తెలంగాణ భవన్‌లో జరిగిన ఉగాది వేడుకల్లో కేటీఆర్, పోచారం, సబిత తదితరులు
క్రోధి నామ సంవత్సరంలో కేసీఆర్ ఎత్తులు ఫలిస్తాయి
కేటీఆర్ జాగ్రత్తగా వ్యవహరిస్తే ఎన్నికల్లో పట్టు
బీఆర్‌ఎస్ కార్యాలయంలో పంచాంగ పఠనం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో అధికార పక్షానికి కష్టతరంగా ఉండే అవకాశం ఉందని తెలంగాణ భవన్‌లో పంచాంగ శ్రవణం సందర్భంగా పండితులు జోస్యం చెప్పారు. ప్రతిపక్షాలు ప్రయతి్నస్తే ఈ ఎన్నికల్లో విజయం పొందే అవకాశం ఉందన్నారు. మంగళవారం తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. అక్కడ నిర్వహించిన పంచాంగ శ్రవణంలో పండితులు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. క్రోధి నామ సంవత్సరంలో రాజు కుజుడుగా ఉన్నాడని, శని మంత్రిగా ఉన్నాడని పండితులు తెలిపారు. కుజుడు అధిపతిగా ఉండటం వల్ల వాహన, అగ్ని ప్రమాదాలు ఎక్కువగా జరుగుతాయని, ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటాయని పేర్కొన్నారు. వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని, పాడి పంటలు మంచిగా పడుతాయని చెప్పారు. అయితే ధరలు అధికమవుతాయన్నారు.
ఈ ఏడాదంతా కేసీఆర్‌కు బాగుంటుంది
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రాశి కర్కాటకం అని.. ఈ రాశి వారికి ఆదాయం 14, వ్యయం 2 గా, రాజపూజ్యం 6, అవమానం 6గా ఉందని తెలిపారు. గురుడు మంచి స్థానంలో ఉన్నందున ఈ సంవత్సరమంతా కేసీఆర్‌కు బాగుంటుందని తెలిపారు. కర్కాటక రాశి వాళ్లు వేసే ఎత్తుగడలు ఫలిస్తాయని, వారి నిర్ణయాలకు ప్రజాబలం లభిస్తుందన్నారు. వ్యక్తిగతంగా కూడా మంచి ప్రతిష్ఠ ఉంటుందన్నారు. వారి మాటకు, గమనానికి ఈ ఏడాది అడ్డు ఉండదని చెప్పారు. అయితే ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
అలా ఉంటే కేటీఆర్ ప్రజాభిమానాన్ని పొందుతారు
కేటీఆర్‌ది మకర రాశి అని, ఈ రాశి వారు ఏ పనిచేసినా బ్యాలెన్స్‌గా చేయాలని సూచించారు. ఈ రాశి వారికి ఆదాయం 14, వ్యయం 14 ఉందని, రాజపూజ్యం 3, అవమానం 1గా ఉందని పండితులు తెలిపారు. మాటను కట్టడి చేసుకొని మృదువుగా మాట్లాడం వల్ల , చక్కటి ఉపకారాన్ని, అభిమానాన్ని పొందగలుగుతారని అన్నారు. జాగ్రత్తగా ఉంటే ఎన్నికల్లో మంచి పట్టు సాధించే అవకాశం ఉందని పండితులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment