ఉచ్చులో పడి మృత్యుఒడికి..
ఉచ్చులో పడి మృత్యుఒడికి..
Published Sun, Mar 12 2017 12:16 AM | Last Updated on Wed, Sep 26 2018 5:59 PM
టి.నరసాపురం : వన్యప్రాణుల వేట కోసం పెట్టిన ఉచ్చు ఓ మనిషి నిండు ప్రాణాన్ని బలిగొన్న ఘటన ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాల సరిహద్దు ప్రాంతంలో చోటుచేసుకుంది. టి.నరసాపురం మండలం మర్రిగూడెంకు చెందిన గిరిజనుడు చాప సుధీర్ (22) దుర్మరణం పా లయ్యాడు. అడవి పందులను వేటాడేందుకు వేటగాళ్లు ఏర్పాటు చేసిన విద్యుత్ తీగలు తగిలి విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతిచెందాడు. వివరాలు ఇలా ఉన్నాయి.. సుధీర్ మేకల కాపరిగా జీవనం సాగిస్తున్నాడు. శుక్రవారం మర్రిగూడెం సమీపంలోని అటవీ ప్రాంతానికి మేత కోసం మేకలను తోలుకు వెళ్లాడు. సాయంత్రం వర్షం రావడంతో మేకలను తోలుకుని ఇంటికి వచ్చేశాడు. అయితే గుంపులో నుంచి నాలుగు మేకలు తప్పిపోయాయి. వర్షం తగ్గిన తర్వాత రాత్రి 7 గంటలకు మళ్లీ అటవీ ప్రాంతానికి వెళ్లి తప్పిపోయిన మేకలను వెతుకుతున్నాడు. అప్పటికే తెలంగాణ రాష్ట్ర సరిహద్దులోని జలవాగు సమీపంలో జలవాగు నివాసిత ప్రాంత గిరిజనులు అడవి పందులను వేటాడేందుకు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ నుంచి తీగతో ఉచ్చును ఏర్పాటుచేశారు. ఈ ఉచ్చు సుధీర్ కాలికి తగిలి అక్కడికక్కడే మృతిచెందాడు. రాత్రి 10 గంటలకు కూడా సుధీర్ తిరిగి రాకపోవడంతో తండ్రి వీరాస్వామి, కొందరు గ్రామస్తులు వెదుకుతూ అటవీ ప్రాంతానికి వెళ్లారు. మృతిచెంది పడి ఉన్న సుధీర్‌ను గుర్తించి మృతదేహాన్ని మర్రిగూడెం తీసుకువచ్చారు. వన్యప్రాణుల వేట కోసం విద్యుత్ తీగను ఏర్పాటు చేసిన తెలంగాణకు చెందిన గిరిజనులు తాటి దుర్గయ్య, తాటి లక్ష్మణరావు, తాటి ముత్యా లు, బండిమాల లక్ష్మణుడును మర్రిగూడెం తీసుకువచ్చి నిర్బంధించారు.
మర్రిగూడెంలో విషాదఛాయలు
వీరాస్వామికి సుధీర్ ఒక్కడే కుమారుడు. ఇద్దరు కుమార్తెలు ఉండగా వారికి వివాహమైంది. తెలంగాణ రాష్ట్రం దమ్మపేట మండలం యర్రగుంపునకు చెందిన వెంకటరమణతో ఏడాదిన్నర క్రితం సుధీర్‌కు వివాహమైంది. వీరికి ఆరు నెలల కు మారుడు ఉన్నాడు. అనుకోని సంఘటన తో మర్రిగూడెంలో విషాదఛాయలు అలముకున్నాయి. విషయం తెలిసిన టి.నరసాపురం పోలీసులు శనివారం మర్రిగూడెం వెళ్లారు. తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా దమ్మపేట పోలీసులు మర్రిగూడెం వచ్చి కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అశ్వారావుపేట తరలించారు. నిర్బంధించిన నలుగురు గిరిజనులను మర్రిగూడెంవాసులు దమ్మపేట పోలీసులకు అప్పగించారు.
Advertisement
Advertisement