
వాళ్లు చూశారంటే...తాళం పగలాల్సిందే..
వరంగల్: తాళం వేసి ఉన్న ఇళ్లలో దొంగతనాలకు పాల్పడటం వారికి వెన్నతో పెట్టిన విద్య. ఇద్దరూ రెండు జిల్లాల్లో తమదైన శైలిలో చెలరేగి పోయారు. చివరికి వారిని వరంగల్ రూరల్ పోలీసులు వేర్వేరు చోట్ల అరెస్టు చేశారు. వరంగల్ జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో రూరల్ ఎస్పీ అంబర్‌కిశోర్ ఝా మంగళవారం వివరాలు వెల్లడించారు. ఖమ్మం జిల్లా పాల్వంచ పట్టణం జయమ్మ కాలనీకి చెందిన తూర్పటి ప్రసాద్, నల్లగొండ జిల్లా మోత్కూరుకు చెందిన సిరిగిరి సాయిబాబా.. తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేసేవారు.
వ్యసనాలకు బానిసైన ప్రసాద్ 9 ఇళ్లల్లో చోరీలు చేశాడు. వరంగల్ జిల్లా పరిధిలోని పలు నగరాల్లో తాళం వేసిన ఇళ్లలో అతడు దొంగతనాలకు పాల్పడ్డాడు. నిందితుడు చోరీ సొత్తుతో మహబూబాబాద్ రైల్వేస్టేషన్ వచ్చాడని అందిన సమాచారంతో పోలీసులు మంగళవారం ఉదయం మాటు వేసి అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నేరం ఒప్పుకున్నాడు.
మరో నిందితుడు సాయిబాబా మహబూబాబాద్ పరిధిలో చోరీలకు పాల్పడ్డాడు. ఇతడు మంగళవారం ఉదయం మరిపెడ బస్టాండ్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతుంటే పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా నేరాలను అంగీకరించాడు. ఇద్దరి నుంచి రూ.12.77 లక్షల విలువైన 499 గ్రాముల బంగారు ఆభరణాలు, ఒక కిలో వెండి ఆభరణాలతోపాటు ల్యాప్‌ట్యాప్, డీవీడీ ప్లేయర్‌ను స్వాధీనం చేసుకున్నారు.