విద్యార్థుల జీవితాలతో చెలగాటం
– విద్యార్థుల నుంచి యూసీఎస్ ఫీజు వసూలు
– వర్సిటీకి చెల్లించని జేఎన్‌టీయూ అనుబంధ కళాశాలలు
–ఫలితంగా ఆగిన సర్టిఫికెట్ల జారీ
– పరీక్షల నిర్వహణలో నిర్లక్ష్యం
– అబ్జర్వర్లు గైర్హాజరుపై కమిటీ విచారణ
జేఎన్‌టీయూ : జేఎన్‌టీయూ (అనంతపురం) అనుబంధ ఇంజినీరింగ్ కళాశాలల యాజమాన్యాల నిర్లక్ష్యంతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. యూనివర్సిటీ కామన్ సర్వీసెస్ (యూసీఎస్) ఫీజును ప్రతి ఏటా విద్యార్థులు నుంచి యాజమాన్యాలు వసూలు చేస్తున్నాయి. బీటెక్ మొదటి సంవత్సరంలో రూ. 5,500 , రెండు, మూడు ,నాలుగవ సంవత్సరంలో రూ. 2,500 ప్రతి విద్యార్థి ఈ ఫీజు అనుబంధ కళాశాలల యాజమాన్యాలకు చెల్లించాలి. అయితే ఆ మొత్తాన్ని యాజమాన్యాలు వర్సిటీకి చెల్లించడం లేదు. ఫలితంగా రూ. 10 కోట్లుపైగా బకాయిలు పడతుండడంతో వర్సిటీ పరీక్షల విభాగం అధికారులు విద్యార్థుల మార్క్‌ల జాబితాను కళాశాలలకు అందజేయడం లేదు. దీంతో విద్యార్థులు ఆందోళనలకు గురువుతున్నారు.
వెసులుబాటు కల్పించినా..
2016–17 విద్యాసంవత్సరం వరకూ చెల్లించాల్సిన బకాయిల అంశంలో జేఎన్‌టీయూ పరీక్షల విభాగం అధికారులు వెసులుబాటు కల్పించారు. 2014–15 విద్యాసంవత్సరంకు ఫీజు రీఎంబర్స్‌మెంట్ పూర్తిగా వచ్చింది. దీంతో అప్పటి వరకు ఉన్న బకాయిలు చెల్లించాలని షరతు విధించారు. అయినప్పటికీ అనుబంధ ఇంజినీరింగ్ కళాశాలల యాజమాన్యాలు బకాయిలు చెల్లించలేదు. సర్టిఫికెట్లు విద్యార్థికి నేరుగా ఇవ్వకుండా కళాశాలలకు పంపాలని వర్సిటీ నిబంధనలో ఉన్నాయి. ఈ నిబంధన ప్రకారం నేరుగా కళాశాలలకు, లేదా కళాశాల సూచించిన ప్రతినిధికి మాత్రమే సర్టిఫికెట్లు అందచేస్తారు. ఈ నేపథ్యంలో బకాయిలు పడ్డ యాజమాన్యాలు సర్టిఫికెట్లు తీసుకెళ్లడానికి వర్సిటీకి రావడం మానేశారు. దీంతో విద్యార్థికి సర్టిఫికెట్లు అందడంలేదు.
పరీక్షల నిర్వాహణలో నిర్లక్ష్యం..
పరీక్షల నిర్వాహణలోనూ కళాశాలల నిర్వాకం వెలుగులోకి వచ్చింది. ప్రతి పరీక్ష కేంద్రానికి అబ్జర్వర్‌లను నియమిస్తారు. ఆన్‌లైన్‌లో ప్రశ్నాపత్రాన్ని డౌన్‌లోడ్ చేయడం, ప్రింటింగ్ తీసి విద్యార్థులకు ప్రశ్నాపత్రాలు జారీ చేయాల్సిన ప్రక్రియలో కీలకంగా అబ్జర్వర్ బాధ్యత వహించాలి. కానీ పరీక్ష ప్రారంభమై, స్పెషల్ అజ్జర్వర్లు తనిఖీ చేసేంతవరకు అజ్జర్వర్లు విధుల్లో లేరని స్పష్టమైంది. ఈ అంశంపై విచారించడానికి సీనియర్ ప్రొఫెసర్ల కమిటీని నియమించారు. ఎందుకు గైర్హాజరయ్యారు? పరీక్షలు నిర్వహించడంలో బాధ్యతారాహిత్యంపై రెండు రోజులుగా కమిటీ విచారిస్తోంది.