ప్రశాంతి నిలయంలో ఉగాది వేడుకలు
పుట్టపర్తి టౌన్ : ప్రశాంతి నిలయంలో ఉగాది వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మంగళవారం ప్రశాంతి నిలయంలోని సాయికుల్వంత్ సభా మందిరంలో సత్యసాయి మహాసమాధి చెంత హైదరాబాద్‌కు చెందిన సత్యసాయి భక్తుల వేదపఠనంతో వేడుకలు ప్రారంభమయ్యాయి. అనంతరం సత్యసాయిని కీర్తిస్తూ భక్తి గీతాలతో కచేరీ నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు జడ్జి రామసుబ్రమణియన్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. సత్యసాయి బోధనలు మానవాళికి ఆదర్శమన్నారు. బాలవికాస్ విద్యార్థిగా బాల్యంలో సత్యసాయి బోధనలు అనుసరిస్తున్న తన జీవితంలో చోటు చేసుకున్న అద్భుత అనుభవాలను ఆయన వివరించారు. అనంతరం ఆయన సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్నారు.
హైదరాబాద్ భక్తుల నగర సంకీర్తన
పర్తియాత్రలో భాగంగా పుట్టపర్తికి విచ్చేసిన హైదరాబాద్ సత్యసాయి భక్తులు పట్టణంలో నగరసంకీర్తన కార్యక్రమం నిర్వహించారు. పట్టణంలోని పెద్దవెంకమరాజు కల్యాణమండపం వద్ద సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ సభ్యుడు ఆర్.జె.రత్నాకర్‌రాజు కార్యక్రమాన్ని ప్రారంభించారు. వెండిరథంలో సత్యసాయి చిత్రపటాన్ని ఊరేగిస్తూ భక్తిగీతాలు ఆలపిస్తూ భక్తులు ముందుకు సాగారు. సుమారు వెయ్యి మందికిపైగా భక్తులు నగరసంకీర్తనలో పాల్గోన్నారు.చిన్నారులు పౌరాణిక వేషధారణలో ముందకు సాగుతూ అలరించారు. ప్రశాంతి నిలయం గణేష్ గేట్ వద్ద మంగళహారతితో సంకీర్తన ముగిసింది.
అలంకరణలో మహాసమాధి
ప్రశాంతి నిలయంలో ఉగాది వేడుకలు బుధవారం ఘనంగా జరగనున్నాయి. ఉదయం సత్యసాయి మహాసమాధి చెంత వేదపఠనంతో వేడుకలు ప్రారంభం కానున్నాయి. ప్రశాంతి నిలయాన్ని వేడుకల కోసం ప్రత్యేకంగా ముస్తాబు చేశారు. సత్యసాయి మహాసమాధిని దేదీప్యమానంగా ఫలపుష్పదళాలతో ఆలంకరించారు. హేవిళంబి నామ సంవత్సరం ఉగాది పంచంగ శ్రవణాన్ని పండిత అవధాని శివసుబ్రహ్మణ్యంశాస్త్రి పఠించనున్నారు. అనంతరం విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.