం ఉదయం అప్పలరాజు చెరువు సమీపంలో ఉన్న లగుడు అయ్యప్ప కల్లాల వద్ద దిమ్మపై అప్పలనాయుడు విగతజీవై పడి ఉండడాన్ని కొంతమంది గమనించి గ్రామస్తులకు సమాచారం అందించారు. మృతుని కుటుంబ సభ్యులు, గ్రామస్తులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. మృతుడి తల, వీపు వెనుక, చెవి వద్ద చిన్నచిన్న గాయాలున్నాయి. శరీరంపై రక్తపు మరకలు ఉన్నాయి. పెద్ద దెబ్బలు లేకపోవడం, ఒంటిపై ఎక్కువగా రక్తం ఉండడం అనుమానాలకు తావిస్తోంది.
పాతకక్షలే కారణమా...
రెండేళ్లుగా మృతుడు బూసర్ల రాధ అప్పలనాయుడు కుటుంబానికి, గ్రామానికి చెందిన పోలిపర్తి కృష్ణ, మిడతాన అప్పారావు, ఈదుబిల్లి వెంకటరావు, లగుడు చంద్రయ్య, మల్లయ్యల మధ్య వివాదం ఉంది. అప్పలనాయుడు కల్లం గ్రామ శివారులో ఉంది. ఆయన కల్లం పక్కనే మిగతా వారి కల్లాలు ఉన్నాయి. కల్లానికి ఆనుకుని ఉన్న మదుము పక్కన చింతచెట్టు ఉంది. ఈ చింత చెట్టు తమదంటే తమదంటూ వీరి మధ్య నిత్యం వివాదం చోటుచేసుకుండేది. అప్పలనాయుడు కుటుంబ సభ్యులు వారిపై గతంలో పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం న్యాయస్థానంలో కేసు నడుస్తోంది. ఈ కక్షతోనే వైరి వర్గం వారు తన భర్తను హత్య చేసి ఉంటారని మృతుడి భార్య లక్ష్మి, కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పోలీసులకు కూడా ఈ మేరకు ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉండగా... మంగళవారం అర్ధరాత్రి మృతుడు అప్పలనాయుడు సోదరుడైన బూసర్ల కృష్ణకు, గ్రామానికి చెందిన పోలిపర్తి కృష్ణ, పైల సన్నిబాబుల మధ్య పొలానికి నీరు తోడిన విషయంలో వివాదమైంది. ఈ గొడవలో బూసర్ల కృష్ణను పారతో గాయపరిచినట్లు తెలుస్తోంది.
పెద్ద దిక్కును కోల్పోయిన కుటుంబం
మృతుడు అప్పలనాయుడుకు భార్య లక్ష్మితోపాటు, తొమ్మిది, ఏడేళ్ల వయస్సు గల ఇద్దరు కుమారులు ఉన్నారు. అప్పలనాయుడే కుటుంబానికి పెద్ద దిక్కు. భర్త మృతితో లక్ష్మి గుండెలవిసేలా రోదిస్తోంది. సీఐ రఘవీర్‌విష్ణు, ఎస్సై బి.లూథర్‌బాబు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. క్లూస్‌టీమ్ కూడా వచ్చి ఆధారాలు సేకరించింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎస్.కోట ప్రభుత్వాస్పత్రికి తరలించి, అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్లు సీఐ రఘువీర్‌విష్ణు తెలిపారు.
Advertisement
Advertisement